మల్టీకేర్‌లో ఘరానా మోసం | Fraud In Multi Care | Sakshi
Sakshi News home page

మల్టీకేర్‌లో ఘరానా మోసం

Published Thu, Apr 12 2018 8:42 AM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM

Fraud In Multi Care - Sakshi

బాధితుడు పొదిలాపు రాంబాబు 

పాలకోడేరు : నిరుపేదలకు ఖరీదైన వైద్యం అందించాలనే సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్‌ ఆరోగ్యశ్రీని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ వైద్య సేవగా పేరుమార్చి అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామానికి చెందిన పొదిలాపు రాంబాబు ఎఫ్‌సీఐలో హమాలీగా పనిచేస్తున్నాడు.

ఫిబ్రవరి నెలలో సైకిల్‌పై వెళ్తుండగా వెనుక నుంచి మోటార్‌ సైకిలిస్ట్‌ ఢీకొట్టాడు. ఫలితంగా మెడ భాగంలో గట్టిగా దెబ్బ తగిలింది. మెడ కదల్చలేని స్థితిలో విశాఖ పట్టణంలోని ఆదిత్య మల్టికేర్‌ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి మెడ భాగంలో పూసలు కొద్దిగా తప్పుకున్నాయని, ఫలితంగా నరాలు దెబ్బతిన్నాయని ఆపరేషన్‌ ద్వారా సరిచేయవచ్చని చెప్పారు.

అందుకు రాంబాబు సరేనన్నారు. ఇక అక్కడ నుంచి శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ సినిమా మొదలైంది. న్యూరో సర్జన్‌ అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ గొల్లా రామకృష్ణ ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఆపరేషన్‌ చేసి మందులిచ్చి పంపించేశారు. మందులు ప్రభావంతో కొద్ది రోజులు తగ్గినా మరలా పరిస్థితి మామూలుగా తయారయింది.

రెండోసారి వెళ్లినప్పుడు కూడా మందులిచ్చి పంపేంచేశారు. ఈసారి పరిస్థితి సీరియస్‌గా మారింది. కాళ్లు, చేతులకు రక్త ప్రసరణ తగ్గి కదలికలు లేకుండా స్తంభించిపోయాయి. కేవలం ద్రవ ఆహారంపైనే ఆధారపడటంతో శరీరం క్షీణించి పోయింది.

దాంతో విషయం తెలిసిన ఆర్‌టీఐ ప్రొటెక్షన్‌ కౌన్సిల్‌ జిల్లా కోఆర్డినేటర్‌ కె.శ్రీనివాస్‌ భీమవరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో స్కానింగ్‌ తీయించగా ఆశ్చర్యకరమైన విషయం బహిర్గతమైంది. అసలు రాంబాబుకు ఆపరేషనే జరగలేదని పరీక్షల్లో తేలింది.

ఇదే విషయమై విశాఖలోని ఆస్పత్రి వర్గాలను ప్రశ్నించినా స్పందన లేదని శ్రీనివాస్‌ తెలిపారు. ప్రస్తుతం మరో చోట వైద్యం చేయించుకుందామన్నా వైద్యసేవ కార్డు ఆస్పత్రి వర్గాల్లో క్లెయిమ్‌ చేయించుకున్నారని దాంతో పనికి రాకుండా పోయిందన్నారు. ప్రభుత్వమే స్పందించి బాధితునికి మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement