పచ్చ లాటరీ.. అబ్బో భలే వ్యాపారం! | Lottery tickets selling behind political leader hand | Sakshi
Sakshi News home page

పచ్చ లాటరీ.. అబ్బో భలే వ్యాపారం!

Published Thu, Feb 18 2016 6:28 PM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM

పచ్చ లాటరీ.. అబ్బో భలే వ్యాపారం!

పచ్చ లాటరీ.. అబ్బో భలే వ్యాపారం!

నిషేధిత టికెట్ల ముద్రణ..
విక్రయం పెట్టుబడి లేకుండా రోజుకు రూ.3 లక్షల వ్యాపారం
దగ్గరుండి జరిపిస్తున్న జిల్లా టీడీపీ కీలక నేత
పోలీసులకూ నెలవారీ మామూళ్లు
పేదల జేబులు గుల్ల

 
సాక్షి టాస్క్ ఫోర్స్:  ‘‘రోజుకు రూ.3 లక్షలు.. పది రోజులకు రూ.30 లక్షలు.. నెలకు రూ.90 లక్షలు ఏడాదికి రూ 10.8 కోట్లు..’’ అబ్బో ఇదేదో భలే వ్యాపారంలా ఉంది కదూ..? నిజమే.. ఈ వ్యాపారం చేయాలంటే తొలుత టీడీపీలో క్రియాశీలక కార్యకర్తగా ఉండాలి. తర్వాత జిల్లా పార్టీలో కీలక పోస్టులో ఉన్న నాయకుడి అండదండలు ఉండాలి. స్పెషల్ బ్రాంచ్‌లో ఓ కానిస్టేబుల్‌కు రోజువారీ వ్యాపారం లెక్కలు చూపించి అతనికీ వాటా ఇవ్వాలి. ఒక్క రూపాయీ పెట్టుబడి అవసరంలేదు. ఇంతకూ ఏమిటా వ్యాపారం అంటారా..? దాని పేరే లాటరీ టికెట్లు. చెప్పుకోవడానికి చిన్నదిగా అనిపించినా ఈ వ్యాపారం చేసి ఏడాదిలో కోట్లకు పడగలెత్తుతున్నారు. అధికార పార్టీ నాయకులు, కొందరు పోలీసు అధికారుల కనుసన్నల్లో చిత్తూరు నగరంలో సాగుతున్న ఈ దందాపై ‘సాక్షి’ టాస్క్‌ఫోర్స్ పరిశీలన కథనం..
 
రాష్ట్రంలో లాటరీ టికెట్ల విక్రయాలపై ఎప్పటి నుంచో నిషేధం ఉన్నా.. రిక్షా కార్మికులు, హమాలీలు, రోజువారీ కూలి చేసే వాళ్లు, మెకానిక్‌లు, పెయింటర్లు, పండ్ల వ్యాపారులు లక్ష్యంగా, వాళ్లకున్న బలహీనతే పెట్టుబడిగా లాటరీ వ్యాపారం జరుగుతోంది. కంప్యూటర్‌లో కొన్ని సీరియల్ నెంబర్లను తయారుచేసి ఓ తెల్లకాగితంపై ప్రింట్‌తీస్తారు. వాటిని లాటరీ టికెట్లుగా నగరంలో చెలామణి చేస్తున్నారు. ఇలా ఒక రోజుకు లక్ష నుంచి 1.5 లక్షల టికెట్లను విక్రయిస్తున్నారు. నిర్వాహకుడికి రోజుకు రూ.3 లక్షల వరకు నగదు వచ్చి చేరుతుంది. దీపావళి, ఉగాది, సంక్రాంతి లాంటి పండుగ సమయాల్లో ఈ వ్యాపారం రెట్టింపవుతుంది.

ఎంతలేదన్నా నెలకు దాదాపు రూ.కోటి, ఏడాదికి రూ.12 కోట్ల వ్యాపారం ఒక్క చిత్తూరు నగరంలోనే నకిలీ లాటరీ విక్రయాల ద్వారా జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడి హస్తం ఉంది. ఈ దందాలో ఏదైనా ఇబ్బందులు వస్తే తమను రక్షించాలని చిత్తూరులోని టీడీపీ ప్రధాన నాయకుడి నుంచి హామీ తీసుకున్నారు. గతంలో లాటరీ విక్రయించిన వాళ్లు కూడా ప్రస్తుతం అధికారపార్టీ నేత హామీతో పలమనేరు, తమిళనాడు, మదనపల్లె ప్రాంతాలకు టికెట్లు పంపుతున్నారు. రోజువారీ వ్యాపారంలో 50 శాతం వాటాలు ఆయనకు వెళుతున్నాయి. ఆ నేత చెప్పిన వాళ్లవైపు పోలీసులు కన్నెత్తి చూడరని, ఆయన కరుణ లేనిదే వ్యాపారం చేయడం కుదరదని ఇతర వ్యాపారులు చెబుతున్నారు.
 
చిత్తూరు నుంచి ఎగుమతి
చిత్తూరు నగరంలో తయారయ్యే లాటరీలు బంగారుపాళ్యం, పలమనేరు, సత్యవేడు, కుప్పం, పుంగనూరు, మదనపల్లె, గంగాధరనెల్లూరు ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. చిత్తూరులోని వన్నియార్ బ్లాక్‌లో గతంలో లాటరీల ప్రింటింగ్ జరిగేది. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చిన గొడవతో ఈ ప్రాంతం అందరికీ తెలిసిపోవడంతో నిర్వాహకులు తయారీ స్థలాన్ని మార్చేశారు. నగరంలోని సంతపేట వద్ద ఉన్న పాత లైబ్రరీ వద్ద ఓ ప్రధాన డీలర్ నుంచి అన్ని ప్రాంతాలకు లాటరీలు సరఫరా చేస్తున్నారు. మధ్యాహ్నం 1.30, సాయంత్రం 4, రాత్రి 8 గంటల ప్రాంతాల్లో మాత్రమే పనిచేసే ఈ కార్యాలయం నుంచి పెద్ద మొత్తంలో నకిలీ లాటరీ టికెట్లు పంపిణీ అవుతున్నాయి. చిత్తూరులో పాత బస్టాండు, హై రోడ్డు, సంతపేట, గిరింపేట, సీబీ.రోడ్డు, దర్గాచౌక్, ఎస్టేట్, కొంగారెడ్డిపల్లె, బజారువీధి, చర్చీవీధి, పలమనేరు రోడ్డు ప్రాంతాల్లో ఎప్పుడూ లాటరీల విక్రయాలు జరుగుతూనే ఉంటాయి.

వీటికి డిమాండ్ ఎక్కువ
నకిలీ లాటరీల్లో ప్రముఖంగా చాలా బ్రాండ్లు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒక్కో టికెట్ ధర రూ.2 చొప్పున విక్రయిస్తున్నారు.  చిత్తూరులో ప్రింటయ్యే లాటరీల్లో సింగమ్ రూ.24కు (12 టికెట్లు), కుయిల్ రూ.40 (20 టికెట్లు), రోజా రూ.60 (30 టికెట్లు), తంగమ్ రూ.100 (50 టికెట్లు), డీర్ రూ.100 (50 టికెట్లు), నల్లనేరమ్ రూ.200 (వంద టికెట్లు), ఆపిల్ రూ.200(వంద టికెట్లు), కుమరన్ రూ.400 (200 టికెట్లు), విష్ణు రూ.500 (250 టికెట్లు) విక్రయిస్తున్నారు. వీటిల్లో ఉండే నెంబర్ల సీరీస్ ఆధారంగా బహుమతులు వచ్చేలా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోజుకు రూ.3 లక్షల వ్యాపారంలో టికెట్లు కొన్నవారు అందరికీ కలిపి మొత్తం మీద రూ.10 వరకు బహుమతులు వచ్చేలా ప్లాన్‌చేసి మిగిలిన మొత్తాన్ని దోపిడీ చేస్తున్నారు. వ్యవహారం కొందరు ప్రజలకు తెలిసినా ఈ బలహీనతను వదల్లేక, ఇందులోంచి బయటపడలేక చేతిలో ఉన్న నగదును లాటరీకు తగలేస్తున్నారు.

 స్పెషల్ బ్రాంచ్ పాత్ర
 లాటరీ అమ్మకాలపై నగరంలో గత ఏడాది మొదట్లో పోలీసుల దాడులుచేసి కేసులు పెట్టారు. ఈ వ్యాపారం జరపకూడదని వ్యాపారులకు గట్టిగానే చెప్పారు. కొంతకాలం తరువాత లాటరీ విక్రయాల జోలికి వెళ్లొద్దంటూ టీడీపీ నేత ఒకరు పైస్థాయి నుంచి చెప్పించారు. తాము ఎవరి పేరు చెబుతామో వారిని అరెస్టు చేయాలని, మిగిలిన వ్యాపారుల వద్దకు వెళ్లొద్దని అనధికారిక ఆదేశాలు అందాయి. దీంతో పోలీసుల్లో కొందరు నెలసరి మామూళ్లకు అలవాటుపడి లాటరీ విక్రయాలను పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) పాత్ర బలంగా వినిపిస్తోంది.

లాటరీ ముద్రించే వ్యక్తులు ఎస్‌బీలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ చెప్పిన వాళ్లకే విక్రయానికి టికెట్లను ఇస్తారని అందరూ చెప్పుకుంటున్నారు. ఆ వ్యక్తి చెప్పనిదే కొత్త వ్యాపారులకు లాటరీ టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. చిత్తూరు నగరాన్ని ప్రక్షాళన చేయడానికి ఎస్పీ శ్రీనివాస్ ఎన్ని చర్యలు చేపడుతున్నా పోలీసుల అండదండలతో జరుగుతున్న ఇలాంటి వ్యాపారాలు ప్రజల్లో ఖాకీలపై ఉన్న నమ్మకాన్ని వమ్ముచేస్తున్నాయి.
 
 ఎందరు చెప్పినా అంతే
 చిత్తూరు నగరంలో జరుగుతున్న నకిలీ లాటరీల వ్యవహారంపై గతంలోనే మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ జిల్లా కలెక్టర్ నుంచి ఎస్పీ వరకు అందరికీ ఫిర్యాదు చేశారు. సొంత పార్టీలోని వ్యక్తులు చేస్తున్న ఈ అనాగరిక చర్య వల్ల పార్టీకి సైతం చెడ్డ పేరు వస్తోందని స్వయాన మంత్రి బొజ్జలకు సైతం ఫిర్యాదు చేశారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అయితే ఏకంగా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలోనే నగరంలో జరుగుతున్న లాటరీ వ్యాపారంపై ప్రస్తావించారు. అయినా సరే అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement