
ఆర్కే నగర్ నుంచే జయ పోటీ
చెన్నై: వచ్చే నెల 27న తమిళనాడులో జరిగే ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి జయలలిత స్థానిక రాధాకృష్ణన్(ఆర్కే) నగర్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు అన్నాడీఎంకే పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు జయ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నుంచి జయకు విముక్తి లభించగానే ఆర్కే నగర్ ఎమ్మెల్యే వెట్రివేల్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె అక్కడి నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతూ వచ్చింది. తాజాగా దీన్ని ఆమె నిర్ధారించారు. ఇంతకుముందు ఆమె శ్రీరంగం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.
ఆస్తుల కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చే యాల్సి వచ్చింది. అయితే ఈ నెల 11న కర్ణాటక హైకోర్టు ఆమెపై కేసును కొట్టివేసిన నేపథ్యంలో ఆమె మళ్లీ సీఎం పీఠమెక్కి ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తున్నారు. మరోవైపు ఈ ఉప ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు డీఎంకే, పీఎంకే ప్రకటించాయి. ఈసారి ధన ప్రవాహమే కీలకపాత్ర పోషిస్తోందని, ఓటర్లకు అధికార పార్టీ భారీగా డబ్బులు పంచుతోందని పీఎంకే ఆరోపించింది. ఇక ఆర్కే నగర్‌లో పోటీ చేసే అంశంపై విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకేతో బీజేపీ తాజాగా చర్చలు జరిపింది.