కాతేరును కొల్లగొట్టిందెవరు?
Published Mon, Jan 23 2017 11:36 PM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM
సాక్షి, రాజమహేంద్రవరం :
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పంచాయతీలో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసింది. పంచాయతీలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక నుంచి అభివృద్ధి పనుల వరకు జన్మభూమి కమిటీల అనుమతిలేనిదే ఏ పనీ కాదు. ఓ అర్హుడైన వృద్ధుడికి వ్యద్ధాప్య పింఛ¯ŒS ఇవ్వాలని జిల్లా కలెక్టర్ భావించినా జన్మభూమి కమిటీల అనుమతి లేనిదే ఆ పని చేయలేని స్థితి. ఆ స్థాయిలో జన్మభూమి కమిటీలకు సీఎం చంద్రబాబు అనధికారిక పెత్తనం కట్టబెట్టారు. పంచాయతీలో చీమ చిటిక్కుమనాలాన్నా జన్మభూమి కమిటీల అనుమతి తప్పనిసరి. అలాంటిది కాతేరు పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారిగా ఉన్న ఈవో పీఆర్‌అండ్‌ఆర్‌డీ జన్మభూమి కమిటీకి తెలియకుండా వివిధ గ్రాంట్ల కింద 2015–16, 2016–17 ఆర్థిక ఏడాదుల్లో పంచాయతీకి వచ్చిన రూ.1.10 కోట్లు నిధులు పక్కదారి పట్టించారా? అనే దానిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలో ప్రతి నెలా వృద్ధులు, వికాలంగులు, వితంతువులకు పంపిణీ చేసే పింఛన్లు కూడా జన్మభూమి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పంచయతీ కార్యదర్శి ఇస్తున్నారు. పంచాయతీలో ఇలా ప్రతి పని తమ కనుసన్నల్లో నిర్వహించేలా పెత్తనం చెలాయిస్తున్న జన్మభూమి కమిటీకి తెలియకుండా పంచాయతీ కార్యదర్శి రూ.1.10 కోట్లు నిధులు వినియోగించారా? అంటే ఖచ్చితంగా కాదనే అంటున్నాయి అధికార వర్గాలు. 2014 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి కాతేరు పంచాయతీలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. అలాంటిది వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారి రూ.1.10 కోట్ల నిధులు ఖాజానా నుంచి ఉపసంహరింస్తుంటే జన్మభూమి కమిటీ సభ్యులకు తెలియకుండా ఉందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఇది కొసరే... అసలు కొండను మింగిందెవరు?
పంచాయతీకి వచ్చిన గ్రాంట్లు రూ.1.10 కోట్ల నిధులు కాజేశారని ఉన్నతాధికారులు వాటిపై విచారణ చేస్తున్నారు. ఇప్పటికే కార్యదర్శి, ప్రత్యేక అధికారిని సస్పెండ్ చేశారు. ఈ నిధులకన్నా నాలుగు రెట్లు అధికంగా పంచాయతీ నిధులు జేబుల్లో వేసుకున్నారు. ఇంటి, కుళాయి పన్నుల రూపంలో గ్రామంలో ఉన్న 6,900 గృహ యజమానుల నుంచి 2014–15, 2015–16, 2016–17 ఏడాదుల్లో రూ.3 కోట్ల 10 లక్షల 50 వేలు వసూలు చేశారు. పేపర్ మిల్లు గృహ సముదాయం నుంచి ఇంటి పన్ను రూపంలో ఏడాదికి రూ.7 లక్షలు, మంచినీటి పథకం పన్ను రూ.3 లక్షలు వెరసి రూ.10 లక్షలు ఫిక్స్‌డ్‌గా ఆదాయం వస్తుంది. మూడేళ్లలో ఈ రెండు అంశాల నుంచే పంచాయతీకి రూ. 30 లక్షల ఆదాయం వచ్చింది. ఈ నిధులు పంచాయతీ జనరల్ ఖాతాలో డిపాజిట్ చేయాల్సి ఉన్నా చేయలేదు. వీటితోపాటు పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సస్పెండైన గన్ని సత్య ప్రసాద్ కుళాయి మంజూరు ఫీజును రూ.2,400 నుంచి రూ. 4,500లకు పెంచారు. అప్పటికే కుళాయిలు వేసుకున్న దాదాపు 3000 మంది నుంచి రూ.4,500 లెక్కన రూ.కోటి .35 లక్షలు వసూలు చేశారు. వీటితోపాటు ఈ మూడేళ్లలో కాతేరులో బహుళ అంతస్తుల భవనాలు నిర్మాంచారు. నూతన ఇళ్లు వెలిశాయి. వీటికి అనుమతులు ఇవ్వడం ద్వారా వచ్చిన ఆదాయం కూడా జనరల్ ఖాతాకు జమ చేయలేదు. ఇక కాతేరు గ్రామ పరిధిలో అనేక రియల్ వెంచర్లు వేశారు. వీటి అనుమతుల ద్వారా వచ్చిన సొమ్మును కూడా కాజేశారు. వీటన్నింటిపై ఉన్నతాధికారులు విచారణ చేస్తే కాగేసిన పంచాయతీ సొమ్ము కోట్ల రూపాయలు ఉంటుంది.
