Adventure Award
-
ఏపీ పోలీస్ తులసి చైతన్యకు ప్రతిష్టాత్మక అవార్డు!
ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి చెందిన మోతుకూరి తులసి చైతన్య ఇవాళ(మంగళవారం జనవరి 9న) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక టెంజింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్ అందుకోనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్లో ఈ అవార్డు ప్రదానం జరగనుంది. తులసి చైతన్య ఏపీ పోలీస్ విభాగంలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. వాటర్ అడ్వెంచర్ విభాగంలో 2022 సంవత్సరానికి ‘టెంజిగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు’కు ఆయన ఎంపికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి పోలీస్ ఈ నెల 5న కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ ఈ విషయాన్ని ప్రకటిస్తూ చైతన్యకు లేఖ రాసింది. అవార్డులో భాగంగా పతకంతో పాటు రూ. 15 లక్షల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం చైతన్యకు అందజేస్తుంది. ఈత పోటీల్లో అనేక అవార్డులు, పురస్కారాలు అందుకున్న తులసి చైతన్య, తనలా మరికొందరికి స్విమ్మింగ్‌లో శిక్షణ కూడా ఇస్తున్నారు. ఓపెన్ వాటర్ స్విమ్మింగ్‌లో ట్రిపుల్ క్రౌన్ సాధించిన మొదటి భారతీయ పోలీసు అధికారిగానూ ఆయన రికార్డు సృష్టించారు. 2022 జులై 26న ఇంగ్లాడ్ – ఫ్రాన్స్ దేశాల మధ్య ఇంగ్లిష్ ఛానెల్ (33.5 కి.మీ)ను 15 గంటల 18 నిమిషాల 45 సెకన్లలో ఈదుకుంటూ చేరుకున్నారు. జిబ్రాల్టర్ జలసంధి, కేటలినా ఛానల్, పాక్ జలసంధి సహా అనేక సాహసోపేతమైన ఈత పోటీల్లో ఆయన పాల్గొని విజయం సాధించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 2022 సంవత్సరానికి గాను ‘టెంజిగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు’కు ఎంపిక చేసింది. తులసి చైతన్యలో ఉన్న ప్రతిభను గుర్తించిన సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది ప్రోత్సహించి వెన్నుదన్నుగా నిలిచారు. (చదవండి: డబ్బుతో సంతోషాన్ని కొనగలమా? సర్వేలో తేలిందిదే!) -
‘సాహస బాలుడు’ అవార్డు గ్రహీత మృతి
సాక్షి, మాడ్గుల: సాహస బాలుడు అవార్డు గ్రహీత, మండల కేంద్రానికి చెందిన సయ్యద్ రసూల్ అలియాస్ చోటే (37) శనివారం గుండెపోటుతో మృతిచెందాడు. స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్న ఆయన శనివారం ఉదయం ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబీకులు చికిత్స చేయించారు. ఇంటికి తీసుకొచ్చి మంచంపై కూర్చునే క్రమంలో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబీకులు వెంటనే ఆమనగల్లుకు తరలిస్తుండగా మార్గంమధ్యలో రసూల్ మృతిచెందాడు. మృతుడికి భార్య రేష్మ, ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. 1999లో అవార్డు.. సయ్యద్ రసూల్ కొన్నేళ్ల క్రితం ‘సాహస బాలుడు’ అవార్డును అందుకున్నాడు. మాడ్గుల పంచాయతీ కార్యాలయం ఎదుట 1999 మే నెలలో వరిగడ్డి లోడుతో వెళ్తున్న లారీకి మంటలు అంటుకొని కాలిపోతుండగా డ్రైవర్ లారీని వదిలేసి పారిపోయాడు. అప్పడు 17 ఏళ్ల వయసులో ఉన్న సయ్యద్ రసూల్ లారీ ఎక్కి దానిని గ్రామ శివారులోకి తీసుకెళ్లగా స్థానికులు మంటలు ఆర్పేశారు. రసూల్ చేసిన సాహసాన్ని అప్పట్లో పలువురు ప్రముఖులు అభినందించారు. ఆయనను సాహసబాలుడి అవార్డుకు ఎంపిక చేసి ఆగస్టు 15న ప్రదానం చేశారు. అందరితో కలివిడిగా ఉండే రసూల్ మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. -
అమెరికాలో 11 ఏళ్ల ‘తెలుగు’ సాహస బాలుడు
కర్నూలు(హాస్పిటల్): అమెరికాలోని ఈగన్ ప్రాంతంలో స్విమ్మింగ్‌పూల్‌లో మునిగిపోతున్న 34 ఏళ్ల వ్యక్తిని కాపాడిన 11 ఏళ్ల బాలుడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతని సాహసానికి మెచ్చిన అమెరికా పోలీసులు ‘లైఫ్ సేవింగ్ అవార్డు’ కోసం అక్కడి ప్రభుత్వానికి సిఫారసు చేశారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన రఘు ఎన్. నటరాజ్, లలిత దంపతులు మూడేళ్ల క్రితం వారు ఉద్యోగరీత్యా అమెరికాలోని ఈగన్‌కు వెళ్లి..అక్కడున్న ఆక్వా టాట్స్ ప్రాంతంలోని టౌన్ సెంటర్ అపార్ట్మెంట్ హోమ్స్‌లో నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న బంధువులను చూసేందుకు డిసెంబర్లో శ్రీనివాస ఆర్.ఎల్లావర్తి(34) అనే వ్యక్తి వచ్చాడు. అక్కడే ఉన్న ఇండోర్ స్విమ్మింగ్‌పూల్‌లో గత డిసెంబర్ 31న దూకాడు. ఈత రాక అతను మునిగిపోతుండటాన్ని చూసిన రఘు నటరాజ్ కుమారుడు అద్వైక్ ఎన్. విశ్వామిత్ర(11) స్విమ్మింగ్‌పూల్‌లోకి దూకి 8 అడుగుల లోతులో మునిగిపోయి ఉన్న శ్రీనివాస ఆర్.ఎల్లావర్తిని బయటకు తీసుకొచ్చాడు. -
నగర యువతికి సాహస అవార్డు
న్యూఢిల్లీ: తనను వేధించడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తికి దేహశుద్ధి చేయడమే కాకుండా అతడిని పోలీసులకు పట్టించిన 19 ఏళ్ల యువతికి నగర పోలీస్ కమిషనర్ సోమవారం బహుమతినందచేసి సత్కరించారు. ఢిల్లీ పోలీసు ప్రధానకార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో కమిషనర్ బీఎస్ బస్సీ బీఏ మొదటి సంవత్సరం విద్యార్థిని అయిన ఆ సాహస వనితకు ప్రశంసా పత్రం, రూ.10వేల నగదును అందచేశారు. అనంతరం బస్సీ విలేకరులతో మాట్లాడుతూ, ఆమె ఇతర యువతులకు ఒక మార్గాన్ని చూపిందని అన్నారు. యువతులు ఆత్మరక్షణ విద్యలో శిక్షణ పొందాలని తాను ఎప్పుడూ సూచిస్తుంటానని, అప్పుడే వారు తమను తాము రక్షించుకోగలరని ఆయన అన్నారు. ఈ యువతి సాహసం ఇతరులకు స్ఫూర్తినివ్వగలదని బస్సీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ యువతి తైక్వాన్డో, వుషూ విద్యలో బ్లాక్, రెడ్ బెల్ట్‌లు సాధించిందని చెప్పారు. శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ఈ యువతి వుషూ శిక్షణకు హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా, రాజేశ్ గుప్తా (28) అనే యువకుడు ఆమెనుద్దేశించి అభ్యంతరకరంగా మాట్లాడాడు. అంతేకాకుండా ఆమె గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించాడు. దీంతో ఆమె అతనిపై తిరగబడి, తన కరాటే విద్యనుపయోగించి అతనిపై పైచేయి సాధించింది. ఆ తరువాత తన శిక్షకుని సాయంతో పోలీసులకు అప్పగించిందని డిప్యూటీ పోలీస్ కమిషనర్ మధుర్ వర్మ చెప్పారు.