‘దారి’ తప్పిన విజి‘లెన్స్‌’! | less loyalty of ntr vydyaseva | Sakshi
Sakshi News home page

‘దారి’ తప్పిన విజి‘లెన్స్‌’!

Published Sat, Jan 7 2017 11:44 PM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM

‘దారి’ తప్పిన విజి‘లెన్స్‌’!

‘దారి’ తప్పిన విజి‘లెన్స్‌’!

- ‘ఎన్టీఆర్‌ వైద్య సేవ’పై విచారణలో కొరవడిన నిజాయితీ
అనంతపురం మెడికల్‌ : ఆరోగ్య శ్రీ... నిరుపేదలు సైతం కార్పొరేట్‌ వైద్యం అందుకోవాలన్న ఆశయంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పురుడుపోసుకున్న పథకం. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక దీన్ని ‘ఎన్టీఆర్‌ వైద్యసేవ’గా మార్చారు. జిల్లాలో ప్రభుత్వ సర్వజనాస్పత్రి, కదిరి ఏరియా ఆస్పత్రితో పాటు 20కి పైగా నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఈ పథకం కింద వైద్యసేవలు అందిస్తున్నారు. 2014 - 15లో రూ.17 కోట్లు, 2015 - 16లో రూ.28 కోట్లను ప్రైవేట్‌ ఆస్పత్రులకు కట్టబెట్టారు. 15 వేలకు పైగా శస్త్ర చికిత్సలు జరిగాయి.

ఈ క్రమంలో పలు ఆరోపణలు రావడంతో పథకం అమలు తీరు ఎలా ఉందో తెలుసుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగా విజిలెన్స్‌ అధికారులు నేరుగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ నుంచి ఈ రెండేళ్ల వ్యవధిలో శస్త్ర చికిత్సలు, లబ్ధిదారుల వివరాలు తీసుకున్నారు. శుక్రవారం సర్వజనాస్పత్రిలో ఎన్టీఆర్‌ వైద్య సేవ కో-ఆర్డినేటర్‌ సౌజన్యకుమార్‌ను విజిలెన్స్‌ సీఐ జీవన్‌ గంగనాథ్‌బాబు కలిశారు. ఆరోగ్య మిత్రను, సర్వజనాస్పత్రికి చెందిన వైద్యులు నారాయణ, రమేష్‌లను తోడుగా తీసుకుని శనివారం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 20 మంది వివరాలు రాబట్టారు. అయితే ఆపరేషన్‌ చేయించుకున్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకోవాల్సిన అధికారులు కొందరి విషయంలో అలా విచారించలేదని తెలుస్తోంది.

మధ్యాహ్నం నగరంలోని గుత్తి రోడ్డులో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ అధికారి కార్యాలయం పక్కన పార్కింగ్‌ ప్రదేశంలో వినాయక్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి (ఆపరేషన్‌ చేయించుకున్న వారి కుటుంబ సభ్యుడు)ని పిలిపించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ విషయం తెలిసి మీడియా అక్కడకు వెళ్లడంతో డాక్టర్లు, విజిలెన్స్‌ అధికారులు జారుకున్నారు. లోటుపాట్లను పట్టుకుని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిన విజిలెన్స్‌ అధికారులు ఇలా ‘పక్కదారి’ పట్టడం అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా మరో నాలుగు రోజుల పాటు విజిలెన్స్‌ అధికారుల విచారణ కొనసాగనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత తాము కలిసిన వారికి సంబంధించి కేస్‌షీట్లను ఆస్పత్రుల నుంచి తీసుకుని ఆన్‌లైన్‌లో పరిశీలించనున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement