ఒంగోలు: ‘నీ చరిత్ర ఏంటో, నా చరిత్ర ఏంటో చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నా.. నీవు ఓపెన్ ఛాలెంజ్‌కు సిద్ధమా’.. అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకి చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సవాల్ విసిరారు. పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో శనివారం జరిగిన బహిరంగసభలో చంద్రబాబు తనను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఒంగోలులోని తన నివాసంలో ఆదివారం కరణం మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
నన్ను దుర్మార్గుడు అన్న చంద్రబాబు కన్నా లోకంలో ఎవరైనా దుర్మార్గులు ఉంటారా? 2019 ఎన్నికల్లో నేను చీరాల టికెట్ అడగలేదు. నిన్ను, నీ కొడుకుని దూషించారంటూ వారిపై కోపంతో దుగ్థ తీర్చుకునేందుకు బలవంతంగా నన్ను చీరాల పంపిన విషయం మర్చిపోవద్దు. గతాన్ని మరిచి మాట్లాడొద్దు. 1975లో నేను ప్రకాశం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు నువ్వు ఒక తాలూకా అధ్యక్షుడివి. అప్పట్లో ఢిల్లీ వెళ్లి నీకు మంత్రి పదవికి సిఫార్సు చేసింది నేను.
అది మరిచి నాపై విమర్శలు చేస్తే నీ జీవితం మొత్తం బయటపెట్టాల్సి వస్తుంది. నేను చీరాలకు వెళ్లినా గెలిచానంటే అక్కడి స్థానిక పరిస్థితుల దృష్ట్యా పార్టీలకు అతీతంగా ప్రజలు నాకు బ్రహ్మరథం పట్టారు. అంతేతప్ప చంద్రబాబు శక్తివల్ల కాదు. చంద్రబాబుకే గెలిపించే సత్తా ఉంటే ఆయన కొడుకు లోకేశ్‌ను మంగళగిరిలో ఎందుకు గెలిపించుకోలేకపోయాడు. నేను గెలిచి నీ పార్టీలోకి వస్తానని చెప్పినట్లు గలీజు మాటలు మాట్లాడితే సహించను.
కోడెలను కనీసం పరామర్శించలేదు..
నువ్వు సీఎంగా ఉండగా 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తీసుకుని అందులో కొందరికి మంత్రి పదవులు ఇచ్చావు. ఇది మీకు స్వయంగా, పార్టీకి నష్టం అని చెప్పినా వినలేదు. నువ్వు చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా మాట్లాడితే ఎలా? నీ కార్పొరేట్ రాజకీయాలవల్ల పార్టీని నమ్ముకున్న ఎందరో బలైపోయారు. పరిటాల, కోడెల విషయంలో నువ్వు ఏమైనా పద్ధతిగా వ్యవహరించావా? కోడెల ఆస్పత్రి పాలైతే కనీసం పరామర్శ కూడా చేయలేకపోయావు.
ఎవరినీ వెళ్లకుండా కట్టడి చేయడమే కాక కనీసం ఫోన్ కూడా చేయనీయకపోతే నేను వెళ్లి చంద్రబాబు పంపారంటూ అబద్ధం చెప్పాల్సి వచ్చింది. మరోవైపు.. బల్లికురవ మండలం వేమవరంలో జంట హత్యలు జరిగితే పార్టీ తరఫున నిజనిర్థారణ కమిటీ కూడా వేయకుండా పార్టీ తరఫున కనీసం పరామర్శ కూడా చేయలేకపోవడానికి సిగ్గుండాలి. జిల్లాలో ఒక వ్యక్తిని పార్టీలోకి చేర్చుకునే సమయంలో విజయవాడ మనోరమ హోటల్ నుంచి సూట్‌కేసులతో హైదరాబాద్ ఫాం హౌస్‌కు వచ్చి డబ్బులు ఎవరికిచ్చారో చెప్పాలి.
నీ జాతకం నాకు తెలుసు
ఇక నీ పార్టీ నుంచి ఎవరైనా బయటకు వెళ్తే చెత్త అంటున్నావు.. అదే అవతలి పార్టీ వాళ్లు వద్దన్నా వారిని వేదికపై కూర్చోపెట్టుకుంటే నీకు చెరకులాగా ఉందా? నువ్వు సీఎంగా ఉన్నప్పుడు కలెక్టర్‌గా ఉన్న వినయ్‌చంద్, మంత్రి శిద్ధా రాఘవరావులకు సైతం కుర్చిలను తీసేయించిన విషయం అందరికీ తెలుసు. పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించలేని నువ్వు నోరు జారేటప్పుడు ఎవరి క్యారెక్టర్ ఏంటో తెలుసుకుని మాట్లాడాలి. లేదంటే నీ జాతకం అంతా తెలిసిన వాడ్ని నేను నోరువిప్పే వరకు తెచ్చుకోవద్దు.
నేను ఎప్పుడూ ఇంతగా ఎవరినీ విమర్శించలేదు. నన్ను వ్యక్తిగతంగా విమర్శించబట్టే నేను మాట్లాడాల్సి వచ్చింది. పార్టీలో కార్యకర్తలను నిలుపుకునేందుకు తప్పుడు మాటలు మాట్లాడితే సహించేదిలేదు. ఓడిపోతారని ప్రచారం జరగడంతో రాహుల్‌గాంధీ వద్దకు వెళ్లి మెడలో మాల వేస్తావు.. అలాగే, మోదీ భార్య ఎక్కడో అంటూ మాట్లాడడం చంద్రబాబుకు ఏమవసరం. మళ్లీ ఇప్పుడు బీజేపీ పంచన చేరేందుకు పడరాని పాట్లు పడటం ఇంతకంటే సిగ్గు పడాల్సిన అంశం ఏమైనా ఉందా?.. అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment