karanam balram
-
బాబుకన్నా దుర్మార్గులు ఎవరుంటారు?
ఒంగోలు: ‘నీ చరిత్ర ఏంటో, నా చరిత్ర ఏంటో చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నా.. నీవు ఓపెన్ ఛాలెంజ్‌కు సిద్ధమా’.. అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకి చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సవాల్ విసిరారు. పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో శనివారం జరిగిన బహిరంగసభలో చంద్రబాబు తనను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఒంగోలులోని తన నివాసంలో ఆదివారం కరణం మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. నన్ను దుర్మార్గుడు అన్న చంద్రబాబు కన్నా లోకంలో ఎవరైనా దుర్మార్గులు ఉంటారా? 2019 ఎన్నికల్లో నేను చీరాల టికెట్ అడగలేదు. నిన్ను, నీ కొడుకుని దూషించారంటూ వారిపై కోపంతో దుగ్థ తీర్చుకునేందుకు బలవంతంగా నన్ను చీరాల పంపిన విషయం మర్చిపోవద్దు. గతాన్ని మరిచి మాట్లాడొద్దు. 1975లో నేను ప్రకాశం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు నువ్వు ఒక తాలూకా అధ్యక్షుడివి. అప్పట్లో ఢిల్లీ వెళ్లి నీకు మంత్రి పదవికి సిఫార్సు చేసింది నేను. అది మరిచి నాపై విమర్శలు చేస్తే నీ జీవితం మొత్తం బయటపెట్టాల్సి వస్తుంది. నేను చీరాలకు వెళ్లినా గెలిచానంటే అక్కడి స్థానిక పరిస్థితుల దృష్ట్యా పార్టీలకు అతీతంగా ప్రజలు నాకు బ్రహ్మరథం పట్టారు. అంతేతప్ప చంద్రబాబు శక్తివల్ల కాదు. చంద్రబాబుకే గెలిపించే సత్తా ఉంటే ఆయన కొడుకు లోకేశ్‌ను మంగళగిరిలో ఎందుకు గెలిపించుకోలేకపోయాడు. నేను గెలిచి నీ పార్టీలోకి వస్తానని చెప్పినట్లు గలీజు మాటలు మాట్లాడితే సహించను. కోడెలను కనీసం పరామర్శించలేదు.. నువ్వు సీఎంగా ఉండగా 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తీసుకుని అందులో కొందరికి మంత్రి పదవులు ఇచ్చావు. ఇది మీకు స్వయంగా, పార్టీకి నష్టం అని చెప్పినా వినలేదు. నువ్వు చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా మాట్లాడితే ఎలా? నీ కార్పొరేట్ రాజకీయాలవల్ల పార్టీని నమ్ముకున్న ఎందరో బలైపోయారు. పరిటాల, కోడెల విషయంలో నువ్వు ఏమైనా పద్ధతిగా వ్యవహరించావా? కోడెల ఆస్పత్రి పాలైతే కనీసం పరామర్శ కూడా చేయలేకపోయావు. ఎవరినీ వెళ్లకుండా కట్టడి చేయడమే కాక కనీసం ఫోన్ కూడా చేయనీయకపోతే నేను వెళ్లి చంద్రబాబు పంపారంటూ అబద్ధం చెప్పాల్సి వచ్చింది. మరోవైపు.. బల్లికురవ మండలం వేమవరంలో జంట హత్యలు జరిగితే పార్టీ తరఫున నిజనిర్థారణ కమిటీ కూడా వేయకుండా పార్టీ తరఫున కనీసం పరామర్శ కూడా చేయలేకపోవడానికి సిగ్గుండాలి. జిల్లాలో ఒక వ్యక్తిని పార్టీలోకి చేర్చుకునే సమయంలో విజయవాడ మనోరమ హోటల్ నుంచి సూట్‌కేసులతో హైదరాబాద్ ఫాం హౌస్‌కు వచ్చి డబ్బులు ఎవరికిచ్చారో చెప్పాలి. నీ జాతకం నాకు తెలుసు ఇక నీ పార్టీ నుంచి ఎవరైనా బయటకు వెళ్తే చెత్త అంటున్నావు.. అదే అవతలి పార్టీ వాళ్లు వద్దన్నా వారిని వేదికపై కూర్చోపెట్టుకుంటే నీకు చెరకులాగా ఉందా? నువ్వు సీఎంగా ఉన్నప్పుడు కలెక్టర్‌గా ఉన్న వినయ్‌చంద్, మంత్రి శిద్ధా రాఘవరావులకు సైతం కుర్చిలను తీసేయించిన విషయం అందరికీ తెలుసు. పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించలేని నువ్వు నోరు జారేటప్పుడు ఎవరి క్యారెక్టర్ ఏంటో తెలుసుకుని మాట్లాడాలి. లేదంటే నీ జాతకం అంతా తెలిసిన వాడ్ని నేను నోరువిప్పే వరకు తెచ్చుకోవద్దు. నేను ఎప్పుడూ ఇంతగా ఎవరినీ విమర్శించలేదు. నన్ను వ్యక్తిగతంగా విమర్శించబట్టే నేను మాట్లాడాల్సి వచ్చింది. పార్టీలో కార్యకర్తలను నిలుపుకునేందుకు తప్పుడు మాటలు మాట్లాడితే సహించేదిలేదు. ఓడిపోతారని ప్రచారం జరగడంతో రాహుల్‌గాంధీ వద్దకు వెళ్లి మెడలో మాల వేస్తావు.. అలాగే, మోదీ భార్య ఎక్కడో అంటూ మాట్లాడడం చంద్రబాబుకు ఏమవసరం. మళ్లీ ఇప్పుడు బీజేపీ పంచన చేరేందుకు పడరాని పాట్లు పడటం ఇంతకంటే సిగ్గు పడాల్సిన అంశం ఏమైనా ఉందా?.. అని మండిపడ్డారు. -
సొంతపార్టీ నేతలపై మండిపడ్డ కరణం, అయ్యన్న
సాక్షి, విజయవాడ : విజయవాడలో నిర్వహించిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో భాగంగా ఈ పార్టీ సీనియర్ నేతలు అయ్యన్న పాత్రుడు, కరణం బలరాంలు పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీ కార్యాలయం నుంచి నేతలకు సమన్వయం సరిగా లేదని అయ్యన్న, కరణంలు మండిపడ్డారు. రేపు నిర్వహించాల్సిన కార్యక్రమంపై ఈరోజు రాత్రి సమాచారం ఇవ్వడం ఏంటని నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానికంగా ఉండే నాయకులు షో వర్క్ చేయడం మానేసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే బాగుంటుదని పేర్కొన్నారు. అంతేగాక పార్టీ నేతలు ప్రెస్మీట్లు తగ్గించి పని మీద దృష్టి సారించి ప్రజలకు అందుబాటులో ఉంటే మంచిదని అయ్యన్న, కరణంలు హితభోద చేశారు. -
ఉండాలా.. పార్టీ వదిలిపోవాలా
►కార్యకర్తలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం.. ►30 ఏళ్లుగా జెండాలు మోసిన వారికి మొండి చేయి చూపారు ►మంత్రులు పరిటాల, శిద్దాలపై కరణం బలరాం ఫైర్ ►ఉండాలా.. పార్టీ వదిలిపోవాలా.. ఏదో ఒకటి తేల్చండంటూ అల్టీమేటం ►సీఎంతో సమావేశానంతరం క్లారిటీ ఇస్తామంటూ మంత్రుల బుజ్జగింపు ►కనిగిరి సమావేశంలో రచ్చకెక్కిన అధికార పార్టీ విభేదాలు ప్రస్తుత జనరేషన్లో పబ్బం గడుపుకుని వెళ్లేపోయే కుహనా నాయకులు కొందరు తయారయ్యారు. అలాంటి వారివల్ల పార్టీ పుట్టినప్పటి నుంచి కమిటెడ్‌గా పనిచేసిన వారికి అన్యాయం జరుగుతోంది. అలాంటి నేతలతో వచ్చే సమస్యల్ని పరిష్కరించి.. సమాధానం చెప్పాల్సిన బాధ్యత వేదికపైన ఉన్నవాళ్లందరిదీ. కార్యకర్తలను ఆశ్రద్ధ చేసి, వారిని ఇబ్బంది పెట్టి.. ఏమైనా తేడాలు తీసుకొస్తే.. దాని ఫలితం వేరేవిధంగా ఉంటుంది. – కనిగిరి సమావేశంలో కరణం ఒంగోలు : కనిగిరిలో బుధవారం జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ అంతర్గత సమావేశంలో ఆ పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలు మరోమారు రచ్చకెక్కాయి. 30 ఏళ్లుగా పార్టీ జెండాలు మోసిన కార్యకర్తలకు పింఛన్లు, పక్కా గృహాలు ఇవ్వటం లేదని, అభివృద్ధి పనులు సైతం పార్టీకి ఓట్లేయని వారికే కట్టబెడుతున్నారని, పాత కార్యకర్తలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని ఎమ్మెల్సీ కరణం బలరాం ఫైర్ అయ్యారు. ఇలా అయితే చూస్తూ ఊరుకునేది లేదు. ముందు మా సంగతి తేల్చండి.. మేం పార్టీలో ఉండాలా.. వెళ్లిపోవాలా.. మేమైతే దేనికైనా రెడీగా ఉన్నాం... అంటూ బలరాం మంత్రులు పరిటాల సునీత, శిద్దా రాఘవరావులపై విరుచుకుపడ్డారు. ఎన్ని రోజులని నాన్చుతారు. ప్రోటోకాల్ అంటూ మమ్మల్ని కట్టడి