మండుతున్న పప్పుల ధరలు | manduthunna pappula dharalu | Sakshi
Sakshi News home page

మండుతున్న పప్పుల ధరలు

Published Tue, Oct 4 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

manduthunna pappula dharalu

 

  • గతేడాది వర్షాభావ పరిస్థితులే కారణం
  • ఈ సీజన్‌లో ఇంకా చేతికందని పంటలు

 
వైరా :వరుస పండగల వేళ పప్పుల ధరలకు రెక్కలొచ్చాయి. దసరా, మొహర్రం, దీపావళి పర్వదినాల నేపథ్యంలో పప్పులు.. నిప్పులుగా మారాయి. కందిపప్పు ధర కొండెక్కితే.. పెసర, ఎర్రపప్పు, మినప పప్పు ధరలు కూడా అదే స్థాయిలో మండిపోతున్నాయి. గతవారం రోజుల్లోనే పప్పుల ధరలు అమాంతంగా పెరిగాయి. కంది, శనగ, మినపప్పు, కేజీ రూ.20చొప్పున పెరిగింది. మరోవారం రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు వెల్లడిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్ణయించే ధరలను బట్టి మార్కెట్‌లో పప్పులు విక్రయిస్తారు. ఇటీవల పదిహేనురోజులపాటు కురిసిన అకాల వర్షం కారణంగా ఇతర రాష్ట్రాల్లో కంది, శనగ పంటల దిగుబడులు తగ్గిపోయాయి. దీంతో ఒక్కసారిగా మార్కెట్‌లో పప్పుల నిల్వలు తగ్గిపోయి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల వినాయక చవితి, బక్రీద్‌ పండుగలకు తెప్పించిన సరుకునే ప్రస్తుత మార్కెట్‌లో ధర పెంచి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లోని వరుస పండగల తర్వాత నవంబర్‌లో పప్పుల ధరలు మళ్లీ తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. దీనికి తోడు రెండేళ్లుగా కంది, శనగ పంటల దిగుబడి తగ్గిపోవడంతో మహరాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి పప్పులను దిగుమతి చేసుకోవడంతో ధరలు పెరుగుతున్నాయని మార్కెట్‌వర్గాలు అంటున్నాయి. ఖరీఫ్‌ పంటలు చేతికొస్తే కొంత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. శనగకు ప్రసిద్ధి చెందిన రాయలసీమలో పంటలు బాగానే ఉన్నప్పటికీ మరో రెండు నెలల్లో కోతకు వస్తే పప్పురేటు తగ్గవచ్చని చెబుతున్నారు.
రేషన్‌ దుకాణాల్లో నిలిచిన సరఫరా..
కొన్ని నెలల క్రితం వరకు ప్రభుత్వం రాయితీపై పేద, మధ్యతరగతి కుటుంబాలకు కందిపప్పు, మంచినూనె, గోధుమలు సరఫరా చేసేది. కొద్ది రోజులుగా సరఫరాను నిలిపివేశారు. ప్రభుత్వం ఒక రేషన్‌ కార్డుపై ప్రతినెలా కేవలం 400 గ్రాముల గోధుమలు, 500 గ్రాముల చక్కెర ఇవ్వాలని ఆదేశించగా, పౌరసరఫరాల శాఖ నుంచి గోధుమలు తీసుకునేందుకు డీలర్లు జంకుతున్నారు. చక్కెర మాత్రం ప్రతి నెలా ఒక్కో రేషన్‌ కార్డుపై అరకిలో చొప్పున ఇస్తున్నారు. గోధుమల కోసం డీలర్లు డీడీలు చెల్లించడం లేదు.
------------------------------------------------------
అక్టోబర్‌లో పప్పుల ధరలు (రూ.ల్లో)..
------------------------------------------------------
పప్పు   2015    2016
------------------------------------------------------
కంది    120     140
శనగ      70     130
పెసర     85     100
ఎర్ర       80     100
మినప   140     160
-------------------------------------------------------

పప్పులు కొనాలంటే భయమేస్తోంది..
ఇది వరకు కూరగాయలతోపాటు పప్పు తప్పకుండా వండుకునేవాళ్లం. పెరిగిన ధరలకు పప్పును వారంలో ఒక్కరోజు తినాలంటేనే ఆలోచించాల్సి వస్తోంది. ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. కనీసం రేషన్‌షాపుల్లో కొంత ఇచ్చినా సర్దుకుపోయేవాళ్లం. పూర్తిగా బయట కొనుగోలు చేయాలంటే ఇంటి సామానులో ఎక్కువ పప్పులకే ఖర్చు చేయాల్సి వస్తోంది.
- కంచర్ల వీణాకుమారి, మాజీ జెడ్పీటీసీ, వైరా



 

Advertisement
Advertisement