సుమారు 12 ఏళ్ళ క్రితం శనక్కాయల ఆసామితో ప్రణవ్ తీసుకున్న ఫొటో(ఫైల్‌ఫొటో)
ఆ చిన్న పిల్లల పట్ల ఆ పేదోడు చూపించిన ‘పెద్ద మనస్సు’ 12 ఏళ్ళు గడిచినా సజీవంగా నిలిచింది. చేసేది చిరువ్యాపారమైనా చిన్నారులను చూసి ఆత్మీయతకనబరిచిన అతని తీరుకు ముగ్థుడైన ఓ ఎన్‌ఆర్‌ఐ దశాబ్ధాం తరువాత సదరు చిరువ్యాపారి కుటుంబాన్ని వెతికిపట్టుకుని రూ.25వేలు బహుమానంగా ఇచ్చి తన విజ్ఞతను, ఔదార్యాన్ని చాటుకున్నారు.
సాక్షి, కాకినాడ: గింజాల పెదసత్తియ్య కాకినాడ బీచ్‌లో శనక్కాయలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. అమెరికాలో స్థిరపడ్డ మోహన్ నేమాని తన పిల్లలతో 2010లో కాకినాడ బీచ్‌కు వెళ్ళారు. అక్కడ పిల్లలు అడగడంతో శనక్కాయలు కొనిచ్చారు. తీరా డబ్బులు ఇచ్చే సమయానికి పర్సు మర్చిపోయిన విషయాన్ని మోహన్ గుర్తించారు. విషయాన్ని గమనించిన పెదసత్తియ్య... పర్వాలేదు సార్, పిల్లలే కదా మరోసారి వచ్చినప్పుడు ఇద్దరుగాని లెండి అంటూ పంపించేశాడు. ఆ తరువాత మోహన్‌కుటుంబం అమెరికా వెళ్ళిపోయింది. అయితే మోహన్‌కుమారుడు ప్రణవ్ బీచ్‌రోడ్డులో ‘శనక్కాయల’ జ్ఞాపకాన్ని మాత్రం మర్చిపోలేదు. అప్పుడప్పుడు తండ్రికి గుర్తుచేస్తూ సదరు చిరువ్యాపారి సత్తియ్యతో దిగిన ఫొటోను అలాగే జ్ఞాపకంగా ఉంచుకున్నారు.
పెదసత్తియ్య కుటుంబానికి సహాయం అందిస్తున్న ప్రణవ్, అతని సోదరి సుచిత
12 ఏళ్ళ తరువాత...
సదరు చిరువ్యాపారికి ఎంతోకొంత సొమ్ము ఇవ్వాలనుకున్నా అతడు ఎక్కడున్నాడో మోహన్ నేమానికి ఆచూకీ చిక్కలేదు. దీంతో తనకు బాగాప రిచయుస్తులైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి దృష్టికి తీసుకురాగా, అతని కుటుంబం నాగులాపల్లిలో ఉంటుందని, రెండేళ్ళ క్రితమే సత్తియ్య చనిపోయాడని తెలుసుకున్నారు. సోంతూరుకు వచ్చిన మోహన్‌నేమాని కుటుంబం గురువారం అతని భార్య గంగ, ఇద్దరు పిల్లలను పిలిపించి నాటి విషయాన్ని జ్జాప్తికి తెచ్చారు.
ఎమ్మెల్యే ద్వారంపూడి నివాసం వద్ద పెదసత్తియ్య కుటుంబం
సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సమక్షంలో ఆయన నివాసం వద్ద రూ.25వేలు బహుమానంగా ఇచ్చారు. మోహన్‌కుటుంబాన్ని ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి అభినందించారు. మోహన్ నేమాని మాట్లాడుతూ తరచూ తన కుమారుడు ప్రణవ్ ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకుని కాకినాడ వెళ్ళినప్పుడు అతనికి కొంత సొమ్ము ఇద్దామని చెప్పేవాడని, ఈ క్రమంలోనే సొమ్ము అందజేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment