నర్సాపూర్‌లో జరుగుతున్న పరీక్షల్లో చూసిరాస్తున్న అభ్యర్థి
- దూరవిద్య పరీక్షల్లో మాస్ కాపీయింగ్
- ఇష్టారాజ్యంగా పరీక్షల నిర్వహణ
- పర్యవేక్షకులు లేకుండానే ఎగ్జామ్స్
- జవాబు పత్రాలు పంపడంలోనూ నిదానమే
- ఇదీ శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ డిస్టెన్స్ పరీక్షల తీరు
నర్సాపూర్: శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ డిస్టెన్స్ వార్షిక పరీక్షల్లో చూసి రాతల హడావిడి ఎక్కువైంది. డిగ్రీ, పీజీ పరీక్షలు రాసే అభ్యర్థులు పుస్తకాలు దగ్గర పెట్టుకుని మరీ రాసేసుకుంటున్నారు. నర్సాపూర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌లో కొనసాగుత్ను స్టడీ సెంటర్‌లో కొన్నేళ్లుగా ఈ తతంగం జరుగుతున్నట్లు సమాచారం. మాస్ కాపీయింగ్ కోసం స్కూల్ యాజమాన్యం అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఎక్కువ మందికి ‘అవసరం’
దూరవిద్యలో పరీక్షలు రాసేవారిలో ప్రమోషన్ల కోసం కొందరు ఉద్యోగస్తులు రాస్తుండగా.. మరికొందరు ఇతర వ్యాపకాలు ఉన్నవారు. దీంతో వీరంతా కాపీయింగ్‌పై ఆధారపడుతున్నారు. అభ్యర్థుల అవసరాలను నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. అదనంగా డబ్బులు వసూలు చేస్తూ చూసి రాతలకు అవకాశం ఇస్తున్నారు. ఇంత జరుగుతున్నా యూనివర్సిటీ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
పరీక్ష కేంద్రం మార్పు
నర్సాపూర్‌తో పాటు తూప్రాన్‌లోని స్టడీ సెంటర్‌కు చెందిన అభ్యర్థులకు నర్సాపూర్‌లోని వైష్ణవి డీఎడ్ కాలేజీలో పరీక్షలు నిర్వహించాల్సిందిగా యూనివర్సిటీ ఆదేశించింది. ఈ మేరకు హాల్‌టికెట్లు జారీ చేసింది. కాగా, యూనివర్శిటీ సూచించిన కాలేజీ భవనం కాకుంగా స్థానిక స్టడీ సెంటర్, తూప్రాన్‌కు చెందిన స్టడీ సెంటర్ నిర్వాహకులు కలిసి నర్సాపూర్‌కు దూరంగా ఉన్న ఓ కొత్త భవనంలో ఎగ్జామ్ సెంటర్ కొనసాగిస్తున్నారు.
కనీసం పరీక్షలు నిర్వహిస్తున్న భవనం వద్ద సూచిక బోర్డు సైతం ఏర్పాటు చేయలేదు. సెంటర్ మార్పుపై ‘సాక్షి’ ప్రశ్నించగా.. వైష్ణవి డీఎడ్ కాలేజీలో గదులు సరిపోనందున కొత్త భవనంలోకి కేంద్రాన్ని మార్చామని పరీక్షల సూపరింటెండెంట్ నర్సింహారెడ్డి చెప్పారు.
మాస్ కాపీయింగ్ ఇలా..
పలువురు అభ్యర్థులు పుస్తకాలు పక్కన పెట్టుకుని పరీక్షలు రాస్తుండగా.. ఇంకొందరు చీటీలు తెచ్చుకున్నారు. మరికొందరైతే పక్కపక్కనే కూర్చొని రాసుకుంటున్నారు. పరీక్షలు జరుగుతున్నపుడు యూనివర్శిటీకి ఇన్విజిలేటర్ అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఇన్విజిలేటర్ ఆదివారం వచ్చారని, సోమవారం సిద్దిపేట వెళ్లారని సెంటర్ నిర్వాహకులు చెప్పారు.
జవాబు పత్రాలు పంపడంలో జాప్యమే
పరీక్ష కేంద్రం ఇన్‌చార్జిలు జవాబు పత్రాలను వెంటనే సంబంధిత సెంటర్‌కు పంపించడం లేదని తెలిసింది. ఆదివారం జరిగిన పరీక్షకు సంబంధించిన జవాబు పత్రాలను సోమవారం మధ్యాహ్నం వరకు పంపకపోవడం ఇందుకు ఉదాహరణ. సోమవారం పరీక్షలు జరుగుతుండగా.. కొందరు యువకులు ఆదివారం పూర్తయిన పరీక్ష జవాబు పత్రాలను ప్యాక్ చేస్తున్నారు. అక్కడ కూడా అధికారులెవరూ లేరు.