చేస్తున్నారు. మేం మంజూరు చేయించిన పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తున్నారు. మా కార్యకర్తలను బెదిరిస్తున్నారు. తన వైపు రావాలంటూ అల్టీమేటం జారీ చేస్తున్నాడు. ఇవన్నీ చూస్తూ ఊరుకోవాలా.. జిల్లా మొత్తంగా పాత కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది. తప్పుడు నిర్ణయాలతో పార్టీని భ్రష్ఠు పట్టించారంటూ బలరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఒకటి చెప్పండి అంటూ మంత్రులను నిలదీశారు. పార్టీ కోసం పని చేసిన వారి రేషన్ షాపులను సైతం బలవంతంగా తొలగిస్తున్నారని చెప్పారు. పార్టీకి ఓట్లేసిన పాపానికి కార్యకర్తలకు శిక్షా.. అంటూ ప్రశ్నించారు. సమస్య పరిష్కరించకపోతే అమీతుమీ తేల్చుకుంటామంటూ చిందులు తొక్కారు. టీడీపీకి ఓట్లేయని వారికి పథకాలు మంజూరు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే మా దారి మేం చూసుకుంటాం.. అంటూ విరుచుకుపడ్డారు. ఆగస్టు ఒకటోతేదీ మంగళవారం నాడు సీఎంతో సమావేశం ఏర్పాటు చేసినట్లు మంత్రులు బలరాంకు చెప్పారు. ఈ సమావేశంలో క్లారిటీ వస్తుందని, మీతో ముఖ్యమంత్రి మాట్లాడతారని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తొందరపడాల్సిన పని లేదని అన్ని సర్దుకుంటాయని మంత్రులు బలరాంను శాంతింపజేసే ప్రయత్నానికి దిగారు. మూడేళ్లుగా ఇదే చెబుతున్నారని, ఇక ఓపిక పట్టే పరిస్థితి లేదని బలరాం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా అద్దంకి నియోజకవర్గంతో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన పాత నేతలు, కార్యకర్తలు కొత్త వారితో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రుల దృష్టికి తెచ్చారు. త్వరలో అన్ని సర్దుకుంటాయని మంత్రులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కనిగిరిలో బుధవారం నిర్వహించిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం అనంతరం స్థానిక ఎమ్మెల్యే కదిరి బాబూరావు నివాసంలో జరిగిన అంతర్గత సమావేశానికి ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాకుండానే వెళ్లిపోయారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, ఎమ్మెల్సీ మాగుంట, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు. మంత్రులతో బలరాం వాదనకు దిగగానే ఎమ్మెల్సీ కూడా తనకు ఏదో పని ఉందని చెప్పి వెళ్లిపోయారు. సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్‌రెడ్డి, గొట్టిపాటి రవి -
అద్దంకిలో ఉద్రిక్తత
ప్రకాశం: ప్రకాశం జిల్లాలోని అద్దంకిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణంలోని ఓ సీసీ రోడ్డు ప్రారంభోత్సవం వ్యవహారంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాంలు ఇద్దరు సై అంటే సై అంటున్నారు. ఎమ్మెల్యే తో ప్రారంభోత్సవం జరిపించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు శిలాఫలకం కూడా వేశారు. అయితే కరణం బలరాం వర్గం కూడా దాని పక్కనే మరో శిలాఫలకం ఏర్పాటుచేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువురు నేతలు పోటీగా ప్రారంభోత్సవం చేసేందుకు రెడీ కావడంతో పోలీస్ లు భారీగా మోహరించారు. ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా తన్నుకున్న రెండు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది.