మనిషి కాటు..ఇక చాలు! | Man bite it's enough | Sakshi
Sakshi News home page

మనిషి కాటు..ఇక చాలు!

Published Mon, May 15 2017 9:50 PM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM

మనిషి కాటు..ఇక చాలు!

మనిషి కాటు..ఇక చాలు!

– అలరించిన జాతీయ నాటిక పోటీలు
 
కర్నూలు(హాస్పిటల్‌): స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో కొనసాగుతున్న జాతీయ నాటిక పోటీలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. లలిత కళాసమితి అధ్యక్షుడు పత్తిఓబులయ్య అధ్యక్షతన రెండోరోజైన సోమవారం నాటికలను ప్రదర్శించారు. గుంటూరు జిల్లా కర్రిపాడుకు చెందిన ఉషోదయ కళానికేతన్‌ వారు ప్రదర్శించిన ‘గోవు మాలచ్చిమి’, నెల్లూరు జిల్లా చెన్నూరుకు చెందిన శ్రీ శాలివాహన కళామందిర్‌ వారి ‘మనిషికాటు’, పి. భవానీప్రసాద్‌ రచించిన, గోపరాజు విజయ్‌ దర్శకత్వం వహించిన శ్రీ సాయి ఆర్ట్స్‌ కొలకలూరి వారి ‘చాలు ఇక చాలు’ నాటికలు  ఆలోచింపజేశాయి. అంతకు ముందు ముఖ్యఅతిథి రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్‌ నాటిక పోటీలను ప్రారంభించి మాట్లాడారు.  సామాజిక ఇతివృత్తాలతో నాటికలు ప్రదర్శించడం అభినందనీయమన్నారు. నాటక రంగాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
 
అమ్మతనం గురించి తెలిపే గోవు మాలచ్చిమి
గుంటూరు జిల్లా కర్రిపాడుకు చెందిన ఉషోదయ కళానికేతన్‌ వారు ప్రదర్శించిన ‘గోవు మాలచ్చిమి’ నాటిక ఆకట్టుకుంది. మనిషిని కంప్యూటర్‌ శాసిస్తున్న కాలంలోనూ మహిళను మగవాడు శాసిస్తూనే ఉన్నాడని ఈ నాటిక చెబుతుంది. మన దేశంలో అమ్మకు, అమ్మతనానికి ఎంతో విలువ ఉందని, దయచేసి దాన్ని చెడగొట్టకండనే సందేశంతో ఈ నాటిక ముగుస్తుంది. రచన, దర్శకత్వం చెరుకూరి సాంబశివరావు వహించగా, చెరుకూరి సాంబశివరావు, జి. లహరి, జానారామయ్య, కె.మస్తాన్‌రావు నటించారు.
 
అపకారికి ఉపకారం చేయాలనే ‘మనిషి కాటు’
నెల్లూరు జిల్లా చెన్నూరుకు చెందిన శ్రీ శాలివాహన కళామందిర్‌ వారి ‘మనిషి కాటు’ నాటిక ఆలోచింపజేసింది. ఈ ప్రపంచం మొత్తం అవినీతితో కప్పివేయబడ్డా ఎక్కడో సమాజానికి దూరంగా ఉన్నా స్వచ్ఛమైన మనుషుల్లో దాగి ఉన్న మానవత్వపు విలువలు–నీతి నిజాయతీల ఉనికి ఇంకా మిగిలే ఉందని ఈ నాటిక చెబుతుంది. అపకారం చేసిన మనిషికి సైతం ఉపకారం చేసి పంపాలనే మనుషుల మానవత్వపు విలువలతో సాగే నాటిక మనిషి కాటు.  దీనికి రచన వలమేటి, దర్శకత్వం కెకె.రావు. వి. కృష్ణమూర్తి, పి. రామమనోహర్, ఎస్‌. జగన్మోహన్‌రావు, ఎం. ప్రసాద్, ఎ. రవి, ఎస్‌ఏ షరీఫ్, సుజాత నటించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement