అంతిమ తీర్పు..సమాజానికి కనువిప్పు
అంతిమ తీర్పు..సమాజానికి కనువిప్పు
Published Wed, May 17 2017 12:00 AM | Last Updated on Tue, Sep 5 2017 11:18 AM
- ముగిసిన జాతీయ నాటిక పోటీలు
- చాలు.. ఇక చాలు నాటికకు ప్రథమ బహుమతి
- ద్వితీయ స్థానంలో నిలిచిన ‘సప్తపది’
కర్నూలు(కల్చరల్): స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో మూడు రోజులుగా జరుగుతున్న జాతీయ స్థాయి నాటిక పోటీలు ముగిశాయి. మంగళవారం ప్రదర్శించిన ‘అంతిమ తీర్పు’ నాటిక సమాజానికి కనువిప్పు కలిగించింది. ప్రస్తుత కుటుంబంలోని బలహీనపడుతున్న బంధాల గురించి తెలియజేసింది. ఒక తల్లి ఒక దురదృష్ట సంఘటనకు కుమిలిపోతూ భర్తను, కొడును దూరం చేసుకోవడం, అనంతరం ఆ తల్లి జరిగిన సంఘటనకు పశ్చాత్తాపపడి భర్తను, కొడుకును దగ్గరికి తీసుకోవడం నాటకంలోని ప్రధాన ఒతివృత్తం. భవాని ప్రసాద్ రచించిన ఈ నాటకానికి డాక్టర్ సి.ఎస్.ప్రసాద్ దర్శకత్వం వహించారు.
చాలు...ఇక చాలు
జాతీయ స్థాయి నాటిక పోటీల్లో భాగంగా మంగళవారం ఉదయం 10:30 గంటలకు ప్రదర్శించిన చాలు.. ఇక చాలు నాటిక... ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు తమ పిల్లలు ఏది అడిగినా కాదు.. లేదు.. కుదరదు.. అని చెప్పకుండా ప్రతిదీ సమకూరుస్తున్నారు. ఆ తల్లిదండ్రులే వయస్సు మల్లిన తర్వాత పిల్లలను ఏది అడిగినా కాదు.. లేదు.. కుదరదు.. అని సులువుగా చెప్పేస్తున్నారు. తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్న ప్రస్తుత తరం వైఖరి చాలు.. ఇక చాలు.. అంటూ ప్రదర్శించిన సాంఘిక నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. భవాని ప్రసాద్ రచించిన ఈ నాటికకు గోపరాజు విజయ్ దర్శకత్వం వహించారు.
కల్లందిబ్బ..
సిరిమువ్వ కల్చరల్ అసోసియేషన్ వారి ‘కల్లం దిబ్బ’ నాటిక ప్రస్తుతం రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను చిత్రీకరించింది. దళారీలు రైతులను దోచుకోవడం, వ్యవసాయంలో తీరని నష్టాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల జీవితాలు కల్లం దిబ్బలా తయారయ్యాయని ఈ నాటిక తెలియజేసింది. రావి నూతల ప్రేమ కిషోర్ రచించిన ఈ నాటికకు బజారప్ప దర్శకత్వం వహించారు.
సమాజాన్ని మార్చే నాటికలు..
ముగింపు ఉత్సవంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, టీజీవి కళాక్షేత్రం చైర్మన్ టీజీ భరత్ మాట్లాడారు. నాటకం.. సమాజ మార్పునకు దోహదం చేస్తుందనిచెప్పారు. ప్రేక్షకులకు కనువిందు చేసి కనువిప్పు కల్గింగే శక్తి నాటకాలకు ఉందన్నారు. రాయలసీమ కళాకారులు సినీరంగంలో ఎదిగేందుకు, తక్కువ ఖర్చులో సినిమాలు నిర్మించేందుకు అవసరమైన సహకారాలు అందిస్తామన్నారు.
ఉత్తమ నాటికగా చాలు.. ఇక చాలు...
జాతీయస్థాయి నాటిక పోటీల్లో శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు నాటకసమాజం వారు ప్రదర్శించిన ‘చాలు.. ఇక చాలు..’ నాటిక ఉత్తమ నాటికగా ఎంపికయ్యింది. చిలకలూరిపేట అంజనా రాథోడ్ నాటక సమాజం ప్రదర్శించిన నాటిక సప్తపది ఉత్తమ ద్వితీయ నాటికగా, ఉషోదయ కళానికేతన్ కోటపాడు వారు ప్రదర్శించిన గోవు మహాలక్ష్మీ ఉత్తమ తృతీయ నాటికగా ఎంపికయ్యాయి. ‘మనిషి కాటు’ నాటికలోని ఆఫీసర్ పాత్రధారి వంజారి కృష్ణమూర్తి ఉత్తమ విలన్‌గా, ‘సందడే సందడి’ నాటికలోని దొంగ పాత్రధారి క్రొవ్విడి జోగారావు ఉత్తమ హాస్య నటుడుగా, ‘మనిషి కాటు’ నాటికంలోని పోలమ్మ పాత్రధారిణి సుజాత ఉత్తమ సహాయ నటిగా, ‘కల్లం దిబ్బ’ నాటికలోని వేణు పాత్రధారి మంజునాథ్ ఉత్తమ సహాయ నటుడుగా ఎంపికయ్యారు.
గోవు మా లక్ష్మీ’ నాటికలోని వెంకటలక్ష్మీ పాత్రధారి లహరి నత్తమ నటిగా, చాలు ఇక చాలు నాటికలోని రామారావు పాత్రధారి గోపరాజు రమణ ఉత్తమ నటుడుగా ఎంపికయ్యారు. రాజీ నాటిక దర్శకుడు పి.వి.శేషయ్య ఉత్తమ దర్శకుడిగా, చాలు ఇక చాలు నాటిక రచయిత భవాని ప్రసాద్ ఉత్తమ రచయితగా ఎంపికయ్యారు. పారిశ్రామికవేత్త టి.జి.భరత్, లలిత కళాసమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు ఈ కళాకారులను సన్మానించారు. న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన గోపిశెట్టి వెంకటేశ్వర్లు, వన్నెం బలరాం, సుభాన్ సింగ్, నాట్య కళాకారుడు కరీముల్లాలను సన్మానించారు. ఈమని రామకృష్ణప్రసాద్ పాడిన అన్నమయ్య కీర్తనలు ప్రేక్షకులను అలరించాయి. అనంతరం సలీం బాషా, మహమ్మద్ మియా, ఇనాయతుల్లా ప్రదర్శించిన హాస్యవల్లరి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో లలిత కళాసమితి ఉపాధ్యక్షులు సి.వి.రెడ్డి, కోశాధికారి బాల వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు రాజరత్నం, ఎన్.డి.క్రిష్టఫర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement