degree student dies
-
టిక్‌టాక్.. తీసింది ప్రాణం!
హోసూరు: టిక్‌టాక్‌లో పేరుపొందాలనే తపనతో వినూత్నంగా విన్యాసాలు చేస్తూ కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. టిక్‌టాక్ వీడియో తీస్తూ ప్రాణంతో ఉన్న చేపను మింగిన యువకుడు ఊపిరాడక చనిపోయిన సంఘటన గురువారం కర్ణాటక రాష్ట్రం హోసూరులో చోటు చేసుకొంది. హోసూరులోని కేలైకుంట పార్వతీనగర్‌కు చెందిన శరవణన్ కొడుకు వెట్రివేల్(22) డిగ్రీ విద్యార్థి. టిక్‌టాక్‌లో ప్రదర్శన కోసం ప్రాణంతో ఉన్న చేపను మింగాడు. అది గొంతులో ఇరుక్కుని శ్వాస ఆడక గిలగిల్లాడుతున్న వెట్రివేల్‌ను హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిశీలించిన డాక్టర్లు అప్పటికే అతడు మృతి చెందినట్లు ధృవీకరించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా..
మణుగూరుటౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పరిధిలోని మల్లేపల్లి వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లి నీటిలో మునిగి విద్యార్థి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు, స్నేహితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాపనకుంట గ్రామానికి చెందిన ఈసం రామ్‌చరణ్ (21) పట్టణంలోని శ్రీ విద్య డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఆదివారం కావడంతో స్నేహితులతో సరదాగా ఈత కొట్టేందుకు గోదావరి నదికి వెళ్లాడు. గోదావరిలో స్నానానికి దిగగా మునిగిపోయాడు. రక్షంచండి.. రక్షించండి.. అని కేకలు వేసినా ఒడ్డున ఉన్న తోటి మిత్రులకు ఈత రాకపోవడంతో ఏమీ చేయలేకపోయారు. చుట్టు పక్కల వారు వచ్చేలోపే గోదావరిలో మునిగి గల్లంతయ్యాడు. స్నేహితులు పోలీసులు, కుటంబ సభ్యులకు సమాచారం అందిచారు. సంఘటనా స్థలాన్ని సీఐ రమేష్‌బాబు సిబ్బందితో పరిశీలించి గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 7 గంటల ప్రాంతంలో మునిగిపోయిన ప్రాంతానికి కొద్ది దూరంలో రామచరణ్ మృతదేహం లభ్యమైంది. రామ్‌చరణ్ ఈ మధ్యనే పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ ఎంపికల్లో అర్హత సాధించాడు. తండ్రి ఈసం వెంకటస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి కొంత కాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. చేతికందిన కొడుకు ఉద్యోగం సాధించి తమ కుటుంబ కష్టాలు తీరుస్తాడని ఎన్నో ఆశలతో ఎదురు చూసిన కుటుంబ సభ్యులు రామ్‌చరణ్ మరణవార్త విని గుండెలవిసేలా రోదించారు. అనుకోని సంఘటనతో బాపనకుంట గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. -
గల్లంతైన డిగ్రీ విద్యార్థి మృతి
కూడేరు (ఉరవకొండ) : కూడేరు మండలం పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)లో గల్లంతైన డిగ్రీ విద్యార్థి మూడో రోజు శవమై తేలాడు. తమ కుమారుడు ప్రాణాలతో తిరిగి వస్తాడని ఎదురుచూసిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. విగతజీవుడైన తనయుడిని చూసి బోరున విలపించారు. వివరాలిలా ఉన్నాయి. అనంతపురానికి చెందిన చంద్రశేఖర్, వసుంధర దంపతుల తనయుడు చక్రపాణి (20) స్నేహితులతో సరదాగా గడిపేందుకు బుధవారం పీఏబీఆర్‌కు వచ్చారు. ఇద్దరు స్నేహితులతో కలిసి అతను తెప్పలో ఎక్కి విహారానికి బయల్దేరారు. కాస్త దూరం వెళ్లగానే అదుపుతప్పి తెప్ప బోల్తాపడింది. ఇద్దరు స్నేహితులు గట్టుకు చేరుకోగా.. చక్రపాణి నీటమునిగాడు. సీఐ శివనారాయణ స్వామి, ఎస్ఐ రాజు, హెడ్‌కానిస్టేబుల్ దస్తగిరి, సిబ్బంది అనిల్, దుర్గాప్రసాద్, ప్రభు, కరీం, ఫైరింజన్ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఫలితం దక్కలేదు. శుక్రవారం ఉదయం చ్రక్రపాణి శవమై తేలాడు. కన్నకొడుకు కోసం వేయికళ్లతో ఎదురుచూసిన తల్లిదండ్రులకు చివరకు గర్భశోకమే మిగిలింది. మృతదేహంపై పడి బోరున విలపించారు. ‘బుజ్జి కన్నా.. అప్పుడే నీకు నిండు నూరేళ్లు నిండాయా’ అంటూ విలపించారు. స్నేహితులపై ఫిర్యాదు తమ కుమారుడిని స్నేహితులే నీటిలోకి తోసేశారని అనుమానం వ్యక్తం చేస్తూ చక్రపాణి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు.