సాక్షి, అమరావతి: రైతన్నలు పండించిన ప్రతి ధాన్యం గింజను ఆర్బీకే వ్యవస్థ ద్వారా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతుల దగ్గర నుంచి ఆఖరి గింజ వరకు కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా రైతుల ఖాతాలకే నేరుగా డబ్బులు జమ చేస్తున్నామన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో దళారీ వ్యవస్థను ప్రోత్సహించింది చంద్రబాబేనన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న సీఎం జగన్ ప్రభుత్వంపై ఈనాడు రామోజీరావుకు ఎందుకింత కక్ష? అని ప్రశ్నించారు. రామోజీరావు ఎలాంటి వారో ఆయన తోడల్లుడిని అడిగినా చెబుతారన్నారు. మంత్రి కారుమూరి ఆదివారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబువి అబ్రకదబ్ర హామీలని, నయ వంచనకు ఆయన కేరాఫ్ అని ధ్వజమెత్తారు.
- రైతులకు చంద్రబాబు ఎంత ద్రోహం చేసినా రామోజీకి కనపడదు, వినపడదు. టీడీపీ పాలనలో దోచుకో దాచుకో పద్ధతిని అనుసరించారు. చంద్రబాబు హయాంలో 2.65 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తే గత నాలుగేళ్లలో సీఎం జగన్ 3.10 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 2014 – 19 మధ్య 17.94 లక్షల మంది రైతులకు రూ.40,236 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయి. నాలుగేళ్లలో సీఎం జగన్ 32.78 లక్షల మంది రైతులకు పారదర్శకంగా రూ.58,765 కోట్లు చెల్లింపులు చేశారు.
- రైతులకు చంద్రబాబు ఎంత ద్రోహం చేసినా, గిట్టుబాటు ధర కల్పించకపోయినా రామోజీరావు, దత్తపుత్రుడు ఏనాడూ మాట్లాడలేదు. చంద్రబాబు ఎంత దుర్మార్గాలకు పాల్పడ్డారో రైతులందరికీ తెలుసు.ఇన్‌పుట్ సబ్సిడీని ఎగ్గొట్టారు. 2014 ఇన్‌పుట్ సబ్సిడీ కూడా సీఎం జగన్ వచ్చాకే ఇచ్చారు. ఇప్పుడు ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూ్యరెన్స్ ఆ పంట కాలంలోనే ఇస్తున్నాం.
- తెలంగాణలో ధాన్యాన్ని ఇతరులు ఎవరూ కొనరు. ఆ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఏపీలో స్వర్ణ రకం, ఇతర అన్ని రకాల ను పండిస్తారు. మన దగ్గర పండే ధాన్యాన్ని రైతుల నుంచి ఎంఎస్‌పీ కంటే ఎక్కువ ధరకు బయ్యర్లు కొనుగోలు చేస్తారు. ఐదేళ్ల నుంచి బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయని కేంద్ర ప్రభుత్వంతో కొనిపించే ఏర్పాట్లు చేశాం. బొండాలను కొనుగోలు చేయాలనుకుంటే కొంత మాత్రమే వచ్చింది. విక్రయించాలని రైతులను కోరినా అమ్మలేదు. కేరళ అడిగిన బొండాలు రకం కూడా కొనుగోలు చేశాం. కేరళలో ఓనమ్ పండుగ వరకు మన రైతులు నిల్వ చేస్తారు. అలా నిల్వ చేయటం వల్ల రూ.1900లకు అమ్మటంతో రైతులకు ఎంతో లాభం వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment