న్యూఢిల్లీ: తనను వేధించడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తికి దేహశుద్ధి చేయడమే కాకుండా అతడిని పోలీసులకు పట్టించిన 19 ఏళ్ల యువతికి నగర పోలీస్ కమిషనర్ సోమవారం బహుమతినందచేసి సత్కరించారు. ఢిల్లీ పోలీసు ప్రధానకార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో కమిషనర్ బీఎస్ బస్సీ బీఏ మొదటి సంవత్సరం విద్యార్థిని అయిన ఆ సాహస వనితకు ప్రశంసా పత్రం, రూ.10వేల నగదును అందచేశారు. అనంతరం బస్సీ విలేకరులతో మాట్లాడుతూ, ఆమె ఇతర యువతులకు ఒక మార్గాన్ని చూపిందని అన్నారు. యువతులు ఆత్మరక్షణ విద్యలో శిక్షణ పొందాలని తాను ఎప్పుడూ సూచిస్తుంటానని, అప్పుడే వారు తమను తాము రక్షించుకోగలరని ఆయన అన్నారు.
ఈ యువతి సాహసం ఇతరులకు స్ఫూర్తినివ్వగలదని బస్సీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ యువతి తైక్వాన్‌డో, వుషూ విద్యలో బ్లాక్, రెడ్ బెల్ట్‌లు సాధించిందని చెప్పారు. శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ఈ యువతి వుషూ శిక్షణకు హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా, రాజేశ్ గుప్తా (28) అనే యువకుడు ఆమెనుద్దేశించి అభ్యంతరకరంగా మాట్లాడాడు. అంతేకాకుండా ఆమె గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించాడు. దీంతో ఆమె అతనిపై తిరగబడి, తన కరాటే విద్యనుపయోగించి అతనిపై పైచేయి సాధించింది. ఆ తరువాత తన శిక్షకుని సాయంతో పోలీసులకు అప్పగించిందని డిప్యూటీ పోలీస్ కమిషనర్ మధుర్ వర్మ చెప్పారు.
నగర యువతికి సాహస అవార్డు
Published Mon, Nov 3 2014 11:23 PM | Last Updated on Tue, Aug 21 2018 7:58 PM
Advertisement
Advertisement