నీలిమా (ఫైల్ ఫొటో)
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
Published Sat, Oct 15 2016 10:29 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
జగ్గడిగుంటపాలెం (తెనాలి రూరల్): అనుమానాస్పదస్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. భర్త, అత్తింటి వారే వేధించి, హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన పొతకనూరి శ్రీను, విజయ దంపతులు తమ రెండో కుమార్తె నీలిమ (20)ను తెనాలి మండలం జగ్గడిగుంటపాలెంకు చెందిన కటికం గోపికి ఇచ్చి వివాహం చేశారు. అప్పటికే నీలిమకు మేనమామతో వివాహం కాగా, ఆమెను కొన్నాళ్లకే వదిలి వెళ్లాడు. గోపిని మొదటి భార్య వదిలి వెళ్లింది. గోపి, నీలిమకు మూడేళ్ల క్రితం వివాహమైంది. నీలిమకు తొలికాన్పులో బాబు పుట్టి కొద్దిరోజుల్లోనే చనిపోయాడు. అప్పట్నుంచి మరింత కట్నం తీసుకురావాలంటూ వేధింపులు ప్రారంభమయ్యాయి.
అయిదునెలల క్రితం పాప పుట్టింది. పుట్టింటికి కాన్పుకు వెళ్లిన నీలిమ వారం క్రితమే ఇక్కడకు బిడ్డతో వచ్చింది. మూడు రోజులుగా భార్యాభర్తలు వాదులాడుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి ఇరువురికి గొడవ జరగడంతో నీలిమ బిడ్డతో సహా అక్కడికి దగ్గర్లోని అత్తగారింటికి వెళ్లింది. ఉదయన్నే తాము అద్దెకుండే ఇంటికి వచ్చింది. ఆ కొద్ది సేపటికే ఇంట్లో ఉరికి వేలాడుతూ ఉందని స్థానికులు తెలిపారు. నీలిమ మెడను వైరుతో బిగించి గోపి హత్య చేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమె మెడ కమిలిపోయి ఉందని, ఒంటిపై గాయాలున్నాయని చెబుతున్నారు.
మొదట నీలిమ అస్వస్థతతో వైద్యశాలలో ఉందని శనివారం ఉదయం గోపీ ఫోను చేశాడని, రెండు గంటల అనంతరం ఉరి వేసుకుని మృతి చెందిందని ఫోను చేసి చెప్పాడని, అప్పటి నుంచి అతని ఫోన్ ఆఫ్ చేసి ఉందని నీలిమ తండ్రి పోతునూరి శ్రీను చెప్పారు. బంధువులు, తెలిసిన వాళ్ల ద్వారా సంబంధం కుదుర్చుకుని వివాహం చేశామని, పెళ్లినాడు లక్ష రూపాయలు కట్నం, వాచీ, ఉంగరం, అమ్మాయికి బంగారం కూడా పెట్టామని తెలిపాడు. మాచర్ల వద్ద ఉంటున్న పెద్ద కుమార్తె వద్దకు వెళ్లిన నీలిమ తల్లి విజయ సాయంత్రం జగ్గడిగుంటపాలెంకు చేరుకుంది. కుమార్తె మృతదేహం వద్ద ఆమె విలపించిన తీరు కంటతడి పెట్టించింది. కాగా, నీలిమను భర్త గోపి, పక్క పోర్షనులో ఉండే గోపి అమ్మమ్మ గురమ్మ కలిసి హత్య చేశారని తలిదండ్రులు ఆరోపించారు. అత్త నాగమ్మ, ఆడబిడ్డ, మామ, బావల సహకారం కూడా ఉందనీ ఆరోపణలు చేశారు. విషయం తెలుసుకున్న తాలూకా ఎస్‌ఐ అనిల్‌కుమార్, ఏఎస్‌ఐ ప్రసాదరావు తమ సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement