
పెళ్లి బృందం వీరంగం
బుక్కరాయసముద్రం : మండల కేంద్రంలోని ఓ హోటల్‌లో పెళ్లి బృందం సభ్యులు వీరంగం సృష్టించారు. నలుగురికి తీవ్ర గాయాలనాయి. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా ముద్దనూరు మండలం పెద్ద దుద్యాల గ్రామానికి చెందిన పెళ్లి కూతురు కవితను మరుట్ల గ్రామానికి చెందిన హరీష్‌కిచ్చి పెన్నహోబిళంలో శనివారం వివాహం జరిపించారు. పెళ్లి ముగించుకుని పెళ్లి కుమార్తె బంధువులు తమ స్వగ్రామానికి బయలు దేరారు. బీకేఎస్ మండల కేంద్రంలోకి రాగానే మినీ ఐచర్ వాహనం ఆపి అందులో కొందరు వ్యక్తులు బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్‌లో మద్యం సేవించారు.
అనంతరం బిల్లు విషయమై హోటల్ యజమాని రంగ నాయకులతో గొడవకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అంతటితో ఆగకుండా రోడ్డు పక్కనే ఉన్న రాళ్లను రువ్వుకున్నారు. ఈ ఘర్షణలో బీకేఎస్‌కు చెందిన హోటల్ నిర్వాహకుడు రంగనాయకులు, అతని అక్క లక్ష్మిదేవి, కడప జిల్లా పెద్ద దుద్యాలకు చెందిన మల్లేష్ నాయుడు, వాసు గాయపడ్డారు. ఇరు వర్గాల వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.