సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘న్యాయస్థానాల తీర్పును గౌరవిస్తాం. కోడిపందేలను ఏమాత్రం సహించబోం. జూదరులపై కఠిన చర్యలు చేపడతాం’ అంటూ ప్రగల్భాలు పలికిన సర్కారు, పోలీసులు పండగ మూడు రోజులూ ‘కోడి’నిద్ర(కళ్లుతెరిచి నిద్ర)చేశారు. ఫలితంగా జిల్లాలో పందేలు యథేచ్ఛగా సాగాయి. రూ.కోట్లు చేతులు మారాయి. ఈ మూడు రోజుల్లో రూ.200 కోట్లు జేబులు మారినట్టు సమాచారం. కోడిపందేలతోపాటు పేకాట, గుండాట, కోతాట, లోనబయటా వంటి జూదాలు ముమ్మరంగా సాగాయి. పందేల బరుల వద్దే ఈ ఆటలు కొలువుదీరాయి. మద్యం ఏరులై పారింది. వందలాది జీవితాలు తల్లకిందులయ్యాయి. పోలీసుల ఆంక్షలను దాటి భోగి రోజు మధ్యాహ్నం మొదలైన కోడిపందేలు, జూదాలు సంక్రాంతి రోజు తారాస్థాయికి చేరాయి. కనుమరోజు ఆదివారం రాత్రి వరకూ యథేచ్ఛగా సాగాయి.
ఉన్నతస్థాయి వర్గాల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు పక్కకు తప్పుకోవడంతో రాత్రిళ్లూ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పందేలు సాగాయి. అక్కడే పేకాట శిబిరాలు, మద్యం దుకాణాలు, బెల్టు షాపులు వెలిశాయి. చిన్నపాటి రెస్టారెంట్లు ఏర్పడ్డాయి. కోడిపందేలు, పేకాటల్లో జూదరులు రూ.లక్షలు పొగొట్టుకుంటే.. గుండాట, కోతాటల్లో రూ.వేలల్లో చేతిచమురు వదిలించుకున్నారు. పండగకు ముందుగానే పోలీసు ఆంక్షలను తేలికగా తీసుకున్న నిర్వాహకులు బరులను ఆగమేఘాలపై సిద్ధం చేశారు. దీంతో కోడిపందేలు నిర్వహించే ప్రాంతాల్లో 144 సెక్షన్ వి«ధిస్తున్నట్టు ఉన్నతాధికారులు ప్రకటించినా.. ఫలితం లేకపోయింది. పండగ మూడురోజులూ పోలీసులు స్టేషన్లకే పరిమితం కావాల్సి వచ్చింది. కోర్టు ఉత్తర్వులనూ బేఖాతర్ చేసి నిర్వాహకులు కోళ్లకు కత్తులు కట్టి పందేలు నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో పందేలకు అనుమతివ్వక పోవడంతో తెలంగాణ నుంచి అధికసంఖ్యలో జూదరులు జిల్లాకు తరలివచ్చారు. ఇదిలా ఉంటే పోలీసులకు నిర్వాహకుల నుంచి భారీఎత్తున ముడుపులు అందినట్టు ఆరోపణలు వినవస్తున్నాయి. భీమవరం మండలం వెంపలో భారీ బరిని ఏర్పాటుచేయడంతో జనం అక్కడికి పోటెత్తారు. తోకతిప్ప, కొణితివాడ గ్రామాల్లోనూ భారీస్థాయిలో బరులు ఏర్పాటయ్యా యి.
తణుకు మండలం తేతలి, వేల్పూరు, దువ్వ, మండపాక, ఇరగవరం మండలంలోని తూర్పువిప్పర్రు, అయినపర్రు, అత్తిలి మండలం అత్తిలి, గుమ్మంపాడు, కేఎస్‌గట్టు గ్రామాల్లో పందేలు జోరుగా సాగాయి. నరసాపురం నియోజవర్గంలోనూ పలు గ్రామాల్లో భారీ బరులు ఏర్పాటయ్యాయి. కొవ్వూరు నియోజవర్గంలో ఇరవై శిబిరాల్లో కోడిపందేలు జరిగాయి. తోగుమ్మిలో భారీ ఎత్తున పందేలు జరిగాయి. ఆచంట నియోజకవర్గంలో మార్టేరు, ఆలమూరు, పెనుమంట్ర తదితర గ్రామాల్లో యథేచ్ఛగా పందేలు జరిగాయి. చింతలపూడి, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లోనూ భారీగా పందేలు జరిగాయి. తాడేపల్లిగూడెం విమానాశ్రయ భూములకు దగ్గరగా తోటల్లో జరిగిన పందేలకు కడప, కర్నూలు, బెంగళూరు ప్రాంతాల నుంచి జూదరులు తరలివచ్చారు. పాలకొల్లు మండలం దగ్గులూరులో పందేల సందర్భంగా స్వల్ప వివాదం జరిగింది. దీంతో మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ రాస్తారోకోకు దిగారు. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పాలకొల్లు మండలంలో టీడీపీ నేత ఆధ్వర్యంలో పూలపల్లి బైపాస్‌రోడ్డులోనూ, బీజేపీ నేత ఆధ్వర్యంలో పాలకొల్లు–భీమవరం రోడ్డులోని పూలపల్లి వద్ద కోడి పందేలు జోరుగా సాగాయి. గోపాలపురం నియోజకవర్గంలోని సుమారు 50 గ్రామాల్లో పందేలు జరిగాయి. పోలవరం నియోజకవర్గంలో 25 గ్రామాల్లో పందేలు సాగాయి. దెం దులూరు మండలం పెరుగ్గూడెంలో రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకూ పందేలు జరిగా యి. పెదవేగి మండలంలోని కొప్పాక గ్రామంలో మూడు పెద్ద బరులు ఏర్పాటు చేశా రు. ప్రధాన బరిలో రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ పందేలు జరిగి నట్టు సమాచారం. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పందేల చెంతకు మీడియాను రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
పందేలను తిలకించిన ప్రముఖులు
పెనుమంట్ర మండలం మార్టేరులో ఆదివారం జరిగిన కోడిపందేలను వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు కారుమూరి నాగేశ్వరరావు, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కుమారుడు గొలుగూరి సత్యనారాయణరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి కుమారుడు జేపీ తిలకించారు. అయిభీమవరంలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, బీజేపీ నాయకుడు కె. రఘరామకృష్ణంరాజులు పందేలను తిలకించారు.