మంటల్లో కాలిపోతున్న రెండుఅంతస్థుల వ్యాపారభవనసముదాయం.
మాడ్గులలో భారీ అగ్నిప్రమాదం
Published Sun, Aug 7 2016 12:48 AM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
– రెండంతస్తుల భవనం దగ్ధం
– రూ.50లక్షల ఆస్తి బుగ్గిపాలు
మాడ్గుల : ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ రెండంతస్తుల భవనం దగ్ధమైంది. ఈ సంఘటనతో సుమారు రూ.50 లక్షల విలువచేసే ఆస్తికి నష్టం వాటిల్లినట్టు బాధితుడు వాపోయారు. వివరాలిలా ఉన్నాయి. మాడ్గులకు చెందిన పోలిశెట్టి శ్రీనుకు స్థానిక పంచాయతీ కార్యాలయ సమీపంలో రెండు అంతస్తుల భవనముంది. కింద కిరాణం, జనరల్‌స్టోర్ నడిపిస్తూ పై అంతస్తులో భార్యాపిల్లలతో నివాసముంటున్నారు. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి 11గంటలకు దుకాణం మూసివేసి అందరూ నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు రెండు గంటలకు షాపులో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. శబ్దానికి మేల్కొన్న యజమాని తలుపు తెరవగా మంటలు తగిలి స్వల్పంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసి పక్కింట్లోకి చేరుకుని ప్రాణాలు దక్కించుకున్నారు. వారి కేకలు విన్న చుట్టుపక్కలవారు వచ్చి మంటలు ఆర్పేందుకు విఫలయత్నం చేశారు. వెంటనే నల్లగొండ జిల్లా దేవరకొండ ఫైర్‌స్టేషన్‌కు సమాచారమిచ్చారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎంపీటీసీ సభ్యుడు దేవయ్యగౌడ్ తలుపులు విరగ్గొట్టి వంట గదిలో ఉన్న సిలిండర్లను బయటకు పడవేశారు. ఒకవేళ అవి పేలి ఉంటే పెద్దప్రమాదం సంభవించి ఉండేదన్నారు. ఈ సంఘటనలో రూ.5.5లక్షలతోపాటు 35తులాల బంగారం, 1,800గ్రాముల వెండి, రూ.రెండు లక్షల విలువజేసే కిరాణం, వంటసామగ్రి, పెట్రోల్, డీజిల్ డబ్బాలు, దుస్తులు, బియ్యం కాలిపోయాయి. శనివారం ఉదయం సంఘటన స్థలాన్ని సర్పంచ్ సునీతాకొండల్‌రెడ్డి, తహసీల్దార్ శంకర్, ఎంపీడీఓ ఫారూఖ్‌హుస్సేన్, ఆర్‌ఐ మురళి, కార్యదర్శి జంగయ్య పరిశీలించి పంచనామా నిర్వహించారు. కాగా, షార్ట్‌సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేక ఎవరైనా నిప్పంటించారా? శ్రావణ శుక్రవారం సందర్భంగా దీపం వెలిగిస్తే పడిపోయిందా? అనేది తెలియరాలేదు.
Advertisement