
ఆ పిల్లలకు పాలివ్వడానికి అనుమతి లేదు!
సాక్షి, సిటీబ్యూరో: పాపం ఆ పసికందులు జన్మించి రెండు రోజులవుతున్నా ఇప్పటి వరకు వారు తల్లిపాలకు నోచుకోలేదు. పిల్లల చెంతనే ఉన్నా పాలివ్వలేని స్థితిలో కన్న తల్లుల బాధ వర్ణణాతీతం. బిడ్డ ఆరోగ్యం కోసం పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టాల్సి ఉంది. అయితే పుట్టిన శిశువుల్లో ఎవరు ఎవరి బిడ్డో అనే అంశం ఇంకా తేలక పోవడంతో ఇటు తల్లులు, అటు చిన్నారులు నరకయాతన అనుభవిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా, నోముల గ్రామానికి చెందిన గర్భిణి రమాదేవి మంగళవారం మధ్యాహ్నం ఓ శిశువుకు జన్మనివ్వగా, ఇదే సమయంలో మహబూబ్‌నగర్ జిల్లా, కడ్తాల్‌కు చెందిన రజిత కూడా అదే ఆస్పత్రిలో ప్రసవించింది.
నవజాత శిశువుల్లో ఒకరు ఆడబిడ్డ కాగా, మరొకరు మగ బిడ్డ. బిడ్డలను తల్లులకు అప్పగించే సమయంలో శిశువులు తారుమారు కావడంతో మగశిశువు తమ వాడంటే, కాదు తమ వాడని ఇరువురు బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు, వైద్యులు జోక్యం చేసుకుని ఆయా శిశువులను డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇద్దరు దంపతులతో పాటు శిశువులను నుంచి రక్తపు నమూనాలు సేకరించారు. రజిత మగబిడ్డను ప్రసవించిందని, తమ బిడ్డను తమకు ఇప్పించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఆమె తరపు బంధువులు బుధవారం కూడా ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. ఇందుకు పోటీగా రమాదేవి బంధువులు సైతం ఆందోళనకు పూనుకోవడంతో ఆస్పత్రిలో ఉద్రిక్తత నెలకొంది.
గుక్కపట్టి ఏడుస్తున్న శిశువులు..
ఈ వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా కోరుతూ ఆస్పత్రి వైద్యులు సుల్తాన్‌బజార్ పోలీసులను ఆశ్రయించారు. వివాదం తేలే వరకు శిశువులను చైల్డ్‌కేర్ సెంటర్‌లో ఉంచాల్సిందిగా వారు ఆదేశించారు. అమ్మ పొత్తిళ్లలో హాయిగా సేదతీరాల్సిన ఆ శిశువులు ఒకే గదిలో వేర్వేరు ఉయ్యాలల్లో ఆకలితో అలమటిస్తూ గుక్కపట్టి ఏడుస్తున్నారు. వీరిని తాకేందుకు తల్లులకు అనుమతి ఇవ్వకపోవడంతో జన్మనిచ్చిన తల్లులు పక్కనే ఉన్నా...దగ్గరి తీసుకుని పాలు ఇవ్వలేని దుస్థితి.
ఆస్పత్రి ఆయాలు ఇతరుల నుంచి పాలు సేకరించి పడుతున్నా..శిశువులు ఏడుపు ఆపడం లేదు. ఇదిలా ఉండగా ఈ అంశంపై పోలీసులు ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయక పోవడం విశేషం. తల్లిదండ్రులు, పిల్లల నుంచి సేకరించిన రక్తపు నమూనాలను డీఎన్‌ఏకు పంపలేదు. వీరి వరుస ఆందోళనలతో తోటి గర్భిణులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు.
ఆయాల కక్కుర్తి వల్లే..
పురిటినొప్పులతో బాధపడుతూ సుఖప్రసవం కోసం ఆస్పత్రికి చేరుకున్న గర్భిణులకు ఇక్కడి ఆయాలు, సెక్యురిటీ సిబ్బంది చుక్క లు చూపెడుతున్నారు. గేటు దగ్గర ఉన్న సెక్యురిటీ మొదలు పేగుతెంచుకుని పుట్టిన బిడ్డను చూడాలన్నా అడిగినంత ఇచ్చుకోవాల్సిందే. కేవలం వైద్యానికే కాదు పుట్టులకు కూడా ఇక్కడ ధరలు నిర్ణయించారు. ఆడబిడ్డ పుడితే రూ.700, మగ బిడ్డ పుడితే రూ.1200 వసూలు చేస్తున్నారు.
దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే బిడ్డను చూపించకుండా తల్లలకు శోకాన్ని మిగిల్చుతున్నారు. ఆస్పత్రిలో రోజుకు సగటున 25–30 ప్రసవాలు జరుగుతుండగా, ఒక్కో ప్రసవానికి సగటున రూ.10 00 చొప్పున రూ.30 వేలకుపైనే అక్రమ వసూళ్లు జరుగుతుండటం విశేషం. రమాదేవి, రజిత బిడ్డల తారుమారు విషయంలోనూ ఇదే కోణం వెలుగు చూడటం కొసమెరుపు.