నగరంలో మహిళల పట్ల నేరాల సంఖ్యను జీరోస్థాయికి తగ్గించేందుకు తమ శాఖ కృషి చేస్తోందని, ఇందుకు ప్రజల సహకరించాలని
న్యూఢిల్లీ: నగరంలో మహిళల పట్ల నేరాల సంఖ్యను జీరోస్థాయికి తగ్గించేందుకు తమ శాఖ కృషి చేస్తోందని, ఇందుకు ప్రజల సహకరించాలని నగర పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ అన్నారు. డిసెంబర్ 16 గ్యాంగ్‌రేప్ ఘటన జరిగి రెండేళ్లు పూర్తి అయ్యిన సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడారు. నగరంలో ఎప్పుడైతే మహిళల పట్ల నేరాల సంఖ్య జీరోస్థాయికి తగ్గుతోందో అప్పుడే తనకు సంతృప్తి కలుగుతోందని అన్నారు. డిసెంబర్ ఘటన తర్వాత మహిళల్లో చైతన్యం పెరిగిందని, తమపై జరిగిన అన్యాయాలపై పోలీసులకు ఫిర్యాదులు చేయడానికి వెనుకాడడం లేదన్నారు. అలాంటి వారికి చట్టపరమైన సహాయం కూడా తోడైందని అన్నారు. 2012లో 680 కేసుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా, 2013లో 1,559, నవంబర్, 2014 వరకూ 1,925 కేసుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యాయని చెప్పారు.
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులు 2012లో 615, 2013లో 3,347, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 3,392 కేసుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. పోలీసులు ప్రజలతో కలిసిమెలసి ఉండడంతోపాటు ప్రజల్లో కూడా మరింత చైతన్యం పెరగాలని అన్నారు. నగరంలో మహిళలు ధైరంగా తిరగడం కోసం ఆత్మరక్షణలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 1,000 పెప్పర్ స్ప్రేలను నగరంలోని మహిళలకు పంపిణీ చేశామని చెప్పారు. మహిళల పట్ల నేరాల సంఖ్యను తగ్గించడం కోసం పోలీసులు అన్నిరకాల చర్యలు తీసుకొంటున్నారని చెప్పారు. కేసు దర్యాప్తులు కూడా నిష్పక్షపాతంగా త్వరతగతిన పూర్తి చేస్తున్నారని చెప్పారు.