మంత్రిగారి భార్యా...మజాకా?!
మంత్రికే కాదు మంత్రిగారి భార్యకు కోపమొచ్చినా సిబ్బందికి శంకరిగిరి మాన్యాలు తప్పవు. తాజాగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఏరియా ఆస్పత్రి సిబ్బంది ఇదే గతి పట్టింది. గుంటూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి భార్య... ఆస్పత్రి సిబ్బంది తన మాట వినలేదని, తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని కోపగించుకున్నారు. అందుకే, ఆ ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది ఏ ఒక్కరు కూడా అక్కడ పనిచేయటానికి వీల్లేదని భీష్మించారు.
అంతే...తన భర్త (మంత్రి)కు విషయాన్ని చెప్పడమే కాకుండా, వైద్యవిధాన పరిషత్ కమిషనర్‌ను సైతం పిలిపించుకుని అక్కడున్న సిబ్బందిని మొత్తం బదిలీ చేయాలని హుకుం జారీ చేయించేశారు. దీంతో సంబంధిత శాఖా మంత్రికూడా విధిలేని పరిస్థితిలో ఒప్పుకోవాల్సి వచ్చింది. అంతే ఇక పరిపాలనా కారణాలు (అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్) కింద ఒకేసారి 14 మంది సిబ్బందిని బదిలీ చేశారు. ఒక డెంటల్ డాక్టరును కంభంకు వేయగా, మరో ప్రసూతి వైద్యురాలిని మాచర్లకు, ఇద్దరు నర్సులను కందుకూరుకు, మరో ఇద్దరు నర్సులను మార్కాపురం ప్రాంతాలకు బదిలీచేశారు.
మరో డాక్టర్ అదే జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడిని ఆశ్రయించడంతో ఆపేశారు. తాజాగా జరిగిన బదిలీల్లో ఒకే ఆస్పత్రినుంచి మొత్తం సిబ్బందిని పూర్తిగా మార్చడమనేది చిలకలూరిపేట ఏరియా ఆస్పత్రినుంచే జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పం ఆస్పత్రి నుంచి కూడా చాలామందిని బదిలీ చేసినట్టు తెలిసింది. మంత్రి భార్యకు నచ్చకపోతే ఇంతమందిని బదిలీ చేయడమనేది గతంలో ఎప్పుడూ చూడలేదని, ఇప్పుడే చూస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది.
బదిలీ చేసింది వాస్తవమే...
చిలకలూరిపేట ఏరియా ఆస్పత్రిలో ఉద్యోగులను బదిలీ చేసింది వాస్తవమే. అక్కడ సిబ్బంది సరిగా పని చేయడం లేదనే బదిలీ చేశాం. ఇది కూడా ఒక ప్రక్షాళనలాంటిదే. త్వరలోనే డాక్టర్లను నియమిస్తాం. ఇప్పటికే కాంట్రాక్టు డాక్టర్ల ఫైలు నడుస్తోంవది. వాళ్లని ఎంపిక చేయగానే చిలకలూరిపేట ఆస్పత్రికి వేస్తాం.
-డాక్టర్ నాయక్
వైద్య విధాన పరిషత్ కమిషనర్