
తిరుపతిలోని రుయా ఆస్పత్రి
– రుయా ఆసుపత్రిలో మూడు నెలలుగా ఇంజెక్షన్లు, మందులు నిల్!
– అత్యవసర వైద్యం కోసం వచ్చి అవస్థలు పడుతున్న రోగులు
– మందుల షాపుల్లో కొనలేక అల్లాడుతున్న పేద రోగులు
తిరుపతి సింగాల గుంటకు చెందిన వసంత్ నాగ్‌కు వారం రోజులుగా తీవ్రమైన జ్వరం. రుయా ఆసుపత్రికి వస్తే మలేరియా జ్వరమని వార్డులో అడ్మిట్ చేశారు. అయితే మలేరియా జ్వరం తగ్గేందుకు ఇచ్చే ఇంజెక్షన్ లేదంటూ నాలుగు రోజులుగా వైద్యం చేయలేదు.
తిరుపతి మెడికల్:
ఇదీ తిరుపతిలోని శ్రీవారి పాదాల చెంత ఉన్న రుయా ఆసుపత్రి దీన స్థితి. రాయలసీమలోని పేద ప్రజలకు వరప్రసాదినిగా సేవలు అందించే ఆసుపత్రిలో మూడు నెలలుగా ఇంజెక్షన్లు, మందులు లేకపోవడం రోగులకు శాపమైంది. 1200 పడకల రుయా ఆసుపత్రికి రోజూ 1500 నుంచి 2వేల వరకు వైద్యసేవలు నిమిత్తం వివిధ ప్రాంతాల ప్రజలు వస్తుంటారు. అయితే మందుల కొనుగోలులో చోటుచేసుకుంటున్న జాప్యం మూలాన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మందులేనాటికో..?
మలేరియా జ్వర పీడితులకు వేసే ‘ఆర్టిసినెట్’ ఇంజెక్షన్లు రుయాలో లేవు. బయట మందులు షాపుల్లో రూ.350లకు అమ్ముతున్నారు. వీటిని కొనలేని పేద రోగులు రుయాకు
వస్తున్నారు. వైద్యం అందక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీంతో పాటు సాధారణ జ్వరానికి వాడే పారాసిటమాల్ ఇంజెక్షన్, పాయిజన్ కేసులకు ఉపయోగించే ‘పామ్’ ఇంజెక్షన్, కాలేయ‡ జబ్బులకు వాడే ‘ఆక్‌ట్రియోటైడ్’ ఇంజెక్షన్, అనస్తీషియాకు సంబంధించిన ‘హైలోరానిడైస్’ ఇంజెక్షన్, గుండె జబ్బులకు వాడే ‘నార్ అడ్రినిలిన్’ ఇంజెక్షన్లు మూడు నెలలుగా లేవు. ఆఖరికి ఆపరేషన్ తరువాత ఇన్‌ఫెక్షన్ రాకుండా లైఫ్ సేవర్‌గా( 5 నుంచి 7 రోజుల డోస్) ఉపయోగించే ఇంజెక్షన్ ‘ఆగ్యుమెంటన్’ లేక రోగులు నరకయాతన పడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడే..! అవసరమైన ఇంజెక్షన్ల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నా ఫలితం శూన్యమని రోగులు వాపోతున్నారు.
ఖరారు కాని టెండర్లు
రుయాకు 509 రకాల మందులు, ఇంజెక్షన్లు అవసరం ఉంటోంది. ఇందులో 430 మందులు, ఇంజెక్షన్లను డాక్టర్ ఎన్‌టీఆర్ వైద్య సేవ, సాధారణ బడ్జెట్ ద్వారా కొనుగోలు చేసేందుకు ఈ ఏడాది జూలై 1న టెండర్లను ఆహ్వానించారు. వీటిని నెల వ్యవధిలో తెరచి ఖరారు చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకూ దాని జోలికే వెళ్లలేదు.
పరిశీలించి ఖరారు చేస్తాం
మందులు, ఇంజెక్షన్ల కొనుగోలుకు టెండర్లు ఆహ్వానించాం. టెండరు కమిటీతో చర్చించి వాటిని ఓపెన్ చేసి, అర్హులైన వారిని ఖరారు చేస్తాం.
–డాక్టర్ బీ.సిద్ధానాయక్, సూపరింటెండెంట్, రుయా ఆసుపత్రి