గల్లంతైన డిగ్రీ విద్యార్థి మృతి
కూడేరు (ఉరవకొండ) : కూడేరు మండలం పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)లో గల్లంతైన డిగ్రీ విద్యార్థి మూడో రోజు శవమై తేలాడు. తమ కుమారుడు ప్రాణాలతో తిరిగి వస్తాడని ఎదురుచూసిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. విగతజీవుడైన తనయుడిని చూసి బోరున విలపించారు. వివరాలిలా ఉన్నాయి. అనంతపురానికి చెందిన చంద్రశేఖర్, వసుంధర దంపతుల తనయుడు చక్రపాణి (20) స్నేహితులతో సరదాగా గడిపేందుకు బుధవారం పీఏబీఆర్‌కు వచ్చారు. ఇద్దరు స్నేహితులతో కలిసి అతను తెప్పలో ఎక్కి విహారానికి బయల్దేరారు. కాస్త దూరం వెళ్లగానే అదుపుతప్పి తెప్ప బోల్తాపడింది.
ఇద్దరు స్నేహితులు గట్టుకు చేరుకోగా.. చక్రపాణి నీటమునిగాడు. సీఐ శివనారాయణ స్వామి, ఎస్‌ఐ రాజు, హెడ్‌కానిస్టేబుల్ దస్తగిరి, సిబ్బంది అనిల్, దుర్గాప్రసాద్, ప్రభు, కరీం, ఫైరింజన్ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఫలితం దక్కలేదు. శుక్రవారం ఉదయం చ్రక్రపాణి శవమై తేలాడు. కన్నకొడుకు కోసం వేయికళ్లతో ఎదురుచూసిన తల్లిదండ్రులకు చివరకు గర్భశోకమే మిగిలింది. మృతదేహంపై పడి బోరున విలపించారు. ‘బుజ్జి కన్నా.. అప్పుడే నీకు నిండు నూరేళ్లు నిండాయా’ అంటూ విలపించారు.
స్నేహితులపై ఫిర్యాదు
తమ కుమారుడిని స్నేహితులే నీటిలోకి తోసేశారని అనుమానం వ్యక్తం చేస్తూ చక్రపాణి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు.