ఉండాలా.. పార్టీ వదిలిపోవాలా
►కార్యకర్తలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం..
►30 ఏళ్లుగా జెండాలు మోసిన వారికి మొండి చేయి చూపారు
►మంత్రులు పరిటాల, శిద్దాలపై కరణం బలరాం ఫైర్
►ఉండాలా.. పార్టీ వదిలిపోవాలా.. ఏదో ఒకటి తేల్చండంటూ అల్టీమేటం
►సీఎంతో సమావేశానంతరం క్లారిటీ ఇస్తామంటూ మంత్రుల బుజ్జగింపు
►కనిగిరి సమావేశంలో రచ్చకెక్కిన అధికార పార్టీ విభేదాలు
ప్రస్తుత జనరేషన్‌లో పబ్బం గడుపుకుని వెళ్లేపోయే కుహనా నాయకులు కొందరు తయారయ్యారు. అలాంటి వారివల్ల పార్టీ పుట్టినప్పటి నుంచి కమిటెడ్‌గా పనిచేసిన వారికి అన్యాయం జరుగుతోంది. అలాంటి నేతలతో వచ్చే సమస్యల్ని పరిష్కరించి.. సమాధానం చెప్పాల్సిన బాధ్యత వేదికపైన ఉన్నవాళ్లందరిదీ. కార్యకర్తలను ఆశ్రద్ధ చేసి, వారిని ఇబ్బంది పెట్టి.. ఏమైనా తేడాలు తీసుకొస్తే.. దాని ఫలితం వేరేవిధంగా ఉంటుంది. – కనిగిరి సమావేశంలో కరణం
ఒంగోలు : కనిగిరిలో బుధవారం జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ అంతర్గత సమావేశంలో ఆ పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలు మరోమారు రచ్చకెక్కాయి. 30 ఏళ్లుగా పార్టీ జెండాలు మోసిన కార్యకర్తలకు పింఛన్లు, పక్కా గృహాలు ఇవ్వటం లేదని, అభివృద్ధి పనులు సైతం పార్టీకి ఓట్లేయని వారికే కట్టబెడుతున్నారని, పాత కార్యకర్తలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని ఎమ్మెల్సీ కరణం బలరాం ఫైర్ అయ్యారు. ఇలా అయితే చూస్తూ ఊరుకునేది లేదు. ముందు మా సంగతి తేల్చండి.. మేం పార్టీలో ఉండాలా.. వెళ్లిపోవాలా.. మేమైతే దేనికైనా రెడీగా ఉన్నాం... అంటూ బలరాం మంత్రులు పరిటాల సునీత, శిద్దా రాఘవరావులపై విరుచుకుపడ్డారు. ఎన్ని రోజులని నాన్చుతారు. ప్రోటోకాల్ అంటూ మమ్మల్ని కట్టడి చేస్తున్నారు.
మేం మంజూరు చేయించిన పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తున్నారు. మా కార్యకర్తలను బెదిరిస్తున్నారు. తన వైపు రావాలంటూ అల్టీమేటం జారీ చేస్తున్నాడు. ఇవన్నీ చూస్తూ ఊరుకోవాలా.. జిల్లా మొత్తంగా పాత కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది. తప్పుడు నిర్ణయాలతో పార్టీని భ్రష్ఠు పట్టించారంటూ బలరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఒకటి చెప్పండి అంటూ మంత్రులను నిలదీశారు. పార్టీ కోసం పని చేసిన వారి రేషన్ షాపులను సైతం బలవంతంగా తొలగిస్తున్నారని చెప్పారు. పార్టీకి ఓట్లేసిన పాపానికి కార్యకర్తలకు శిక్షా.. అంటూ ప్రశ్నించారు. సమస్య పరిష్కరించకపోతే అమీతుమీ తేల్చుకుంటామంటూ చిందులు తొక్కారు. టీడీపీకి ఓట్లేయని వారికి పథకాలు మంజూరు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరిస్థితి ఇలాగే ఉంటే మా దారి మేం చూసుకుంటాం.. అంటూ విరుచుకుపడ్డారు. ఆగస్టు ఒకటోతేదీ మంగళవారం నాడు సీఎంతో సమావేశం ఏర్పాటు చేసినట్లు మంత్రులు బలరాంకు చెప్పారు. ఈ సమావేశంలో క్లారిటీ వస్తుందని, మీతో ముఖ్యమంత్రి మాట్లాడతారని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తొందరపడాల్సిన పని లేదని అన్ని సర్దుకుంటాయని మంత్రులు బలరాంను శాంతింపజేసే ప్రయత్నానికి దిగారు. మూడేళ్లుగా ఇదే చెబుతున్నారని, ఇక ఓపిక పట్టే పరిస్థితి లేదని బలరాం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా అద్దంకి నియోజకవర్గంతో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన పాత నేతలు, కార్యకర్తలు కొత్త వారితో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రుల దృష్టికి తెచ్చారు.
త్వరలో అన్ని సర్దుకుంటాయని మంత్రులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కనిగిరిలో బుధవారం నిర్వహించిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం అనంతరం స్థానిక ఎమ్మెల్యే కదిరి బాబూరావు నివాసంలో జరిగిన అంతర్గత సమావేశానికి ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాకుండానే వెళ్లిపోయారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, ఎమ్మెల్సీ మాగుంట, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు. మంత్రులతో బలరాం వాదనకు దిగగానే ఎమ్మెల్సీ కూడా తనకు ఏదో పని ఉందని చెప్పి వెళ్లిపోయారు.
సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్‌రెడ్డి, గొట్టిపాటి రవి