నియోజకవర్గ ప్రజాప్రతినిధికి తెలియకుండా ఉంటుందా?
పంచాయతీలో రూపాయి ఖర్చు చేయాలన్నా జన్మభూమి కమిటీ అనుమతి తప్పనిసరన్నది నగ్నసత్యం. అలాంటిది కోట్ల రూపాయల ప్రజాధనం గోల్‌మాల్‌లో జన్మభూమి కమిటీ సభ్యులు, అ«ధికార పార్టీకి చెందిన గ్రామ పెద్దల హస్తం లేకుండా ఉంటుందా? అసలు పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారి కేవలం పాత్రధారులేనని, సూత్రధారులు వేరని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. రూ. కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంటే నియోజకవర్గ ప్రజా ప్రతినిధికి తెలియకుండా ఉంటుందా?. ప్రతి విషయం ముఖ్యనేతకు చెప్పే కిందిస్థాయిలో తమ్ముళ్లు అవినీతికి తెరలేపుతారన్నది జగమెరిగిన సత్యం. దీనికి నిదర్శనమే పంచాయతీ నిధుల దుర్వినియోగంపై డివిజ¯ŒS పంచాయతీ అధికారి జిల్లా అధికారికి పంపిన నివేదికను తొక్కిపెట్టడం. నాలుగు నెలల కిందట ఈ నివేదిక జిల్లా అధికారికి పంపినా ఇప్పటి వరకు బహిర్గతం కాకపోవడంలో మర్మమేమిటన్నది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే.
అనుమతులపై విచారణ చేస్తాం...
కుళాయిల అనుమతులపై విచారణ చేయిస్తాం. ఎవరైనా నగదు చెల్లించి ఉంటే రసీదు చూపించాలి. అలా లేని కుళాయిలన్నింటినీ తొలగిస్తాం. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడతాయి. కుళాయి కొనసాగించాలంటే ఫీజుతోపాటు, సూపర్ పెనాల్టీ కూడా వసూలు చేస్తాం. బహుళ అంతస్తుల నిర్మాణాల అనుమతులపై విచారణ చేస్తాం. నిబంధలకు విరుద్ధంగా ఉన్న భవనాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.
– ఎం.వరప్రసాద్, డీఎల్‌పీవో,రాజమహేంద్రవరం
ప్రజల సొమ్ము రికవరీ జరుగుతుందా?
ప్రభుత్వాల నుంచి వచ్చిన రూ.1.10 కోట్లు, పంచాయతీలో ఇంటి పన్నులు, కుళాయి పన్నులు రూ.3.40 కోట్లు, కొత్త కుళాయిల మంజూరుకు వసూలు చేసిన రూ. 1.35 కోట్లు, ఇళ్ల నిర్మాణాల అనుమతులు, రియల్ వెంచర్ల అనుమతుల ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం కాజేశారు. పంచాయతీలో ప్రస్తుతం రూ.3 లక్షల 25 వేలు మాత్రమే ఉన్నాయి. కోట్ల రూపాయల ప్రజాధనం కాజేసిన వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి అసలు దొంగలకు శిక్ష వేస్తారా?. ప్రజా ధనాన్ని రికవరీ చేస్తారా? లేదంటే విచారణ పేరుతో సాగదీస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఐదు నెలలుగా పంచాయతీ సిబ్బంది 26 మందికి జీతాలు లేవు. రెండు నెలలుగా వీధి దీపాలు వెలగడంలేదు. కోట్ల రూపాయల ఆదాయం వచ్చే తమ పంచాయతీలో కనీస సౌకర్యాలు లేవని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనం కొల్ల గొట్టిన వారి నుంచి తిరిగి వసూలు చేసి గ్రామాభివృద్ధికి ఖర్చు చేయాలని గ్రామ ప్రజలు ఉన్నతాధికారులను కోరుతున్నారు.
Advertisement
Advertisement