ప్రశాంతంగా ఎంపీటీసీ, వార్డు సభ్యుల ఎన్నికలు | MPTC, ward members elections peacefull | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఎంపీటీసీ, వార్డు సభ్యుల ఎన్నికలు

Published Fri, Sep 9 2016 12:37 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

MPTC, ward members elections peacefull

జిల్లాలోని పలు ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యుల స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు నిర్వహించారు. వార్డు సభ్యుల స్థానాలకు పోలైన ఓట్లను వెంటనే లెక్కించి సాయంత్రంలోగా ఫలితాలు వెల్లడించారు. ఇక ఎంపీటీసీ సభ్యుల స్థానాలకు పోలైన ఓట్లను శనివారం లెక్కించనున్నట్లు అధికారులు తెలిపారు.
 
మరిగడిలో 81.86 శాతం పోలింగ్‌
జనగామ : జనగామ మండలం మరిగడి ఎంపీటీసీ ఉప ఎన్నిక గురువారం జరి గింది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కృష్ణ, అసిస్టెంట్‌ అధికారి హసీ మ్‌ ఆధ్వర్యం లో పర్యవేక్షించగా సీఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఎన్నికల బరిలో ఉన్న దూడల సిద్ధయ్య(కాంగ్రెస్‌), మేకల కలింగరాజు (టీఆర్‌ఎస్‌), బాల్నె వెంకటరాజు(సీపీఎం), తల్లూరి అశోక్‌(టీడీపీ) బరిలో ఉండగా, మరిగడిలోని రెండు బూత్‌ల్లో 1,852 ఓట్లకు 1,487(84 శాతం), చౌడారంలో 1,054 ఓట్లకు 892 (80 శాతం) ఓట్లు పోలయ్యాయి. గతంలో మరిగడి ఎన్నికల్లో 90 శా తం పోలింగ్‌ నమోదు కాగా, ఈసారి 81.86 శాతం మాత్రమే నమోదైంది. మండల పరిషత్‌ కార్యాలయంలో ఓట్ల లెక్కింపు శనివారం నిర్వహిస్తారు.
 
నారాయణపురంలో 75.68 శాతం..
బచ్చన్నపేట : మండలంలోని నారాయణపురం ఎంపీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించగా రిటర్నింగ్‌ అధికారి సదానందం, ఎన్నికల అధికారి, ఎంపీడీఓ రమేష్‌ ప్రయవేక్షించారు. నక్కవాని గూడెం, నారాయణపురం గ్రామాల్లో బూత్‌లు ఏర్పాటుచేయగా 1557 మంది ఓటర్లకు 1178 మంది  ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనగామ ఆర్డీవో వెంకట్‌రెడ్డి, తహసిల్థార్‌ విజయభాస్కర్‌ పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేయగా జనగామ డీఎస్పీ పద్మనాభరెడ్డి, సీఐ చంద్రశేఖర్‌ బందోబస్తు నిర్వహించారు.
 
జాకారం సర్పంచ్‌గా సాగర్‌
ములుగు : జాకారం సర్పంచ్‌ స్థానానికి గురువారం నిర్వహించిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గండ్రత్‌ సాగర్‌ గెలుపొందారు. సర్పంచ్‌ గండ్రత్‌ రాజక్క అనారోగ్యంతో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నికలు నిర్వహించగా టీఆర్‌ఎస్‌ నుంచి సాగర్‌తో పాటు టీడీపీ నుంచి గొర్రె రఘుపతి, కాంగ్రెస్‌ నుంచి రాసమల్ల రజినీకాంత్‌ నిలిచారు. ఈ మేరకు 970 ఓట్లకు 632 ఓట్లు(65శాతం) పోలయ్యాయి. ఈ సందర్భంగా సాగర్‌కు 594 ఓట్లు రాగా, ఆయన తర్వాత రఘుపతికి 17 ఓట్లు వచ్చాయి. దీంతో సాగర్‌ 577 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు అధికారులు వెల్లడించారు.సీఐ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటుచేయగా ఎంపీడీఓ విజయ్‌స్వరూప్, ఈఓపీఆర్డీ రమేష్‌ పరిశీలించారు. కాగా, ప్రస్తుతం సర్పంచ్‌గా గెలుపొందిన సాగర్‌ వయస్సు 22 ఏళ్లే. గత ఏడాది ఆయన డిగ్రీ పూర్తి చేయగా, తన తల్లి, సర్పంచ్‌గా ఉన్న రాజక్క మృతి చెందడంతో ఆమె స్థానంలో నిలిచి గెలుపొందారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గట్టు మహేందర్‌ ఆధ్వర్యంలో శ్రీనివాస్‌రెడ్డి, రామస్వామి, బ్రహ్మచారి, చేరాలు, గండ్రత్‌ దామోదర్‌ సంబరాలు చేసుకున్నారు.
 
రెండు పంచాయతీల్లో చెరొకటి...
కొడకండ్ల : మండలంలోని రెండు గ్రామపంచాయతీల్లో రెండు వార్డు సభ్యులకు గురువారం ఎన్నికలు నిర్వహించారు. ఏడునూతుల 12వ వార్డు ఎన్నికలో టీఆర్‌ఎస్‌ బలపర్చిన మాలోత్‌ రమ్మి కాంగ్రెస్‌ బలపర్చిన గుగులోత్‌ అమ్మిపై 70 ఓట్లతో, రంగాపురం ఐదో వార్డు ఎన్నికలో కాంగ్రెస్‌ బలపర్చిన జక్కుల సంజీవ టీఆర్‌ఎస్‌ బలపర్చిన సుందరమ్మపై 7 ఓట్ల తేడాతో విజయం సాధించగా కాంగ్రెస్‌ నాయకులు సంబరాలు చేసుకొన్నారు. 
 
పాలకుర్తిలో మూడు.. ఒకటి
పాలకుర్తి : నియోజకవర్గంలో నాలుగు గ్రామపంచాయతీల్లో నాలుగు వార్డు సభ్యుల స్థానాలకు ఉప ఎన్నిక జరిగాయి. ఈ ఎన్నికల్లో మూడింటిని కాంగ్రెస్, ఒక స్థానాన్ని టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు గెలుచుకున్నారు. పాలకుర్తి మండలం బమ్మెర 6వ వార్డులో కాంగ్రెస్‌ బలపర్చిన దొంతరబోయిన ఉప్పలయ్య, దేవరుప్పుల మండలం కోలుకొండ 2వ వార్డు సభ్యుడిగా కాంగ్రెస్‌ బలపర్చిన కౌడగాని కృష్ణమూర్తి, కొడకండ్ల మండలం రంగాపురం గ్రామపంచాయతీ 5వ వార్డు సభ్యుడిగా జక్కుల సంజీవ, ఏడునూతుల గ్రామపంచాయతీ 12వ వార్డు సభ్యులుగా టీఆర్‌ఎస్‌ బలపర్చిన మాలోతు రమ్య గెలుపొందినట్లుగా అధికారులు ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement