విశాఖ నడిబొడ్డున టీడీపీ కబ్జాకాండ! | land capture in vishakapatnam | Sakshi
Sakshi News home page

విశాఖ నడిబొడ్డున టీడీపీ కబ్జాకాండ!

Published Thu, Dec 24 2015 9:17 AM | Last Updated on Sat, Aug 11 2018 4:32 PM

విశాఖ నడిబొడ్డున టీడీపీ కబ్జాకాండ! - Sakshi

విశాఖ నడిబొడ్డున టీడీపీ కబ్జాకాండ!

విశాఖపట్నం: ఈ పక్కనున్న ఫొటోను చూశారా!.. విశాఖ నగరం నడిబొడ్డున అత్యంత విలువైన దసపల్లా హిల్స్ ప్రాంతమిది. ఇక్కడ ఎకరా రూ.25 కోట్లపై మాటే. అంత విలువైన ప్రాంతంలో ఉన్న ఓ కొండను తొలిచేస్తూ చదును చేసేస్తున్నారు చూశారా!.. ఇలా చేస్తున్నది వేరెవరో కాదు.. సాక్షాత్తు అధికార పార్టీవారే.  టీడీపీ జిల్లా కార్యాలయం విస్తరణ కోసమని ఈ కొండను దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. రెవెన్యూ అధికారులను కూడా సంప్రదించలేదు.. నిర్మాణ పనులకు జీవీఎంసీ అనుమతి అసలే తీసుకోలేదు. అధికార పార్టీ అన్న ధీమాతో ఇప్పటికే రూ.25 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేసి.. ఇంకా ఆక్రమణను కొనసాగిస్తున్నారు. 
 
టీడీపీ కార్యాలయ విస్తరణ కోసం..
నగరంలోని దసపల్లా హిల్స్‌లో జిల్లా టీడీపీ కార్యాలయం ఉంది. చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో సర్వే నంబర్ 1197లో 2వేల గజాలను టీడీపీ కార్యాలయానికి కేటాయించారు. అందులో కార్యాలయాన్ని నిర్మించి పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దాని వెనుక భాగంలో 1196, 1197 సర్వే నెంబర్లలో 5.50 ఎకరాల వివాదాస్పద స్థలం ఉంది. ఆ భూమి మీద హక్కుల కోసం ప్రైవేటు వ్యక్తులు, రెవెన్యూ శాఖ మధ్య ఎన్నో ఏళ్లుగా న్యాయ వివాదం ఉంది. ఆ భూమి తమ ఆధీనంలోనే ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వాస్తు దోష నివారణ కోసమని ఈశాన్య దిశగా ఉన్న కొండను చదును చేసేందుకు ప్రయత్నించారు. అప్పట్లో రెవెన్యూ అధికారులు తక్షణం స్పందించి ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు. 
 
దర్జాగా కబ్జా
టీడీపీ మళ్లీ అధికారంలోకి రాగానే ఆ కొండపై పడ్డారు. కొన్ని రోజులుగా కొండను తొలిచేస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఎకరా వరకు చదును చేసేశారు.  ఇంకా పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికి ఆక్రమించేసిన ఎకరా స్థలం మార్కెట్ విలువ దాదాపు రూ.25 కోట్లవరకు ఉంటుంది. రెవెన్యూ శాఖ ఆధీనంలో ఉన్న ఆ కొండను చదును చేస్తున్న విషయం కనీసం ఆ శాఖ అధికారులకు కూడా చెప్పలేదు. 
 
లోకేష్ కనుసన్నల్లోనే....
ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున జిల్లాల్లో టీడీపీ కార్యాలయాల బాధ్యతలను నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అంటే విశాఖ నగరంలో టీడీపీ కార్యాలయం కోసం కొండ కబ్జా కూడా లోకేష్‌కు తెలిసే.. ఆయన సమ్మతితోనే జరుగుతోందని సమాచారం. మరి చినబాబే స్వయంగా రంగంలోకి దిగితే కొండలు ఓ లెక్కా అన్నట్లుగా సాగుతోంది ఈ కబ్జా బాగోతం.
 
 మా అనుమతి తీసుకోలేదు
 దసపల్లా హిల్స్‌లోని కొండ రెవెన్యూ శాఖ ఆధీనంలోనే ఉంది. దాన్ని చదును చేసేందుకు ఎవరూ మా అనుమతి కోరలేదు.
 - కేవీఎస్ రవి, అర్బన్ ఎమ్మార్వో  
 
 జీవీఎంసీ అనుమతులు లేవు
దసపల్లా హిల్స్‌లో కొండను చదును చేసి నిర్మాణాలకు అనుమతుల కోసం ఎవ రూ దరఖాస్తు చేయలేదు. మా అధికారులను గురువారం అక్కడికి పంపించి తనిఖీ చేయిస్తాం. పనులు చేస్తున్నవారి వద్ద సరైన పత్రా లు ఉన్నాయో.. లేదో కూడా పరిశీలిస్తాం. 
 - వెంకటరత్నం, చీఫ్ సిటీ ప్లానర్, జీవీఎంసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement