
మరో నయవంచకుడు
► ప్రేమించి పెళ్లి చేసుకున్నాక చిన్నచూపు
►తక్కువ కులం దానివంటూ చిత్రహింసలు
►అదనపు కట్నం కోసం గెంటివేత
► గర్భవతిని చేసి వదిలించుకునేందుకు కుట్ర
ప్రేమించేటప్పుడు ఆమె కులం అడ్డు రాలేదు.. పెళ్లి చేసుకునే సమయంలోనూ ఆమె కులం, గోత్రం అడ్డు కాలేదు.. నెల తప్పాక ఆమె కులం గుర్తొచ్చింది. తక్కువ కులం దానివంటూ సూటిపోటు మాటలతో ఆమెను ప్రతి రోజూ చిత్రహింసలు పెడుతున్నాడు. చివరకు అదనపు కట్నం తెస్తేనే కాపురం చేస్తానంటూ అడ్డం తిరిగాడు. అందుకు ఆమె నిస్సహాయత స్థితిలో ఉండిపోయింది. గర్భిణి అనే విషయం మరచి ఆమెను ఇంటి నుంచి గెంటేశాడో నయవంచకుడు .కాగా అతని కుల పెద్దలు రాజకీయ పలుకుబడితో వారిద్దరినీ విడదీయాలని
చూడటంచర్చనీయాంశమైంది. - గోరంట్ల
గోరంట్లలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వనజ, వాల్మీకి వర్గానికి చెందిన తలారి బాలాజీ ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. చేసేది లేక ప్రేమికులు కుల పెద్దలను ఆశ్రయించారు. దళిత, గిరిజ కుల సంఘాల పెద్దలతో పాటు వాల్మీకి సంఘం పెద్దల సమక్షంలో వారి పెళ్లి గత ఏడాది ఆగస్టు 28న గోరంట్లలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో జరిగింది. అప్పటి నుంచి వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఇప్పుడామె ఐదు నెలల గర్భిణి.
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన సమయంలో...
వనజ కడుపులో పెరుగుతున్న తన ప్రతిరూపాన్ని ఊహించుకుని ఆనందించాల్సిన బాలాజీ ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. తన భార్య కులం గుర్తొచ్చింది. తక్కువ కులం దానివంటూ హేళన చేయడం ప్రారంభించాడు. అలా రోజురోజుకు అతని ప్రవర్తన శ్రుతిమించిపోతోంది. ‘కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నా.. నిన్ను వదిలించుకుంటే దండిగా డబ్బులు ఇచ్చే వారున్నారంటూ’ తన మనసులోని మాటను బయటపెట్టాడు. అయిన వారందరినీ వదులుకుని వచ్చిన ఆమెకు అప్పటికి జ్ఞానోదయం కాలేదు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినోడి మనసులోని దుర్భుద్ధిని పసిగట్టలేకపోయింది.
తెలుసుకునేలోగానే ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు. తిరిగి పుట్టింటికి చేరిన ఆమె న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. భర్త బాలాజీ, అత్తమామలు చెన్నమ్మ, కదిరప్ప, ఆడబిడ్డ ఇందిరమ్మ, ఆమె భర్త నాగరాజు(వీరిద్దరిది సోమందేపల్లి)పై కేసు పెట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ కేసును నీరుగార్చేందుకు బాలాజీ సామాజిక వర్గానికి చెందిన కొందరు పెద్దలు రాజకీయ పలుకుబడితో ప్రయత్నిస్తున్నట్లు బాధితురాలు ఆరోపించింది