గాయపడిన శంభాన సత్యం
లావేరు : వెంకటాపురం గ్రామంలో భూతగాదా విషయంలో సోమవారం జరిగిన కొట్లాటలో ముగ్గురు గాయపడ్డారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటాపురం గ్రామానికి చెందిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ సీహెచ్ రామరావు తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాలు... వెంకటాపురం గ్రామానికి చెందిన శంభాన తౌడు, శంభాన గోవింద వర్గాల మధ్య కొన్ని రోజులుగా భూ వివాదం నడుస్తుంది. ఈ క్రమంలో సోమవారం శంభాన తౌడుతో పాటు అతని వర్గానికి చెందిన శంభాన గొల్ల, శంభాన సత్యంపై ప్రత్యర్ధి వర్గానికి చెందిన శంభాన గోవిందతో పాటు శంభాన లక్ష్మునాయుడు, శంభాన పవన్, శంభాన సూరీడమ్మ, పొట్నూరు తౌడు దాడికి పాల్పడి కర్రలతో కొట్టి గాయపరిచారు. కొట్లాటలో శంభాన గొల్ల, శంభాన తౌడు, శంభాన సత్యం గాయపడ్డారు.
వీరిని చికిత్స నిమిత్తం 108లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. లావేరు ఎస్‌ఐ రామారావు విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని వివాదాస్పద భూమిని పరిశీలించారు. దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ చెప్పారు. శంభాన గోవిందతో పాటు శంభాన లక్ష్మునాయుడు, శంభాన పవన్, శంభాన సూరీడమ్మ, పొట్నూరు తౌడుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.