వలస కూలీ దుర్మరణం
రాయదుర్గం రూరల్ : జిల్లాలో ఉపాధి అవకాశాలు లేక పొట్టకూటికి పొరుగు రాష్ట్రానికెళ్లిన ఓ భవననిర్మాణ కూలి శుక్రవారం బెంగళూరులోని ఓ ఐదంతస్తుల భవనం నుంచి ప్రమాదవశాత్తూ కిందపడి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు ..
రాయదుర్గం మండలం ఆయతపల్లి గ్రామానికి చెందిన హరిజన నాగరాజు (30), రుద్రమ్మ దంపతులు. వీరికి ఐశ్వర్య, దీపిక సంతానం. అయితే ఇక్కడ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో నాగరాజు తన పిల్లల్ని అన్న వన్నూరుస్వామి వద్ద వదిలి భార్యతో కలిసి రెండు నెలల క్రితం బెంగళూరు వలసవెళ్లాడు. అక్కడ భవన నిర్మాణ పనుల్లో కూలీలుగా చేరారు.
అయితే శుక్రవారం ఓ భవనం వద్ద పనులు చేస్తుండగా నాగరాజు ఐదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కాలుజారి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రుద్రమ్మ భర్త మృతదేహంపై పడి గుండెలవిసేలా రోధించింది. సమాచారాన్ని ఆయతపల్లి గ్రామంలో కుటుంబసభ్యులకు తెలపడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని వాహనంలో బెంగళూరు నుంచి ఆయతపల్లికి తరలించారు. పెద్ద దిక్కును కోల్పోవడంతో పిల్లలు అనాథలుగా మారారు. ఉపాధి పనుల కోసం సూదూర ప్రాంతాలకు వలసలు వెళ్లి అనేక మంది నైపుణ్యం లేని కూలీలు మృత్యువాత పడుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.