టీఆర్ఎస్ పార్టీపై టీడీపీ నేత పెద్దరెడ్డి విరుచుకుపడ్డారు. టీడీపీలో పాలు తాగిన వారుంటే.. టీఆర్ఎస్లో గుడుంబా తాగే వాళ్లున్నారా అని ఆయన మంగళవారం ఇక్కడ ప్రశ్నించారు. టీడీపీ ఊట బావిలాంటిదని ఎంతమంది వెళితే అంతమంది నాయకులను తిరిగి తయారు చేసుకునే సత్తా తమ పార్టీకి ఉందని చెప్పారు.
కేసీఆర్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం కాదని కోతల ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. దమ్ముంటే టీడీపీ నుంచి గెలిచి వచ్చినవారికి మంత్రి పదవులు ఇవ్వడం కాకుండా వారితో రాజీనామాలు చేయించి నేరుగా ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. కేసీఆర్ మోసాలను ఎండగడుతూ ప్రభుత్వానికి మార్గదర్శకం చేసేందుకే తెలంగాణలో చంద్రబాబు పర్యటన అని చెప్పారు.