Published
Wed, Aug 24 2016 12:27 AM
| Last Updated on Mon, Sep 4 2017 10:33 AM
జిల్లా కోసం బలిదానం
జనగామ జిల్లా కాదేమోనని మనస్తాపం
ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుడు
బచ్చన్నపేటలో విషాదం
బచ్చన్నపేట : జనగామ జిల్లా రాదేమోననే బెంగతో ఓ యువకుడు ప్రాణం తీసుకున్నాడు. ప్రభుత్వం జిల్లాల ముసాయిదా ప్రకటించిన నాటి నుంచి మనో వేదనకు గురవుతున్న భవన నిర్మాణ కార్మికుడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రం ఇందిరానగర్‌కు చెందిన కొన్నె కిష్టయ్య–ఎల్లమ్మ కుమారుడు బాల్‌రాజు(28) భవన నిర్మాణ కార్మికునిగా పనిచేస్తున్నాడు. పని కోసం నిత్యం జనగామకు వస్తూ.. జిల్లా కోసం జరిగే ఉద్యమాలు, ఆందోళనలో చురుకుగా పాల్గొంటున్నాడు.
జనగామ జిల్లా కావడం లేదని కొద్ది రోజులుగా మానసిక వేదనకు గురవుతున్నాడు. ప్రభుత్వం సోమవారం ప్రకటించిన జిల్లాల ముసాయిదాలో జనగామ పేరు లేకపోవడంతో పేపర్ చూసుకుంటూ కుమిలిపోయాడు. అన్నా.. జనగామ జిల్లా వస్తదంటవా.. ఆమరణ దీక్ష చేసే నాయకులు చనిపోతే ఎలా.. అంటూ కనిపించిన ప్రతి ఒక్కరినీ అడిగేవాడని స్థానికులు చెబుతున్నారు. నిత్యం పని కోసం జనగామకు వచ్చే బాలరాజు మంగళవారం జనగామకు రాలేదు. ఇంటి వద్దనే దిగాలుగా ఉన్నాడు. అతని భార్య రాఖీ పండుగకు పుట్టింటికి వెళ్లింది.
మంగళవారం ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో బాలరాజు ఇంట్లో దూలానికి ఉరివేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత తల్లిదండ్రులు కిష్టయ్య, ఎల్లమ్మలు ఇంటికి రాగా బాలరాజు దూలానికి వేలాడుతూ కనిపించాడు. వారు బోరున విలపిస్తూ ఇరుగుపొరుగు వారిని పిలిచారు. అప్పటికే బాలరాజు మృతిచెందాడు. అన్నం తినరా బిడ్డా..అని ఎంత బతిమిలాడినా పేపరు చదువుతూ దిగాలు చెందాడని తండ్రి విలపించారు. ఒక్క కొడుకని గారాబంగా చూసుకున్నామన్నారు. ఇంటికి పెద్ద దిక్కుగా..రోజువారి కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న బాలరాజు మృతితో వారు దిక్కులేని వారయ్యారు.
మృతునికి ఏడాది వయస్సుగల కుమారుడు ఉన్నాడు. కాగా, బాలరాజు ఆత్మహత్య చేసుకున్నాడనే సమాచారం అందుకున్న జిల్లా ఉద్యమకారులు, రాజకీయ పార్టీల నాయకులు బచ్చన్నపేటకు వచ్చి సంతాపం ప్రకటించారు. ప్రభుత్వం స్పందించి వెంటనే జనగామ జిల్లా చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కోసం జనగామ పట్ణణంలో ఇప్పటి వరకు ముగ్గురు గుండెపోటుతో మృతిచెందారు. ఇప్పుడు బచ్చన్నపేటలో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.