December 16 gang-rape
-
నా కూతురు పేరు జ్యోతిసింగ్
ఢిల్లీ గ్యాంగ్‌రేప్ ‘నిర్భయ’ తల్లి వెల్లడి న్యూఢిల్లీ: దేశప్రజల మదిలో ‘నిర్భయ’గా నిలిచిపోయిన తన కూతురు పేరు జ్యోతిసింగ్ అని మూడేళ్లక్రితం ఢిల్లీలో గ్యాంగ్‌రేప్‌కు గురై ప్రాణాలుకోల్పోయిన యువతి తల్లి వెల్లడించింది. ఢిల్లీలో ‘నిర్భయ’ ఘటన జరిగి మూడేళ్లు గడిచిన సందర్భంగా బుధవారం ఢిల్లీలో మహిళా, పౌరసంఘాలు జంతర్‌మంత్ వద్ద నిర్వహించిన ‘నిర్భయ చేతన దివస్’ నివాళి కార్యక్రమంలో యువతి తల్లి ఆశాదేవి మాట్లాడారు. ‘నా కూతురు పేరు జ్యోతిసింగ్. నా కూతురు పేరు చెప్పడానికి నేనేం సిగ్గుపడట్లేదు. రేప్‌లాంటి అమానుషమైన నేరాలకు పాల్పడే వారిని బహిరంగంగా ఉరితీయాలి.’ అన్నారు. మహిళాసమస్యలపై పార్టీలకతీతంగా ఎంపీలు ఏకం: మహిళాసమస్యలపై యువతలో అవగాహన కల్పించేందుకు పార్టీలకతీతంగా 20 మంది ఎంపీలు ఏకమయ్యారు. లోక్‌సభ, రాజ్యసభలకు చెందిన ఎంపీలు సుప్రియా సూలె(ఎన్సీపీ), గౌరవ్ గొగోయ్(కాంగ్రెస్), ప్రీతమ్ ముండే, శతాబ్ది రాయ్(టీఎంసీ)సహా 20 మంది ఎంపీలు ఒక్కతాటిపైకి వచ్చి లింగ సమానత, మహిళావిద్య, మహిళాసాధికారత వంటి అంశాలపై తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. కాగా, డబ్బు లేని కారణంగా నిర్బంధంలో ఉన్న వారికి బెయిల్ మంజూరులో జాప్యం జరగడంపై పార్లమెంటరీ కమిటీ సభ్యుల బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని కేసు వాదనకు మంచి లాయర్లను వినియోగించాలని సూచించింది. -
విద్యాప్రమాణాలు మెరుగుపర్చాలి: ఎల్జీ
సాక్షి, న్యూఢిల్లీ: విద్యా ప్రమాణాల మెరుగు కోసం అధ్యాపకులు కృషి చేయాలని లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పిలుపు ఇచ్చారు. ఉన్నత విద్యా విభాగం, ఎన్సీటీలు సంయుక్తంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఢిల్లీ యూనివర్సి టీ పరిధిలోని కళాశాలల్లో పనిచేస్తున్న 10మంది ప్రతిభావంతులైన అధ్యాపకులను ఎల్జీ సన్మానించారు. అధ్యాపకులు విద్యార్థులకు ఆదర్శంగా ఉంటూ వారి జీవితాలను ప్రభావితం చేయాలని చెప్పారు. అంకితభావం కలిగిన అధ్యాపకుల సేవల అవసరం దేశానికి ఉందని ఆయన చెప్పారు. ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్ సెక్రటరీ అనిందో మజుమ్దార్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలోప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీఎం స్పోలియా, జీజీఎస్ఐపీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కే.త్యాగి, ఉన్నత విద్యామండలి డెరైక్టర్ అచల్సింగ్, వివిధ కాలేజీలకు చెందిన అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. మహిళలకు సంపూర్ణ రక్షణ నగరంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అన్నారు. డిసెంబర్ 16 గ్యాంగ్‌రేప్ ఘటన జరిగి రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఎల్జీ మంగళవారం మీడియాతో మాట్లాడారు. మహిళలపై నేరాల సంఖ్య తగ్గించడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. ఇందుకోసం ప్రజలను చైతన్యం చేయడం కోసం అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. మహిళపై ఆరోజు జరిగిన ఘటన దురదుష్టకరమని, ఇంకా దురాఘాతాలు కొనసాగడం దేశానికే తలవంపులని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పక డ్బందీ చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. ప్రతీ పోలీస్ స్టేషన్లో ‘మహిళా సెల్’ ఏర్పాటు చేయిస్తున్నామని, మహిళల రక్షణ కోసం నగరంలో పలుచోట్ల సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. -
నేరాల సంఖ్య తగ్గించడమే ధ్యేయం
న్యూఢిల్లీ: నగరంలో మహిళల పట్ల నేరాల సంఖ్యను జీరోస్థాయికి తగ్గించేందుకు తమ శాఖ కృషి చేస్తోందని, ఇందుకు ప్రజల సహకరించాలని నగర పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ అన్నారు. డిసెంబర్ 16 గ్యాంగ్‌రేప్ ఘటన జరిగి రెండేళ్లు పూర్తి అయ్యిన సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడారు. నగరంలో ఎప్పుడైతే మహిళల పట్ల నేరాల సంఖ్య జీరోస్థాయికి తగ్గుతోందో అప్పుడే తనకు సంతృప్తి కలుగుతోందని అన్నారు. డిసెంబర్ ఘటన తర్వాత మహిళల్లో చైతన్యం పెరిగిందని, తమపై జరిగిన అన్యాయాలపై పోలీసులకు ఫిర్యాదులు చేయడానికి వెనుకాడడం లేదన్నారు. అలాంటి వారికి చట్టపరమైన సహాయం కూడా తోడైందని అన్నారు. 2012లో 680 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు కాగా, 2013లో 1,559, నవంబర్, 2014 వరకూ 1,925 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యాయని చెప్పారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులు 2012లో 615, 2013లో 3,347, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 3,392 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. పోలీసులు ప్రజలతో కలిసిమెలసి ఉండడంతోపాటు ప్రజల్లో కూడా మరింత చైతన్యం పెరగాలని అన్నారు. నగరంలో మహిళలు ధైరంగా తిరగడం కోసం ఆత్మరక్షణలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 1,000 పెప్పర్ స్ప్రేలను నగరంలోని మహిళలకు పంపిణీ చేశామని చెప్పారు. మహిళల పట్ల నేరాల సంఖ్యను తగ్గించడం కోసం పోలీసులు అన్నిరకాల చర్యలు తీసుకొంటున్నారని చెప్పారు. కేసు దర్యాప్తులు కూడా నిష్పక్షపాతంగా త్వరతగతిన పూర్తి చేస్తున్నారని చెప్పారు.