దీనస్థితిలో.. | lady dubai 1 lakh | Sakshi
Sakshi News home page

దీనస్థితిలో..

Published Fri, May 26 2017 11:22 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM

దీనస్థితిలో..

దీనస్థితిలో..

పొట్టకూటి కోసం వెళ్లి.. ఎడారి దేశంలో బందీగా మారిన యానాం మహిళ 
విజిటింగ్‌ వీసాతో దుబాయ్‌కు పంపి మోసగించిన ఏజెంట్‌
రూ.లక్ష చెల్లిస్తేనే దేశానికి పంపుతామంటున్న గల్ఫ్‌ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ
ప్రభుత్వ చేయూతకు ఎదురుచూపులు 
 
 ఉపాధి కోసం ఎడాది దేశానికి వెళ్లి కుటుంబానికి ఆసరాగా నిలుద్దామనుకున్న మహిళలు తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. గల్ఫ్‌ దేశాలకు పంపే ఏజెంట్‌ వారిద్దరికీ విజిటింగ్‌ వీసాలు ఇచ్చి మోసగించడంతో దేశంకాని దేశంలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 
- యానాం
గత ఏడాది ఏప్రిల్‌ 9న దరియాలతిప్పకు చెందిన చెక్కా గౌరి, అదే విధంగా ఏప్రిల్‌ 28న సంగాడి దీన అనే ఇద్దరు మత్స్యకార మహిళలను అదే ప్రాంతానికి చెందిన ఏజెంట్‌ వాతాడి సత్యనారాయణ అనే వ్యక్తి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.20వేలు చొప్పున తీసుకుని ఉద్యోగవీసా అని చెప్పి విజిటింగ్‌ వీసా ద్వారా దుబాయ్‌కు పంపాడు. అయితే వీరు దుబాయ్‌లో దిగిన తరువాత అధికారులు తనిఖీచేయడంతో విజిటింగ్‌ వీసా అని తేలింది. నెలరోజులు మాత్రమే గడువు ఉంటుందని వారు చెప్పారు. అయితే వీరిని యూఏఈ(యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌)లోని అజ్మాన్‌ అనే ప్రాంతంలోని అల్‌వాసెట్‌ అనే లేబర్‌ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయానికి పంపారు. వీరిని ఎవరైనా వచ్చి పనిలో చేర్చుకుంటారనే ఆశతో ఆ కార్యాలయంలోనే కొన్నిరోజులుగా ఉంటున్నారు. అయితే బాధిత మహిళలను సంబంధిత రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ అధికారులు ఒక గదిలో బంధించారు. వీరిని తిరిగి భారతదేశానికి పంపాలంటే రూ.1.50 లక్షలు కట్టాల్సి ఉంటుందని దుబాయ్‌కు చెందిన లేబర్‌ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో భాదిత మహిళల కుటుంబసభ్యులు ఏంచేయాలో తెలియక రూ.50వేలను పంపడంతో ఇటీవలి చెక్కా గౌరి 28రోజుల పాటు నరక యాతన అనుభవించి క్షేమంగా ఇంటికి చేరుకుంది. 
రూ.లక్ష.. 15 రోజుల్లో పంపాలి..
రెండో మహిళ దీనను పంపాలంటే రూ.లక్షను 15 రోజుల్లో పంపాలని, లేకపోతే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందుకు జైలులో పెడతారని అధికారులు చెబుతున్నారని ఆమె బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సూత్రధారి ఏజెంట్‌ సత్యనారాయణ మాత్రం తనకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నాడని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదరికంతో ఉంటున్న తాము అంత సొమ్ము ఏవిధంగా సంపాదించాలో అర్థంకావడం లేదనివారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  అధికారులు స్పందించి దుబాయ్‌లో ఉన్న ఇండియన్‌ ఎంబసీ అధికారులతో మాట్లాడి దీనను స్వదేశానికి తిరిగి తీసుకువచ్చేలా కృషి చేయాలని వారు కోరుతున్నారు.
పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు
దుబాయ్‌కు విజిటింగ్‌ వీసాపై పంపిన ఏజెంట్‌ వాతాడి సత్యనారాయణపై బాధితుల కుటుంబసభ్యులు దరియాలతిప్ప పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై కనకారావుకు ఫిర్యాదు చేశారు. 
ఆ దేశంలో నరకమే 
తాను వెళ్లిన దుబాయ్‌లోని రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలో వందలాది మంది మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మన దేశం నుంచి వెళ్లిన మహిళలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఏదైనా అడగాలంటే భాషరాని పరిస్థితి. తినడానికి తిండిలేదు. ఒక్కోసారి నాపై దాడి చేసేవారు. నా కుటుంబ సభ్యులు డబ్బులు కట్టడమే కాకుండా విమాన టికెట్‌ కూడా పంపారు. అందుకే నేను రాగలిగాను. పాపం డబ్బులు లేని వారి పరిస్థితి ఏంటి? వారు అక్కడే నరకం చూస్తున్నారు.
చెక్కా గౌరి, దరియాలతిప్ప 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement