కిట్టు ’రాయల్’
లేటెస్ట్ మోడల్ ద్విచక్రవాహనాల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఈ బైక్‌పై హల్‌చల్ చేసేందుకు యువత ఉరకలేస్తారు. చక్కెర్లు కొట్టేందుకు ఉర్రూతలూగుతారు. కంపెనీ నుంచి వచ్చిన బైక్‌ను తమకు అనుగుణంగా మార్చుకునేందుకు ఉవ్విళ్లూరుతారు. అటువంటి వారిలో కిట్టు ఒకరు. ఇతని పేరు తాడి కృష్ణ. ఊరు పాలకోడేరు మండలం వేండ్ర. వ్యాపారరీత్యా భీమవరంలో ఉంటారు. అతనికి రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 అంటే మోజు. దీంతో రూ.1.60లక్షలు వెచ్చించి వాహనాన్ని కొన్నారు. కొన్నదే తడవుగా దానిని హైదరాబాద్ తీసుకెళ్లి తనకు నచ్చినట్టు మార్చుకున్నారు. హ్యాండిల్, లైట్లు, అద్దాలు, కిక్‌రాడ్, ఇంజిన్, సైలెన్సర్ ఇలా ప్రతిదానినీ తన మనసుకు నచ్చినట్టు తీర్చిదిద్దారు. రిమోట్‌తో స్టార్ట్ అయ్యేలా మెరుగులు దిద్దారు. దీనికి రూ.1.30లక్షలు ఖర్చుచేశారు. ఇప్పుడు ఈ బైక్‌పై భీమవరంలో హల్‌చల్ చేస్తున్న కృష్ణను చూసి అందరూ కిట్టూ.. రాయల్ అంటూ పిలుస్తున్నారు.
- భీమవరం(ప్రకాశం చౌక్)