
శివకుమార్, నగీనా పెళ్లినాటి ఫొటో (ఫైల్)
భార్యను వేధిస్తున్న ఎస్‌ఐ
రెండో పెళ్లికి యత్నాలు
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
హిందూపురం అర్బన్: ప్రేమిస్తున్నానని చెప్పి వివాహం చేసుకుని ఇప్పుడు తనని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఒక ఎస్సైపై మహిళ ఫిర్యాదు చేసింది. అనంతపురం జిల్లా పరిగి మండలం పెద్దరెడ్డిపల్లికి చెందిన శివకుమార్, మడకశిరకు చెందిన షేక్ నగీనా హిందూపురంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదివేటప్పుడే ప్రేమించుకున్నారు.
డిగ్రీ పూర్తయ్యాక ఆమె కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది. ఆమె ఆర్థిక సహకారంతో శివకుమార్ ఎంబీఏ పూర్తి చేశారు. కొంతకాలం తర్వాత శివకుమార్ వీఆర్‌ఓ పోస్టు సాధించారు. ఇద్దరికీ ఉద్యోగం రావడంతో పెళ్లి చేసుకుందామని ఆమె కోరారు. ఎస్‌ఐ కావడం తన లక్ష్యమని, అప్పటిదాకా ఆగుదామని శివ చెప్పారు. దీంతో ఎస్‌ఐ పోస్టు కోసం ఇద్దరూ హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకున్నారు. నగీనాకు అవకాశం రాకపోగా, శివకుమార్ పోస్టు సాధించారు. శిక్షణ సమయంలోనే పెళ్లి చేసుకుందామని కోరినా ఆయన స్పందించలేదు. దీంతో నగీనా పోలీసు అధికారుల సంఘం నాయకులను ఆశ్రయించారు. ఈ విషయాన్ని వారు జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి ఇద్దరికీ అనంతపురంలోని పోలీసు శిక్షణా కళాశాల(పీటీసీ)లో 2015 డిసెంబర్ ఐదున వివాహం చేశారు. శిక్షణలో ఉన్నప్పుడే శివకుమార్ తండ్రికి జబ్బు చేయగా.. నగీనా భారీగా ఖర్చుచేసి వైద్యం చేయించారు.
శివకుమార్ చిత్తూరు జిల్లా కేవీబీపురం ఎస్‌ఐగా నియమితులయ్యారు. అనంతపురం జిల్లా గుడిబండలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నగీనా భర్తతో కలసి ఉండాలని భావించి రెండు నెలల క్రితం సెలవుపెట్టి అక్కడికి వెళ్లారు. కొన్నిరోజులకే శివకుమార్ తన కుటుంబసభ్యులతో కలసి వేధించడం మొదలుపెట్టారు. డబ్బు ఎంతైనా ఇస్తానని, వెళ్లిపోవాలని వేధించేవారు. దీంతో ఆమె మనస్తాపానికి గురై హిందూపురం వన్‌టౌన్ సీఐ ఈదురుబాషాకు ఫిర్యాదు చేశారు. శివకుమార్‌కు జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రముఖ నేత బంధువుల అమ్మాయితో రెండో పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.