కాకినాడ బీచ్‌లో ఏర్పాటు చేసిన ఈ అద్దాల వంతెన కొందరికే పరిమితం
పై ఫొటోల్లో అందాలను చూశారా...కాకినాడ బీచ్‌లో కోట్ల రూపాయల వ్యయంతో వీటిని ప్రభుత్వం నిర్మిస్తుంటే పరిసర ప్రాంత ప్రజలు మురిసిపోయారు. అన్నీ పూర్తయిన తరువాత వెళ్లిన జనానికి నిరాశే మిగిలింది. లోపలికి వెళ్లడానికి టిక్కెట్...తీరా వెళ్లాక ప్రతి మలుపులోనూ టిక్కెట్ల మోతే. తెగించి వెళ్తే ఓ కుటుంబానికి కనీసం రూ.200 పైనే జేబుకు చిల్లుపడుతుంది. దీంతో వెళ్లినవారు తిరుగుముఖం పట్టక తప్పడం లేదు.
సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి, కాకినాడ : కాకినాడ బీచ్ అందాలు ఉచితంగా చూసే యోగ్యత లేదు. డబ్బులిచ్చి బీచ్‌లో అడుగు పెట్టాలి. లేదంటే సముద్ర తీరానికి వెళ్లి సేద తీరి వచ్చేయాల్సిందే. ఎందుకంటే బీచ్ అందాలు ఆస్వాదించాలంటే జేబుకు చిల్లుపెట్టుకోవల్సిందే. ఒక్కో ప్రదేశానికి ఒక్కో ధర నిర్ణయించారు. సాధారణంగా ఎక్కడైనా యూజర్ చార్జీల కింద ఐదో పరి రూపాయలు టిక్కెట్ పెడతారు. ఇక్కడ ఒక్కో దానికి ఒక్కో రేటు పెట్టి వినియోగదారుడి మొహంలో నిరాశను మిగుల్చుతున్నారు. బీచ్‌లో అడుగు పెడితే ప్రతి ఒక్కరూ రూ.90 ముట్ట జెప్పాల్సిందే. ఈసారి బీచ్ ఫెస్టివల్‌కు గుడ్‌బై చెప్పి ఆ స్థానంలో సంక్రాంతి సంబరాలు జరుపుకునేందుకు రత్నసిరి ఫుడ్ కోర్టు రిసార్ట్‌కు అనుమతిచ్చారు. ఒకరోజుపాటు ఉత్సవాలు జరిపేందుకు సదరు యాజమాన్యం భారీగా వసూలు చేయడానికి సమాయత్తమవుతోంది. రూ.500 నుంచి రూ.1000 వరకు రేటు పెట్టింది. ఆ ధర భరించేవారికే సంక్రాంతి సంబరాల ప్రవేశం ఉంటుంది.
కుటుంబ సభ్యులూ...పారా హుషార్...!
పిల్లలతో కలిసి బీచ్‌లో అడుగు పెడదామనుకుంటున్నారా? అయితే ఒక్కొక్కరు రూ.70 సిద్ధం చేసుకోవాలి. నలుగురున్న ఫ్యామిలీ వెళితే రూ.280 చెల్లిస్తే గానీ బీచ్‌ను ఆస్వాదించలేదు. ఇక, చిన్న పిల్లలే తోడైతే ఒక్కొక్కరికీ రూ. 30 అదనం కానుంది. దానికి తోడు నాలుగు చక్రాల వాహనంపై వెళితే అదనంగా రూ.20 చెల్లించాలి...అంటే ప్రవేశానికి ఒక ఫ్యామిలీ దాదాపు రూ.300 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. బీచ్ ప్రవేశం ద్వారం దాటాలంటే అడుగు పెట్టాలంటే పెద్దలకు రూ.30, చిన్న పిల్లలకైతే రూ.10, గ్యాస్ బ్రిడ్జిని సందర్శించాలంటే పెద్దలు రూ.20, చిన్నపిల్లలు రూ.10, లేజర్ షో వద్దకు వెళ్లాలంటే పెద్దలు రూ.20, చిన్నపిల్లలు రూ.10 చెల్లించాలి. పార్కింగ్ కోసం ప్రత్యేకంగా నాలుగు చక్రాల వాహనానికైతే రూ. 20, ద్విచక్ర వాహనానికైతే రూ.10 చెల్లించాలి. బీచ్‌లో ఉన్న ప్రతి ప్రదేశానికి ఒక్కో రేటు ఫిక్స్ చేశారు. దీంతో సెలవు రోజున సరదాగా వెళ్దామంటే ఒక కుటుంబానికి రూ.300పైబడి కేవలం టిక్కెట్ల కోసం వెచ్చించాలి. ఇక ఇతర తినుబండారాలకైతే చెప్పనక్కర్లేదు.
బీచ్ ఫెస్టివల్ కొండెక్కినట్టే...
డిసెంబరు లేదా జనవరిలో ప్రతి ఏడాదీ బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం ఆనవాయితీ. అందుకు తగ్గట్టుగా బీచ్‌లో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేపట్టారు. అయితే ఈ ఏడాది ఇంతవరకు బీచ్ ఫెస్టివల్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఉంటుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి నెలకుంది. కానీ, అనూహ్యంగా సంక్రాంతికి ముందు, ఈ నెల 12వ తేదీన బీచ్‌లో సంక్రాంతి సంబరాలు పేరుతో ఉత్సవాలు జరిపేందుకు రత్నసిరి ఫుడ్‌కోర్టు రిసార్ట్‌కు అనుమతి ఇచ్చారు. అవకాశం రావడమే తరువాయి సదరు యాజమాన్యం భారీ రేట్లు పెట్టింది. ఒక్కొక్కరికీ రూ.1000, 600, 500 మేర టిక్కెట్ రేట్లు పెట్టారు. ముందుగా బుక్ చేసుకోవాలని విస్తృత ప్రచారం కూడా చేసేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment