madgula
-
సీఐ చాంబర్లో కాలుతో తన్ని.. బూతులు తిట్టిన బీజేపీ నేత’
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన ఓ హత్య కేసులో గిరిజనుడిని మాడ్గుల సీఐ పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తుండగా.. అక్కడే ఉన్న బీజేపీ నాయకుడు ఆ గిరిజనుడిని కాలుతో తన్నిన దృశ్యాలు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాడ్గుల మండలం ఇరి్వన్ పంచాయతీ పరిధిలోని గాంగ్యానగర్‌తండాకు చెందిన వడ్త్యావత్ శంకర్(28) ఏప్రిల్ 19న హత్యకు గురయ్యాడు. ఈ సంఘటనపై మాడ్గుల సీఐ ఉపేందర్‌రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా సీఐ చౌటకుంట తండాకు చెందిన ప్రత్యక్ష సాక్షిగా భావించిన మేరావత్ పాండు అనే వ్యక్తిని ఇటీవల పోలీస్ స్టేషన్‌కు పిలిపించి తన ఛాంబర్లో మాజీ ప్రజాప్రతినిధి, మరో బీజేపీ నాయకుడి ముందు విచారణ చేపట్టారు. విచారణ సమయంలో కుర్చీలో కూర్చున్న బీజేపీ నాయకుడు.. విచారణ ఎదుర్కొంటున్న పాండును వెనక నుంచి కాలుతో తన్నుతూ అసభ్యకరంగా దూషించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ దృశ్యాలను చూసిన గిరిజన సంఘాల నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. కాగా మాడ్గుల పోలీస్ స్టేషన్లో మేరావత్ పాండును కాలితో తన్ని బూతులు తిట్టిన బీజేపీ నాయకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ సంఘం నాయకుడు నేనావత్ హన్మానాయక్‌రాథోడ్ శుక్రవారం డిమాండ్ చేశారు. నేను గమనించలేదు: సీఐ పాండును బీజేపీ నాయకుడు తన చాంబర్లో తన్నినట్లు తాను గమనించలేదని సీఐ ఉపేందర్‌రావు చెప్పారు. దీనిపై పాండు ఫిర్యాదు చేస్తే సదరు నాయకుడిపై చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: దేవరయాంజల్: పేపర్ వార్తల ఆధారంగా జీవోలు ఇస్తారా? -
‘సాహస బాలుడు’ అవార్డు గ్రహీత మృతి
సాక్షి, మాడ్గుల: సాహస బాలుడు అవార్డు గ్రహీత, మండల కేంద్రానికి చెందిన సయ్యద్ రసూల్ అలియాస్ చోటే (37) శనివారం గుండెపోటుతో మృతిచెందాడు. స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్న ఆయన శనివారం ఉదయం ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబీకులు చికిత్స చేయించారు. ఇంటికి తీసుకొచ్చి మంచంపై కూర్చునే క్రమంలో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబీకులు వెంటనే ఆమనగల్లుకు తరలిస్తుండగా మార్గంమధ్యలో రసూల్ మృతిచెందాడు. మృతుడికి భార్య రేష్మ, ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. 1999లో అవార్డు.. సయ్యద్ రసూల్ కొన్నేళ్ల క్రితం ‘సాహస బాలుడు’ అవార్డును అందుకున్నాడు. మాడ్గుల పంచాయతీ కార్యాలయం ఎదుట 1999 మే నెలలో వరిగడ్డి లోడుతో వెళ్తున్న లారీకి మంటలు అంటుకొని కాలిపోతుండగా డ్రైవర్ లారీని వదిలేసి పారిపోయాడు. అప్పడు 17 ఏళ్ల వయసులో ఉన్న సయ్యద్ రసూల్ లారీ ఎక్కి దానిని గ్రామ శివారులోకి తీసుకెళ్లగా స్థానికులు మంటలు ఆర్పేశారు. రసూల్ చేసిన సాహసాన్ని అప్పట్లో పలువురు ప్రముఖులు అభినందించారు. ఆయనను సాహసబాలుడి అవార్డుకు ఎంపిక చేసి ఆగస్టు 15న ప్రదానం చేశారు. అందరితో కలివిడిగా ఉండే రసూల్ మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. -
భర్తతో గొడవపడి..
మాడ్గుల: ఆరునెలల క్రితం భార్యాభర్తల మధ్య రాజుకున్న గొడవల ఫలితంగా గురువారం ఓ తల్లి తన ముగ్గురు కుమారులకు దూరంగా కానరానిలోకాలకు వెళ్లింది. అభంశుభం తెలియని ఆ చిన్నారులు బిక్కుబిక్కుమని ఏడుస్తుండడం చూసిన వారందరికీ కంట నీరు తెప్పించింది. మాడ్గుల మండల కేంద్రానికి చెందిన కొత్తపల్లి జయమ్మ(30)గురువారం తమ వ్యవసాయ పొలంలోని పశువుల పాకలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. మృతురాలు జయమ్మ, శివకృష్ణలు భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమారులు కిరణ్, తరుణ్, చరణ్‌లు ఉన్నారు. ఈ దంపతుల మధ్య 6 నెలలక్రితం మనస్పర్ధలొచ్చి గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో జయమ్మ కడ్తాల్ మండలం చరికొండలోని పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉండిపోయింది. భర్త శివకృష్ణ ఆమెను తీసుకెళ్లడానికి రాకపోవడంతో జయమ్మ తల్లిదండ్రులు కడ్తాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో శివకృష్ణపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండుకు తరలించారు. కల్వకుర్తి కోర్టులో కేసు నడుస్తుండగా ఇటీవల మృతురాలి భర్త శివకృష్ణ చరికొండకు వెళ్లి అత్తగారింట్లో కొన్ని రోజులు ఉండి తన భార్య జయమ్మను తీసుకెళ్తానని భార్యతో గొడవపడకుండా ఉంటానని పెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకుని 15 రోజుల క్రితం మాడ్గులకు తీసుకొచ్చాడు. ఇదిలా ఉండగా గురువారం తమ చేలో పత్తి తీస్తుండగా ఆ దంపతుల మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన జయమ్మ పక్కనే ఉన్న పశువుల పాకలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కాగా మృతురాలి అత్తమామలు బంధువుల ఇంట్లో జరిగే దశదిన కర్మకు వెళ్లారు. పోలీస్‌స్టేషన్ ముందు మృతురాలి బంధువుల ఆందోళన ఉరేసుకుని మృతిచెందిన కొత్తపల్లి జయమ్మ తల్లిదండ్రులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకోకముందే శవాన్ని మార్చురీకి తరలించడాన్ని నిరసిస్తూ మృతురాలి బంధువులు పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. కడ్తాల మండలం చరికొండ గ్రామానికి చెందిన సుమారు 200 మంది డీసీఎం, ప్రైవేట్ వాహనాలలో మాడ్గుల పోలీస్‌స్టేషనుకు చేరుకుని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు నాయకులు నచ్చజెప్పడంతో వారు శాంతించారు. మృతురాలు జయమ్మ తల్లి జెల్ల వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ జెలేందర్‌రెడ్డి తెలిపారు. భర్త, అత్తమామలే చంపి ఉరేశారు: జయమ్మ తల్లి తన కుమార్తెను భర్త శివకృష్ణ, అత్తమామలు లక్ష్మమ్మ, రాములయ్యలు కొట్టి చంపి ప శువుల కొట్టంలో ఉరి పోసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లి జెల్ల వెంకటమ్మ ఆరోపించారు. తమ కూతురు జయమ్మ మరణించిన విçషయం తమ కు చెప్పలేదని, తాము సంఘటన స్థలానికి రాకముందే శవాన్ని పోలీసులు పోస్టుమర్టానికి తరలించడాన్ని ఆమె తప్పుబడుతూ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మాడ్గులలో భారీ అగ్నిప్రమాదం
– రెండంతస్తుల భవనం దగ్ధం – రూ.50లక్షల ఆస్తి బుగ్గిపాలు మాడ్గుల : ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ రెండంతస్తుల భవనం దగ్ధమైంది. ఈ సంఘటనతో సుమారు రూ.50 లక్షల విలువచేసే ఆస్తికి నష్టం వాటిల్లినట్టు బాధితుడు వాపోయారు. వివరాలిలా ఉన్నాయి. మాడ్గులకు చెందిన పోలిశెట్టి శ్రీనుకు స్థానిక పంచాయతీ కార్యాలయ సమీపంలో రెండు అంతస్తుల భవనముంది. కింద కిరాణం, జనరల్‌స్టోర్ నడిపిస్తూ పై అంతస్తులో భార్యాపిల్లలతో నివాసముంటున్నారు. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి 11గంటలకు దుకాణం మూసివేసి అందరూ నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు రెండు గంటలకు షాపులో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. శబ్దానికి మేల్కొన్న యజమాని తలుపు తెరవగా మంటలు తగిలి స్వల్పంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసి పక్కింట్లోకి చేరుకుని ప్రాణాలు దక్కించుకున్నారు. వారి కేకలు విన్న చుట్టుపక్కలవారు వచ్చి మంటలు ఆర్పేందుకు విఫలయత్నం చేశారు. వెంటనే నల్లగొండ జిల్లా దేవరకొండ ఫైర్‌స్టేషన్‌కు సమాచారమిచ్చారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎంపీటీసీ సభ్యుడు దేవయ్యగౌడ్ తలుపులు విరగ్గొట్టి వంట గదిలో ఉన్న సిలిండర్లను బయటకు పడవేశారు. ఒకవేళ అవి పేలి ఉంటే పెద్దప్రమాదం సంభవించి ఉండేదన్నారు. ఈ సంఘటనలో రూ.5.5లక్షలతోపాటు 35తులాల బంగారం, 1,800గ్రాముల వెండి, రూ.రెండు లక్షల విలువజేసే కిరాణం, వంటసామగ్రి, పెట్రోల్, డీజిల్ డబ్బాలు, దుస్తులు, బియ్యం కాలిపోయాయి. శనివారం ఉదయం సంఘటన స్థలాన్ని సర్పంచ్ సునీతాకొండల్రెడ్డి, తహసీల్దార్ శంకర్, ఎంపీడీఓ ఫారూఖ్‌హుస్సేన్, ఆర్ఐ మురళి, కార్యదర్శి జంగయ్య పరిశీలించి పంచనామా నిర్వహించారు. కాగా, షార్ట్‌సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేక ఎవరైనా నిప్పంటించారా? శ్రావణ శుక్రవారం సందర్భంగా దీపం వెలిగిస్తే పడిపోయిందా? అనేది తెలియరాలేదు.