- పెరుగుతున్న రహదారి ప్రమాదాలు
- సైబర్ నేరాల పరిశోధనకు ప్రత్యేక టీం
- క్రైం ప్రాపర్టీని లీగల్‌గా వారంలో డిస్పోజ్ చేసేలా చర్యలు
నగరంపాలెం (గుంటూరు జిల్లా) : నూతన రాజధాని ప్రాంతం విజయవాడ-గుంటూరులోని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ నండూరి సాంబశివరావు చెప్పారు. మంగళవారం గుంటూరులో మోడల్ స్టేషన్ల ఏర్పాటుకు వసతుల పరిశీలనకు వచ్చిన డీజీపీ విలేకరులతో మాట్లాడారు. సిబ్బంది పనిచేయటానికి వీలుగా అనుకూలమైన వసతులతో మోడల్ పీఎస్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెండువేల పోలీస్‌స్టేషన్‌లను దశలవారీగా 100 చొప్పున మోడల్ స్టేషన్‌లుగా మార్పుచేసే ఆలోచనలో ఉన్నామన్నారు.
2014లో మొత్తం లక్షా 14 వేల కేసులు నమోదు కాగా రహదారి ప్రమాదాలు, సైబర్ నేరాలు గతం కంటే పెరిగాయన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన, పరిశోధన అధికారులు, సిబ్బందికి శిక్షణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. వీటి కోసం ప్రతి జిల్లాలో సాంకేతిక అంశాలపై పూర్తి అవగాహన ఉన్న సిబ్బందితో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివిధ కారణాలతో సీజ్ చేసిన క్రైం ప్రాపర్టీ వాహనాలను లీగల్‌గా వారం రోజుల్లో డిస్పోజల్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు.
ఎస్‌హెచ్‌వోల పనితీరు మెరుగుపర్చుకోవాలి
పోలీస్‌స్టేషన్ హౌస్ ఆఫీసర్ల పని తీరు మెరుగుపర్చుకోవాలని గుంటూరులోని నగరంపాలెం, పాతగుంటూరు పోలీస్‌స్టేషన్‌లను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీజీపీ నండూరి సాంబశివరావు ఆదేశించారు. రికార్డుల నిర్వహణ, ఫిర్యాదుల అధికారులు, సిబ్బంది స్పందనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రవాప్తంగా జిల్లా ఎస్పీలు, ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. డీజీపీతో పాటు గుంటూరు రేంజి డీఐజీ సునీల్‌కుమార్, అర్బన్, రూరల్ ఎస్పీలు సర్వశ్రేష్ఠ త్రిపాఠి. నారాయణ్ నాయక్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.