అండగా ఉంటామంటూ పదవిని ఒదులుకోమన్నారు.. | Macharla muncipal chairperson resigne | Sakshi
Sakshi News home page

అండగా ఉంటామంటూ పదవిని ఒదులుకోమన్నారు..

Published Fri, Aug 5 2016 10:38 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM

అండగా ఉంటామంటూ పదవిని ఒదులుకోమన్నారు.. - Sakshi

అండగా ఉంటామంటూ పదవిని ఒదులుకోమన్నారు..

► అండగా ఉంటామంటూ పదవిని ఒదులుకోమన్నారు..
దిక్కుతోచని స్థితిలోనే చైర్‌పర్సన్‌ శ్రీదేవి రాజీనామా!

మాచర్ల: ఎలాగైతేనేం వైరిపక్షం విజయం సాధించింది...ఒక పక్క భర్తను కోల్పోయి బాధలో ఉన్నా ఆమెను రాజకీయంగా వెంటాడుతూనే ఉన్నారు... పదవి వదులుకో మేము సహాయం చేస్తామంటూ పరామర్శల పేరుతో నిత్యం రాజకీయాలు నడిపారు...పార్టీ ఒప్పందం పేరుతో చివరికి పంతం నెగ్గించుకున్నారు. మాచర్ల మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీలో చోటుచేసుకున్న నాటకీయ పరిణామలు చూసి పలువురు ముక్కున వేలేసుకున్నారు. టీడీపీ అంతర్గత పోరులో భాగంగా కథ ఎలా నడిచిందంటే....  రెండున్నర సంవత్సరాల కిందట మున్సిపల్‌ ఎన్నికలు వచ్చిన సమయంలో ఎవరూ ముందుకు రాకపోవటంతో గోపవరపు శ్రీదేవి కుటుంబాన్ని రంగంలోకి దించారు.

రెండున్నరేళ్ల ఒప్పందంతో శ్రీదేవి మున్సిపల్‌ పీఠాన్ని అధిరోహించారు. అయితే పదవిలో ఉన్నా ఏ ఒక్క పనీ చేయనీయకుండా వైస్‌చైర్మన్‌ వర్గీయులు రాజకీయం నడిపి ఇబ్బందులకు గురిచేశారు. పదవి దిగేందుకు ఆరు నెలలు అవకాశం ఉన్నా... అందరి నాయకుల వద్దకు తిరిగి చైర్‌పర్సన్‌ వర్గీయులపై నానా ఆరోపణలు చేసి వేధించారు. దీంతో నిత్యం ఆలోచనలతో మానసిక ఒత్తిడికి గురై చైర్‌పర్సన్‌ భర్త మృతిచెందారు. అప్పటి వరకు ఒప్పందం పేరుతో కథ  నడిపిన నాయకులు ఆ తర్వాత పరామర్శల పేరుతో తెర లేపారు. అండగా ఉంటామన్నారు. ఒంటరిగా మిగిలిన శ్రీదేవిని పార్టీ ఒప్పందం పేరుతో రాజీనామా చేయలంటూ ఒత్తిడి చేస్తూనే ఉన్నారు.

తమ పంతం కోసం మంతనాలు కొనసాగించారు. మీడియాకు తెలిస్తే ఇబ్బందని రాత్రికిరాత్రి చర్చలు జరిపి అనుకున్నది సాధించారు. ఈ పదవి నాకొద్దు అంటూ కన్నీటితో నమస్కారం పెట్టి గోపవరపు శ్రీదేవి రాజీనామా చేశారు. సర్వస్వం కోల్పోయి దిక్కు తోచని స్థితిలో తనకు ఎవరూ అండగా ఉండే అవకాశం లేదని, భర్త మానసికంగా ఒత్తిడికి గురై మృతిచెందిన విధంగానే తనకు కూడా ఏదైనా జరిగితే కుమారుడు దిక్కులేని వాడవుతాడనే ఆలోచనతో కూడా శ్రీదేవి తప్పుకున్నట్టు చెబుతున్నారు. శ్రీదేవిని పదవినుంచి తప్పించడంలో ఓ సామాజిక వర్గం రాజకీయం నడిపినట్టు స్థానికంగా చర్చించుకుంటున్నారు.  

బాధలో ఉన్న చైర్‌పర్సన్‌ కుటుంబాన్ని ఓదార్పు పేరుతో సందర్శించిన నాయకులు ఒప్పందాన్ని కూడా అమలు చేయాలంటూ ఒత్తిడి తెచ్చి రాత్రికిరాత్రి  విషయాన్ని సెటిల్‌ చేసినట్లు చర్చనడుస్తోంది.  చైర్మన్‌ వర్గానికి అనుకూలంగా ఉన్నట్లు మాట్లాడుతూనే రాజకీయంగా చక్రం నడిపినట్లు చెబుతున్నారు.  శ్రీదేవి రాజీనామా చేసిన కొద్ది గంటలలోనే మున్సిపల్‌ వైస్‌చైర్మెన్ మంగమ్మ సమావేశానికి అధ్యక్షత వహించి పలువురు నాయకుల అభినందనలు అందుకున్నారు. మొత్తంగా మాచర్ల తెలుగుదేశం పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి ఒక మహిళ నుంచి మరో మహిళకు దక్కిన తీరు చూసి ఔరా రాజకీయం అంటూ ప్రజానీకం ముక్కున వేలేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement