ఆరు రోజుల పాటు గరిటే సాంబర్ అన్నమే..!
Published Fri, Jun 3 2016 10:47 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM
మహబూబ్‌నగర్: రోజుకు ఒక గరిటె సాంబరు.. రెండు ముద్దల అన్నం.. ఎముకలు కొరికే చలి. అర్ధాకలి, నిద్రలేని రాత్రులు.. ఇదీ మానస సరోవరం యాత్రలో పాలమూరు జిల్లా యాత్రికులు అనుభవించిన నరకయాతన. శుక్రవారం ఉదయం మహబూబ్‌నగర్‌కు చేరుకున్న యాత్రికులు.. తాము పడిన బాధలను మీడియాకు వివరించారు. వారం రోజులు పడిన కష్టాలను గుర్తు తెచ్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు. వివరాలివీ.. జిల్లాకు చెందిన 13మంది యాత్రికులు గత నెల 16న రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లారు. అక్కడి నుంచి 17న ఉదయం ఖాట్మండ్‌కు ప్రత్యేక విమానంలో వెళ్లారు. అక్కడ ఎన్‌టీపీ ఏజెన్సీ ప్రతినిధులు అదేరోజు వారిని నేపాల్‌గంజ్‌కు తరలించాలి. అయితే 19న తీసుకెళ్లారు.
వాతావరణం బాగోలేదని రెండు రోజులపాటు నేపాల్‌గంజ్‌లోనే నిలిచిపోయారు. 21న సెమికాట్‌కు, అక్కడి నుంచి 22న తక్కల్‌కోట్‌కు చేరుకున్నారు. 23న రాత్రి మానస సరోవరానికి చేరుకుని, అక్కడి నుంచి కైల పర్వతానికి వెళ్లి శివయ్యను దర్శించుకున్నారు. అనంతరం తిరుగు ప్రయాణంలో హిల్సాకు వచ్చాక వాతావరణం అనుకూలించకపోవడంతో 24వ తేదీ నుంచి 31 వరకు అక్కడే చిక్కుకుపోయారు. వందమంది ఉండాల్సిన ప్రదేశంలో 400మంది యాత్రికులను ఉంచడంతో ఒక్కో గదిలో 20 మంది ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజులో ఒకపూట భోజనం పెట్టారు. ఆరోగ్యం బాగోలేని వారిని పట్టించుకోకపోవటంతో వారు మానసికంగా కుంగిపోయారు. చిన్న చిన్న గుడిసెల్లో.. అందులోనూ ఒక్కొక్క గదిలో 20 మందిని ఉంచారు.
పడుకోవడానికి స్థలం లేక రాత్రి మొత్తం కూర్చొని ఉన్నారు. కనీసం తినడానికి సరిపడా భోజనం కూడా లేదు. ఒక్కరికి ఒక గరిటే సాంబర్‌తో కూడిన అన్నం ఆరు రోజుల పాటు పెట్టారు. అక్కడ తమకు ప్రత్యక్ష నరకం చూపారని యాత్రికుడు శ్రీకాంత్ రెడ్డి, బాలరాజు తెలిపారు. ఆ సమయంలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి మృతి చెందడంతో తమకు మరింత ఆందోళన కలిగిందన్నారు. ఆరు రోజుల తర్వాత స్థానికంగా మీడియాలో వచ్చిన కథనాలతో పాటు నేపాల్‌లో వచ్చిన కథనాలకు అక్కడి అధికారులు స్పందించి తమకు భరోసా కల్పించారన్నారు. వాతావారణం అనుకూలించడంతో ప్రత్యేక విమానంలో లక్నోకు పంపించారు. అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నామని తెలిపారు.
Advertisement