ఉందామా..పోదామా!
– ఎమ్మెల్సీ ఇవ్వనందుకు ఫరూక్ అసంతృప్తి
– టీడీపీని వీడాలని అనుచరుల ఒత్తిడి
– త్వరలో కార్యకర్తల సమావేశం
నంద్యాల: ఎమ్మెల్సీ పదవి ఇవ్వనందున టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అసంతృప్తికి గురయ్యారు. పార్టీ ఆవిర్భావం నుంచి సేవలు అందిస్తున్న తనను పట్టించుకోకుండా.. జూనియర్లకు, ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తూ.. తనను పార్టీ అధిష్టానం అవమానించిందని ఆయన ఆవేదన చెందారు. సోమవారం స్థానిక రాజ్ థియేటర్‌లోని తన కార్యాలయంలో పార్టీ నాయకుల వద్ద తన బాధను వ్యక్త పరిచారు. దీంతో పలువురు టీడీపీ నాయకులు భావోద్వేగానికి గురై.. పార్టీని వీడాలని సూచించారు. ఈ విషయమై త్వరలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కుమారుడు ఎన్‌ఎండీ ఫిరోజ్ భావిస్తున్నట్లు సమాచారం.
టీడీపీలో మైనార్టీ నేతగా ఉన్న ఫరూక్ గతంలో రెండుసార్లు మంత్రిగా, శాసన సభ ఉపసభాపతిగా పని చేశారు. రాజకీయంగా ఆయనకు 2004 నుంచి తిరోగమనం మొదలైంది. శాసన సభకు 2004లో, పార్లమెంట్ స్థానానికి 2009, 2014లో పోటీ చేసి ఓడారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పార్టీలో మైనార్టీ ఎమ్మెల్యే ఎవరూ లేకపోవడంతో సీనియర్ నేత ఫరూక్‌కు ఎమ్మెల్సీ, మంత్రి పదవి రావచ్చునని ప్రచారం జరిగింది. అయితే చివరకు నిరాశే ఎదురైంది.
కొరవడిన సహకారం..
ఎమ్మెల్యే, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకోవాలని ఫరూక్ తీవ్రంగా ప్రయత్నించారు. పార్టీలో తానే సీనియర్ మైనార్టీ నేతనని, తనకు అవకాశం ఇవ్వాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి కోరారు. తర్వాత పార్టీలో సమకాలీకులైన పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావు, మంత్రి యనమల రామకృష్ణుడులను కలిసి సహకారాన్ని కోరారు. కాని సీఎం చంద్రబాబు నాయుడు మొండిచేయి చూపారు.