సాక్షి, మాడ్గుల: సాహస బాలుడు అవార్డు గ్రహీత, మండల కేంద్రానికి చెందిన సయ్యద్ రసూల్ అలియాస్ చోటే (37) శనివారం గుండెపోటుతో మృతిచెందాడు. స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్న ఆయన శనివారం ఉదయం ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబీకులు చికిత్స చేయించారు. ఇంటికి తీసుకొచ్చి మంచంపై కూర్చునే క్రమంలో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబీకులు వెంటనే ఆమనగల్లుకు తరలిస్తుండగా మార్గంమధ్యలో రసూల్ మృతిచెందాడు. మృతుడికి భార్య రేష్మ, ఓ కూతురు, కుమారుడు ఉన్నారు.
1999లో అవార్డు..
సయ్యద్ రసూల్ కొన్నేళ్ల క్రితం ‘సాహస బాలుడు’ అవార్డును అందుకున్నాడు. మాడ్గుల పంచాయతీ కార్యాలయం ఎదుట 1999 మే నెలలో వరిగడ్డి లోడుతో వెళ్తున్న లారీకి మంటలు అంటుకొని కాలిపోతుండగా డ్రైవర్ లారీని వదిలేసి పారిపోయాడు. అప్పడు 17 ఏళ్ల వయసులో ఉన్న సయ్యద్ రసూల్ లారీ ఎక్కి దానిని గ్రామ శివారులోకి తీసుకెళ్లగా స్థానికులు మంటలు ఆర్పేశారు. రసూల్ చేసిన సాహసాన్ని అప్పట్లో పలువురు ప్రముఖులు అభినందించారు. ఆయనను సాహసబాలుడి అవార్డుకు ఎంపిక చేసి ఆగస్టు 15న ప్రదానం చేశారు. అందరితో కలివిడిగా ఉండే రసూల్ మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment