కేసీఆర్ అంచనా తలకిందులైంది..!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సీఎం కేసీఆర్ ఈసారి తన ఫాంహౌస్‌లో బొప్పాయి సాగు చేయాలని నిర్ణయించారు. మొత్తం 65 ఎకరాల్లో ఈ 15 నుంచి మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయిస్తున్నారు. నాలుగు రోజులపాటు ఫాంహౌస్‌లోనే ఉన్న కేసీఆర్ వ్యవసాయ పనులు పర్యవేక్షించారు. గత ఏడాది 50 ఎకరాల్లో అల్లం సాగు చేసిన ఆయన.. ఈ ఏడాది బొప్పాయిని ఎంచుకున్నట్టు తెలిసింది. తైవాన్ రెడ్‌లేడీ 786 రకం విత్తన మొక్కలను జైపూర్ నుంచి తెప్పించినట్టు సమాచారం. మొక్క నాటిన 8 నెలల నుంచి పంట దిగుబడి మొదలై దాదాపు 10 నుంచి 12 నెలల వరకు ఫలసాయం అందుతుంది. కిలో బొప్పాయి రూ.16 చొప్పున ఓ కంపెనీతో ఒప్పందం కుదిరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. పంట సాగుకు ఎకరానికి రూ. 60 వేల నుంచి రూ. 70 వేల వరకు ఖర్చు వస్తుందని, దాదాపు 80 టన్నుల దిగుబడి రావచ్చని అంచనా వేస్తున్నారు.
అల్లం సాగుతో అంచనా తారుమారు..
గత ఏడాది అల్లం సాగులో అంచనాలు తలకిందులు కావడంతో రైతుగా కేసీఆర్ ఇబ్బంది పడ్డారు. అందుకే ముందు జాగ్రత్తగా బొప్పాయిని ఎంచుకున్నట్టు తెలిసింది. గత ఏడాది 50 ఎకరాల్లో అల్లంను కార్పొరేట్ తరహా సాగు చేశారు. దిగుబడి వచ్చిన అల్లంను కిలోకు రూ. 80 చొప్పున విక్రయించేలా దుబాయ్‌కి చెందిన ‘లూలూ’ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. వాళ్లు పంట కొనేందుకు రాలేదు. ఎకరాకు 170 బస్తాల (50 కిలోల బస్తాలు) అల్లం దిగుబడి వచ్చింది. పంట చేతికి అందే సమయానికి అల్లం ధర పడిపోవటంతో వాటిని నిల్వ చేయకలేక, తక్కువ ధరకు విక్రయించలేక కేసీఆర్ చాలా ఇబ్బంది పడ్డారు. ఎకరానికి రూ.16 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేయగా, కిలో అల్లం ధర రూ.35కు పడిపోవటంతో ఆయన అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఈ సారి అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకే బొప్పాయి ఆలోచన చేసినట్టు తెలిసింది. ఒకవేళ ఒప్పందం చేసుకున్న కంపెనీ ముఖం చాటేస్తే.. రూ.5 కిలో చొప్పున బొప్పాయి ఫలాలను స్థానికంగా అమ్ముకున్నా నష్టం ఉండదని తెలిసింది.