కాపులపాలెం కలవరం
Published Fri, Apr 7 2017 12:19 AM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM
తాళ్లరేవు (ముమ్మిడివరం) :
అమ్మవారి దర్శనం కోసం వెళ్లిన గ్రామస్తుల కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయన్న సమాచారం తెలియగానే మండలంలోని కాపులపాలెం పితానివారి పేటలో కలవరపడింది. మూడు కుటుంబాల్లో ఎవరు ఉన్నారో, ఎవరు మరణించారో తెలియక ఆ కుటుంబాల వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మృతుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది. స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావు, టిళ్లపూడి నాగేశ్వరరావు, గుత్తుల శ్రీను, గుత్తుల విఘ్నేశ్వరరావు తదితరులు కాకినాడలో సంఘటనా స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. ఆ పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ ఈ ఘటనపై సంతాపాన్ని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు.
ఒక్కొక్కరిది ఒక్కో గాథ..
కాకినాడ ప్రమాదంలో మృతి చెందిన పితాని శ్రీను, భార్య హేమలత ఇద్దరు కుమారులు జయకృష్ణ, దుర్గాప్రసాద్ (పండు)లతో కాండ్రకోట వెళ్లారు. ఈ ప్రమాదంలో పితాని శ్రీను అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు జయకృష్ణ సముద్రంలో గల్లంతయ్యాడు. దీంతో ఆ కుటుంబంలో హేమలత, చిన్న కుమారుడు దుర్గాప్రసాద్ మిగిలారు.
పితాని శ్రీను సోదరుడు గోవిందు, అతని భార్య పద్మ, కుమార్తెలు అనిత, రమ్య, కుమారుడు వీరవంశీలతో కలిసి దర్శనానికి వెళ్లారు. అనిత అక్కడికక్కడే మృతి చెందగా, వీరవంశీ ఆచూకీ లభించలేదు. అనిత పదో తరగతి పరీక్షలు ఇటీవల ఇంజరం హైసూ్కల్‌లో రాసింది. వీరవంశీ స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. మరో కుమార్తె పితాని రమ్య తీవ్రంగా గాయపడి కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. కుమార్తె, కుమారుడు కళ్ల ముందే చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
మృతి చెందిన పితాని శ్రీను చెల్లెలు శీలం తణుకులమ్మ, ఆమె కుమార్తె శీలం దేవి, కుమారుడు శీలం శ్రీనులతో కలిసి వెళ్లింది. ప్రమాదంలో శీలం దేవి అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీను కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తణుకులమ్మ భర్త గతంలోనే మృతి చెందడంతో ఆమె కూలిపని చేస్తూ పిల్లలను పోషిస్తోంది. తణుకులమ్మ పరిస్థితి విషమంగా ఉంది. తల్లి అపస్మారక స్థితికి చేరుకోవడం, అక్క దేవి చనిపోవడంతో శ్రీను ఒంటరివాడయ్యాడు.
వీరితోపాటు వెళ్లిన శీలం సత్యనారాయణ, కుటుంబ సభ్యులు మాత్రం క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. సత్యనారాయణ యానాం మున్సిపాలిటీ ట్రాక్టర్ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. అతని చిన్న కుమారుడు త్రిమూర్తులు, అతని భార్య దుర్గాదేవి, కుమార్తె, కుమారుడు క్షేమంగా బయటపడ్డారు.
మృతుల కుటుంబాలకు
స్థానిక నేతల పరామర్శ
స్థానిక నేతలు అక్కడకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. స్థానిక దళిత నాయకుడు, విశ్వజన కళామండలి జిల్లా అధ్యక్షుడు వడ్డి ఏడుకొండలు, లచ్చిపాలెం సొసైటీ అధ్యక్షుడు మోపూ రి వెంకట రెడ్డినాయుడు, మాజీ సర్పంచిలు సుంకర సూర్యనారాయణ, గుత్తుల రామకృష్ణ, కవల కోటేశ్వరరావు తదితరులు పరామర్శించారు.
మృతుల కుటుంబాలను ఆదుకుంటాం : ఎమ్మెల్యే దాట్ల
కాకినాడ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకుంటామని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు హామీ ఇచ్చారు. ఆయన కాకినాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.
వృద్ధ దంపతులకు గుండెకోత
కాకినాడ ప్రమాదంలో మృతి చెందిన పితాని శ్రీను తల్లిదండ్రులు పొట్టకూటి కోసం హైద్రాబాద్‌లో ఉంటున్నారు. కుమారుడు శ్రీను, కుటుంబ సభ్యులు మరణించారన్న విషయాన్ని వారి కుటుంబ సభ్యులు ఫో¯ŒSలో వారికి తెలియజేశారు.
Advertisement
Advertisement