పీజీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్
– ఎస్వీ యూనివర్సిటీ అధికారుల సాక్షిగా చూచిరాత
– పాస్ గ్యారెంటీ పేరుతో ప్రోత్సహిస్తున్న కళాశాల యాజమాన్యం
– స్లిప్పులు ఇచ్చి దగ్గరుండి రాయిస్తున్న వైనం
– రాసుకుపో అంటూ మీడియాపై ప్రిన్సిపాల్ ఆగ్రహం
గాజులపల్లె(మహానంది): ఒకటో తరగతో...రెండో తరగతో కాదు...భవిష్యత్తులో అధ్యాపకులు, ఉన్నత స్థాయి ఉద్యోగులుగా తీర్చిదిద్దే పోస్టుగ్రాడ్యుయేట్ పరీక్షలను ఓ కాలేజీ యాజమాన్యం చూచిరాతగా మార్చేసింది. అభ్యర్థుల నుంచి పాస్ గ్యారంటీ అని రూ.వేలల్లో వసూళ్లు చేసిన కాలేజీ యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా అభ్యర్థులను పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడేలా చేస్తోంది. మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని ఓ భవనంలో భారతి డిగ్రీ కళాశాలను నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం పోస్టుగ్రాడ్యుయేట్ ఎంఏ, ఎంఎస్సీ ప్రథమ సంవత్సరం పరీక్షలను దూర విద్యా విధానం ద్వారా నిర్వహిస్తున్నారు. ఎస్వీ యూనివర్సిటీ ద్వారా రాయిస్తున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ పరీక్షలు జరుగుతున్నాయి. 200 మందికి గాను ప్రతి రోజూ 150 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. శనివారం నాలుగో పేపర్ పరీక్షను నిర్వహించారు. మాస్ కాపీయింగ్ జరుగుతున్న విషయం తెలుసుకున్న మీడియా అక్కడికి వెళ్లడంతో వారి బండారం బయటపడింది. పక్కపక్కనే టేబుల్‌కు ఇద్దరు, ముగ్గురు చొప్పున కూర్చోబెట్టి స్లిప్పులు ఇచ్చి మరీ రాయిస్తున్నారు. అక్కడికి వెళ్లిన మీడియాపై ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు దురుసుగా ప్రవర్తించారు. ‘మీ ఇష్టం వచ్చినట్లు రాసుకోండి. ఎలా మేనేజ్ చేసుకోవాలో నాకు తెలుసంటూ ’ పేర్కొన్నారు. ఈ విషయంపై అక్కడే ఉన్న ఎస్సీ యూనివర్సిటీ తరపున వచ్చిన చీఫ్ సూపరింటెండెంట్ శ్రీలక్ష్మి ‘సాక్షి’తో మాట్లాడుతూ పరీక్షలు నిర్వహించే కళాశాలలు ఇలాంటివి ఎంకరేజ్ చేయరాదని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పడం గమనార్హం.