కిడ్నాప్.. సుఖాంతం!
ఉదయమే బాలిక అపహరణ
సకాలంలో స్పందించిన పోలీసులు
జిల్లా వ్యాప్తంగా అప్రమత్తం... విస్తృత సోదాలు
మధ్యాహ్నం వదిలేసిన వైనం
ధర్మవరం అర్బన్: స్థానిక మారుతీనగర్‌లో రూరల్ పోలీస్‌స్టేషన్ వెనుక వైపు ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిని గురువారం ఉదయం కిడ్నాప్ చేసిన గుర్తు తెలియని దుండగుడు మధ్యాహ్నం కుణుతూరు గ్రామ సమీపంలోని వంక వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో బాలిక కిడ్నాప్ కథ సుఖాంతమైంది. బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన అనంతరం విలేకరుల సమావేశంలో వివరాలను ధర్మవరం ఇన్‌చార్జ్ డీఎస్పీ శివరామిరెడ్డి, సీఐ హరినాథ్ వెల్లడించారు.
అనంతపురానికి చెందిన ఎలక్ట్రీషియన్ రామ్మోహన్, లక్ష్మీవసుంధర దంపతుల కుమార్తె రుషిత ప్రియ(6) దసరా సెలవుల కోసం ధర్మవరంలోని పెద్దమ్మ శ్యామల ఇంటికి వచ్చింది. గురువారం ఉదయం 11.30గంటల సమయంలో ఇంటి సమీపంలో ఆ బాలిక ఆడుకుంటుండగా గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చి చాక్లెట్లు కొనిస్తానంటూ ఎక్కించుకుని వెళ్లిపోయాడు. సమాచారాన్ని అందుకున్న పట్టణ సీఐ హరినాథ్ అక్కడకు చేరుకుని ఆరా తీశారు. వెంటనే ఇన్‌చార్జ్ డీఎస్పీ శివరామిరెడ్డి ద్వారా జిల్లా పోలీసులకు సమాచారం అందించి అప్రమత్తం చేయించారు.
జిల్లా వ్యాప్తంగా రహదారులపై పోలీసులు విస్తృత సోదాలు చేపట్టారు. పోలీసుల కదలికలు వేగవంతం కావడంతో అప్రమత్తమైన దుండగుడు పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న కుణుతూరు వంక వత్త బాలికను వదిలేసి వెళ్లిపోయాడు. ఒంటరిగా ఏడుస్తూ ఉన్న బాలికను గమనించిన స్థానికులు బాలికను చేరదీసి బుజ్జగించారు. ఆమె ద్వారా తల్లి ఫోన్ నంబర్ తెలుసుకుని సమాచారం అందించారు. తల్లిదండ్రులతో కలిసి ఇన్‌చార్జ్ డీఎస్పీ శివరామిరెడ్డి, సీఐ హరినాథ్.. కుణుతూరుకు వెళ్లి బాలికను స్వాధీనం చేసుకున్నారు. త్వరలో కిడ్నాపర్‌ను పట్టుకుంటామని ఈ సందర్భంగా డీఎస్పీ పేర్కొన్నారు. కిడ్నాప్ కథ సుఖాంతం కావడంతో పట్టణ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.