ఖమ్మంలో బీఎస్‌ఎన్‌ఎల్ ప్రధాన కార్యాలయం
-
ఖమ్మం బీఎస్‌ఎన్‌ఎల్ స్థాయి కుదింపు
-
‘పీజీఎం’ నుంచి ‘టీడీఏం’కు మార్పు
-
ఇక వరంగల్‌లోనే కీలక అధికారి
బీఎస్‌ఎన్‌ఎల్..మారుమూల ఊరికి పోయినా సిగ్నల్ ఉంటుందనే నమ్మకం..ప్రభుత్వానిదనే భరోసా..ఒకప్పుడు ఎంత గొప్పగా చెప్పుకున్నా..క్రమేణా ఆ ఖ్యాతి మసకబారుతోంది. జిల్లాలో వందల టవర్లున్నా..కొత్తగా మంజూరవుతున్నా..నిధులు కేటాయిస్తున్నా..సెల్‌ఫోన్ వినియోగదారులు మాత్రం పెరగడం లేదు. ఆశించినంత ఆదాయం రావడం లేదు. దీంతో..ఈ శాఖలో జిల్లా ఉన్నతస్థాయి హోదా అధికారి పోస్టుకు వరంగల్‌కు తరలిపోతోంది. ఇకపై పర్యవేక్షణంగా ఓరుగల్లు నుంచే సాగనుంది.
ఖమ్మం గాంధీచౌక్: భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్) ఖమ్మం శాఖలో ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ (పీజీఎం) స్థాయి పడిపోతోంది. ఇంత వరకు ఇక్కడున్న ఈ విభాన్ని ఇకపై వరంగల్‌కు తరలించనున్నట్లు తెలిసింది. రాష్ట్ర విడిపోయాక..రెండు సర్కిళ్లుగా విభజిస్తున్నారు. అక్టోబర్ నుంచి ప్రత్యేక సర్కిల్ ఆవిర్భవించనుంది. ఈ క్రమంలో జిల్లాలో ఆశించినంత ఆదాయం రావడం లేదని ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ స్థాయిలో ఉన్న ఖమ్మం బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఆ స్థాయిని తగ్గించి వరంగల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పరిధిలోకి చేర్చాలని కేంద్ర టెలికం కార్పొరేట్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. పాలనా, ప్రణాళిక విభాగం మొత్తం అక్కడి పరిధిలోకి వెళ్లనున్నాయి. ఖమ్మంలో టెలికం డిస్ట్రిక్ట్ మేనేజర్ (టీడీఎం) కార్యాలయం మాత్రమే ఉండనుంది.
-
తగ్గిన ఫాయిదా..పోతున్న హోదా
– జిల్లాలో ల్యాండ్‌లైన్లు 22 వేలు మాత్రమే ఉన్నాయి.
– మొబైల్ కనెక్షన్లు 2.50 లక్షలు.
– మొత్తం 200 టవర్లు ఉన్నాయి.
– జిల్లా విస్తీర్ణాన్ని బట్టి మరో 100 టవర్లను మంజూరయ్యాయి.
– నిధులు వెచ్చిస్తున్నా ఆదాయం మాత్రం పెరగడం లేదు.
– గతంలో నెలకు రూ.2 కోట్ల ఆదాయం వచ్చేది.
– ప్రస్తుతం రూ.1.40 కోట్లకు పడిపోయింది.
-
అధికారులుండే..ఫలితం రాకుండే..
ప్రైవేట్ నెట్‌వర్క్ సంస్థలతో పోల్చితే జిల్లా బీఎస్‌ఎన్‌ఎల్ మార్కెటింగ్‌లో బాగా వెనకబడి ఉంది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో 140 మంది అధికారులకు గాను ప్రస్తుతం 120 మంది పని చేస్తున్నారు. ఇక గ్రూప్ సీ, డీ విభాగాల్లో 700 మందికి గాను 450 మందితోనే నెట్టుకొస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన సాంకేతిక పరిఙ్ఞానం, కార్యాలయాలు ఉన్నా..ఖమ్మం బీఎస్‌ఎన్‌ఎల్‌కు అన్ని హంగులున్నా స్థాయిని తగ్గించటంపై అధికారులు అసంతృప్తి చెందుతున్నారు. రెవెన్యూ లోటు స్వయంకృతాపరాదమేననే విమర్శలొస్తున్నాయి.