కాకినాడలో విషాదం: తీరానికి మృతదేహాలు
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని సూర్యారావుపేట బీచ్‌లో గత గురువారం గల్లంతైన ఐదుగురులో ఇద్దరి మృతదేహలు లభ్యమయ్యాయి. యూ.కొత్తపల్లి మండలం సుబ్బంపేట తీరానికి వారి మృతదేహలు కొట్టుకు వచ్చాయి. అదేరోజు ముగ్గురి మృతదేహాలు వెలికితీయగా, నేడు మరో ఇద్దరి మృతదేహాలు తీరంలో కనిపించాయి. తాళ్లరేవు మండలం సుంకరపాలెం (కాపులపాలెం) పితానివారిపేటకు చెందిన పితాని గోవిందు, పితాని శ్రీను కుటుంబాలు, వారి చెల్లెలు శీలం తనుకులమ్మ కుటుంబం మొత్తం 18 మంది సభ్యులు టాటా ఏసు గూడ్స్ ఆటోలో పెద్దాపురం నియోజకవర్గంలోని కాండ్రకోట నూకాలమ్మతల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గురువారం సూర్యరావు పేట బీచ్ కి వచ్చారు.
పితాని గోవిందు కుటుంబానికి చెందిన పితాని అనిత (16), పితాని రమ్య (18), పితాని వీరవంశీ (14), పితాని శ్రీను కుటుంబానికి చెందిన పితాని జయకృష్ణ (20), శీలం తనుకులమ్మ (30), శీలం దేవి (16) సముద్రంలోకి దిగిన వెంటనే ఓ రాకాసి అల వీరిని లోపలికి లాగేసుకుంది. సముద్రం ఒడ్డున ఉన్న కుటుంబ సభ్యులు చూస్తుండగానే వీరంతా మునిగిపోయారు. వారిని రక్షించేందుకు పితాని శ్రీను (36) సముద్రంలోకి దిగి సముద్రంలో కొట్టుకుపోయాడు. ఏడుగురిలో ఇద్దర్ని స్ధానికులు ఎలాగోలా కష్టపడి రక్షించారు. గల్లంతైన ఐదుగురిలో ముగ్గురి మృతదేహలు ఆరోజే తీరానికి కొట్టుకువచ్చాయి. మిగిలిన ఇద్దరి మృదేహలు నాలుగురోజైన ఆదివారం తీరానికి కొట్టుకొచ్చాయి.
సంబంధిత కథనాలు
కాకినాడ బీచ్‌లో విషాదం